ట్రూనెట్‌లో కరోనా టెస్ట్‌

ABN , First Publish Date - 2020-04-08T09:01:12+05:30 IST

కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఏడు ప్రయోగశాలల్లో కలిపి 1200కు మించి పరీక్షలు చేయలేని అవస్థ తొలగిపోనుంది.

ట్రూనెట్‌లో కరోనా టెస్ట్‌

285 కేంద్రాల్లో వైరస్‌ పరీక్షలు.. వేగం పుంజుకోనున్న నిర్ధారణ

రోజుకు 7వేల నమూనాల పరిశీలన.. టీబీ కేంద్రాల్లోని యంత్రాల వినియోగం

ఐసీఎంఆర్‌ సూచనల మేరకు చర్యలు

ట్రూనెట్‌తో కరోనా టెస్ట్‌

285 కేంద్రాల్లో వైరస్‌ పరీక్షలు.. వేగం పుంజుకోనున్న నిర్ధారణ

రోజుకు 7వేల నమూనాల పరిశీలన.. టీబీ కేంద్రాల్లోని యంత్రాల వినియోగం

ఐసీఎంఆర్‌ సూచనల మేరకు చర్యలు


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఏడు ప్రయోగశాలల్లో కలిపి 1200కు మించి పరీక్షలు చేయలేని అవస్థ తొలగిపోనుంది. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు క్షయ (టీబీ) నిర్ధారణ కేంద్రాలలోని ట్రూ నెట్‌ యంత్రాల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించుకుంది. ఇవి అందుబాటులోకి వస్తే... రోజుకు ఏడువేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. రాష్ట్రంలో 240 ట్రూనెట్‌ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రాల్లో మరో 45 సీబీ నెట్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వెరసి... రాష్ట్రంలో మొత్తం 285 ట్రూనెట్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి.


ఇప్పుడు వీటిని కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే తిరుపతి ట్రూనెట్‌ కేంద్రంలో ప్రయోగాత్మకంగా కరోనా పరీక్షలు చేశారు. ఈ ఫలితాలను కరోనా ల్యాబ్‌లలో కూడా పరీక్షించారు. రెండుచోట్ల ఒకే రకమైన రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా మరొక ట్రూనెట్‌ సెంటర్‌లో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ కూడా ఫలితాలు ఒకే రకంగా వస్తే, పూర్తిస్థాయిలో ట్రూనెట్‌ సెంటర్లను కరోనా నిర్ధారణ కోసం ఉపయోగిస్తారు. 


పాజిటివ్‌ వస్తే మరోసారి నిర్ధారణ...

మరోవైపు ట్రూనెట్‌ సెంటర్లతో ఒక చిన్న సమస్య ఉంది. ఈ మిషన్లు స్ర్కీనింగ్‌కు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ మిషన్లలో కరోనా పాజిటివ్‌గా వచ్చిన శాంపిల్‌ను మరోసారి కరోనా కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు పంపాలి. అక్కడ కూడా పాజిటివ్‌ వస్తేనే ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారిస్తారు. ‘నెగెటివ్‌’ విషయంలో ఈ ప్రక్రియ అక్కర్లేదు. 240 ట్రూనెట్‌ సెంటర్లలో 15 చోట్ల మాత్రమే అత్యంత నాణ్యమైన యంత్రాలున్నాయి. అక్కడ చేసిన టెస్టులను మరోసారి నిర్ధారణ కోసం పంపించాల్సిన అవసరం లేదు. మిగిలిన 225 ట్రూనెట్‌ మిషన్లలో పరీక్షించిన శాంపిల్స్‌లో పాజిటివ్‌ వస్తే మాత్రం మరోసారి పరీక్షించాల్సి ఉంటుంది. ట్రూనెట్‌ సెంటర్లలో కరోనా పరీక్షలను గురువారం నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి.


రోజుకు 12 గంటలు...

ట్రూనెట్‌ మిషన్ల ద్వారా గంటకు రెండు పరీక్షలు చేయవచ్చు. రోజుకు 12 గంటలపాటు వీటిని ఉపయోగించవచ్చు. అంటే... ఒక్కో మిషన్‌తో రోజుకు 24 శాంపిల్స్‌ను పరీక్షించవచ్చు. వెరసి... 285 యంత్రాలతో రోజుకు 6840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల మందికి కరోనా స్ర్కీనింగ్‌ చేయాలని నిర్ణయించింది.


ట్రూనెట్‌ మిషన్లను ఉపయోగించినట్లయితే కేవలం 20 రోజుల్లో స్ర్కీనింగ్‌ మొత్తం పూర్తి చేయవచ్చు. అలాకాకుండా ఇప్పుడున్న ల్యాబ్స్‌ ద్వారా రెండు లక్షల మందికి స్ర్కీనింగ్‌ ఆరు నెలలు దాటుతుంది. ట్రూనెట్‌ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలంటే... ఇందుకు అవసరమైన కరోనా కిట్లు అత్యవసరంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఏడు ల్యాబ్స్‌కే  పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ చేయలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. 

Updated Date - 2020-04-08T09:01:12+05:30 IST