పురిటినొప్పులతోనే దేశం కోసం...

ABN , First Publish Date - 2020-04-01T05:52:48+05:30 IST

కరోనా వైరస్‌ నిర్థారణ ఎంత త్వరగా జరిగితే... రోగికీ, వారి నుంచి వైరస్‌ సోకే వీలున్న ఇతరులకూ అంత మంచిది. ఇందుకోసం ‘కరోనా టెస్ట్‌ కిట్‌’ అందరికీ అందుబాటులోకి రావాలి. ఆ కిట్‌ అత్యంత తక్కువ వ్యవధిలో...

పురిటినొప్పులతోనే దేశం కోసం...

కరోనా వైరస్‌ నిర్థారణ ఎంత త్వరగా జరిగితే... రోగికీ, వారి నుంచి వైరస్‌ సోకే వీలున్న ఇతరులకూ అంత మంచిది. ఇందుకోసం ‘కరోనా టెస్ట్‌ కిట్‌’ అందరికీ అందుబాటులోకి రావాలి. ఆ కిట్‌ అత్యంత తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చులో, కచ్చితమైన ఫలితాన్నీ అందించాలి. అలాంటి సమర్థమైన కిట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు పుణేకు చెందిన వైరాలజిస్ట్‌ మినాల్‌ దఖావే భోసలే! ఆ కిట్‌ తయారీ వెనక ఉన్న కథ ఇది!


‘‘నా వరకు నాకు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన అనుభూతి కలిగింది. కరోనా టెస్ట్‌ కిట్‌ తయారీ సమయంలోలాగే, నాకు ప్రసవ సమయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. చిట్టచివరకు సిజేరియన్‌తో నేను గండం నుంచి బయపడిన చందంగానే, కరోనా టెస్ట్‌ కిట్‌ రూపకల్పన కోసం నేను పడిన శ్రమ చివరకు ఫలించింది. మొత్తానికి కీలకమైన సమయంలో కిట్‌ అందుబాటులోకి తేగలిగాను. ఇన్నేళ్లుగా పరిశోధనా రంగంలో ఉన్నాను. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో నా సేవలు అందించలేకపోతే, పరిశోధకురాలిగా నా వృత్తికి అర్థం ఏముంటుంది?’’ ప్రెగ్నెన్సీ సమస్యలతో కిట్‌ రూపొందే చివరి ఘడియల్లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించలేకపోయినా, 10 మంది బృంద సభ్యుల ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహించి, కరోనా కిట్‌ రూపకల్పనకు తోడ్పడిన వైరాలజిస్ట్‌ మినాల్‌ దఖావే భోసలే మాటలివి. 


ప్రసవానికి ఒక్క రోజు ముందు...

గత ఫిబ్రవరిలో ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయోగశాలకు రాలేకపోయిన మినాల్‌ ఇంటి నుంచే కరోనా టెస్ట్‌ కిట్‌ తయారీ బృందానికి మార్గనిర్దేశం చేశారు. అలా మార్చి 18న, ఆడపిల్లను కనడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు... కిట్‌ను పరిశీలన కోసం పుణేలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’కి అందించారు. పుణేలోని ‘మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌’ ఆర్‌ అండ్‌ డి హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మినాల్‌కు వ్యాధినిర్ధారణ రంగంలో పదేళ్ల అనుభవం ఉంది. ఇన్‌ఫెక్షన్‌తో కూడిన వ్యాధులు, వ్యాధి నిర్ధారణ పరికరాల తయారీకి సంబంధించిన మాలిక్యులర్‌ డయాగ్నొస్టిక్స్‌లో ఈమె దిట్ట. టెస్ట్‌ కిట్‌ల తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఈ పరికరాలు కచ్చితత్వంతో పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడం కోసం ఎన్నో క్వాలిటీ చెక్స్‌ను దాటవలసి ఉంటుంది. పొరపాటుకు ఆస్కారం లేకుండా శ్రమకు ఓర్చి మినాల్‌ తయారుచేసిన తాజా ‘కరోనా టెస్ట్‌ కిట్‌’ ఇప్పటివరకూ ఫలితానికి పట్టే 8 గంటల సమయాన్ని రెండున్నర గంటలకు కుదించింది. ఆ కిట్‌ తయారీ వెనక ఉన్న ఆమె శ్రమ తక్కువేమీ కాదు.


ఆరు వారాల స్వల్ప వ్యవధి!

‘‘కొవిడ్‌-19 అత్యయిక స్థితికి అడ్డుకట్ట వేయడానికి అవసరమైన పరిష్కారం కోసం అన్వేషణను మేం ఆరు వారాల క్రితమే మొదలుపెట్టాం. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాధి నిర్ధారణ త్వరితంగా జరగాలి. అందుకోసం ఇప్పటికే పరీక్షా పరికరాలు ఉన్నా, ఫలితానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటోందని గ్రహించాం. కాబట్టి అంతకంటే త్వరగా, కచ్చితమైన ఫలితాన్ని అందించే కిట్‌ రూపకల్పన చేయాలని సంకల్పించాం. ఆ పరికరం తయారీ సమయంలో ప్రొడక్ట్‌ డిజైన్‌ రూపకల్పన, కచ్చితమైన పనితీరులతో పాటు, అత్యవసర స్థితిలో ప్రజల అవసరానికి అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వ అనుమతి పొందడం... ఇలా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే రేయింబవళ్లూ కష్టపడి, ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ఆరు వారాల్లో పూర్తిగా భారతదేశంలో తయారైన మొట్టమొదటి ‘కొవిడ్‌- 19’ టెస్ట్‌ కిట్‌ తయారుచేయగలిగాం.’’అని చెప్పుకొచ్చారు మినాల్‌. ఈ వైరస్‌ మ్యుటేషన్‌ మీద ఓ కన్నేసి ఉంచామనీ, ఒకవేళ మ్యుటేషన్‌ కనిపిస్తే అందుకు తగ్గట్టుగా కిట్‌ను అప్‌గ్రేడ్‌ చేయవలసిన పరిస్థితి వచ్చి ఉండేదనీ అన్నారామె. మినాల్‌ ఆధ్వర్యంలో తయారైన తాజా కరోనా కిట్‌ సహాయంతో చేసే పరీక్ష, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది.


రెండున్నర గంటల వ్యవధిలోనే....

మినాల్‌ రూపొందించిన కరోనా టెస్ట్‌ కిట్‌, ఫలితాన్ని రెండున్నర గంటల్లోనే వెలువరించగలదు. ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ... ‘‘ఫలితానికి ఆరు నుంచి ఏడు గంటలు పట్టే ఇతర పరీక్షలతో పోలిస్తే, మా కిట్‌ తక్కువ సమయంలోనే ఫలితాన్ని చూపించగలదు. ఇందుకోసం మేం నిపుణులతో పాటు, ఫాస్ట్‌ మోడ్‌ యాక్టింగ్‌ ఏజెంట్లను ఉపయోగించాం. ఐ.సి.ఎమ్‌.ఆర్‌తో పాటు ఎఫ్‌.డి.ఎ/సిడిఎ్‌ససిఒ అనుమతి వచ్చిన వెంటనే ‘కొవిడ్‌-19’ క్వాలిటేటివ్‌ పి.సి.ఆర్‌ కిట్‌ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే మేం కిట్ల తయారీ మొదలుపెట్టాం. వారానికి లక్ష పరీక్షలు జరపటానికి అవసరమైన కిట్లను తయారుచేసే సామర్ధ్యం మాకుంది’’ అని చెప్పారు మినాల్‌. ఈమె తయారుచేసిన ఒక్కొక కిట్‌ వెల 1200 రూపాయలు. ఒక్కొక కిట్‌ 100 శ్యాంపిళ్లను పరీక్షించగలదు. భారత ప్రభుత్వం ప్రస్తుతం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని ఉపయోగిస్తున్న కిట్‌ ద్వారా కరోనా పరీక్షకు అయ్యే 4,500 రూపాయల ధరతో పోలిస్తే ఇది నాలుగో వంతు మాత్రమే. మినాల్‌ కృషిని ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ‘మీరు కేవలం కిట్‌ను, బేబీని మాత్రమే కాదు... మన దేశ ఆశాకిరణాన్ని కూడా డెలివరీ చేశారు. మేము మీకు సెల్యూట్‌ చేస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. ‘బయోకాన్‌’ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌షా, బాలీవుడ్‌ నటి సోనీ రజ్దాన్‌లు కూడా మినాల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వీరితో పాటు వేలాది మంది ఆమె అంకితభావాన్ని మెచ్చుకుంటూ అభినందనల ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 


పర్సనల్‌ టచ్‌

మహారాష్ట్రలోని పుణేలో 1988లో జన్మించిన మినాల్‌ స్థానిక అహిల్యాదేవీ హై స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. పుణే యూనివర్శిటీలో పట్టా తీసుకున్న అనంతరం 2009లో ‘నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వైరాలజీ’లో చేరారు. 2014లో ‘మైలాబ్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌’లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ‘రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ ల్యాబ్‌ హెడ్‌గా ఉన్నారు. 2017లో ఆమె ప్రవీణ్‌ భోసలేను వివాహం చేసుకున్నారు. 



Updated Date - 2020-04-01T05:52:48+05:30 IST