ఇంట్లోనే కరోనా టెస్ట్

ABN , First Publish Date - 2022-01-18T13:46:35+05:30 IST

కరోనా టెస్టింగ్‌ కిట్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సులువుగా దొరుకుతున్నాయి. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. చాలా మంది సొంతంగా

ఇంట్లోనే కరోనా టెస్ట్

ప్రభాకర్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. రెండు రోజులుగా నలతగా ఉండటంతో టీవీల్లో వచ్చే ప్రకటన చూసి,  కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ ఇంటికి తెప్పించుకున్నాడు. కిట్‌లో సూచించిన విధంగా పరీక్ష చేసుకున్నా, ఫలితం మాత్రం తప్పుగా వచ్చింది. ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ప్రతినిధిని పిలిపించి, పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


మార్కెట్‌లో కిట్లు

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో.. 

కచ్చితత్వంపై అనుమానాలు 

కిట్ల నాణ్యతపైనా.. 

రికార్డుకు ఎక్కేవి ఎన్ని? 


హైదరాబాద్‌ సిటీ: కరోనా టెస్టింగ్‌ కిట్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సులువుగా దొరుకుతున్నాయి. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. చాలా మంది సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. నగరంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటం, లక్షణాలు లేని వారికి పరీక్షలు అవసరం లేదని వైద్యశాఖ చెబుతున్న నేపథ్యంలో కరోనా కిట్లు తెప్పించుకుని, సొంతంగా పరీక్షలు చేసుకోవడం పెరిగింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రూ.250కే ఒక కిట్‌ చొప్పున అందుబాటులో ఉంది. హోల్‌సేల్‌ మెడికల్‌ దుకాణాల్లోనూ విక్రయిస్తుండగా, స్థానిక మెడికల్‌ దుకాణాల్లో వినియోగదారులు అడిగితే, మరుసటి రోజు సరఫరా చేస్తున్నారు. 


అనుమానమే.. 

సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే ఫలితం కచ్చితంగా వస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు నిపుణులు. లక్షణాలు ఉండి నెగిటివ్‌ ఫలితం వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సిందేనని అంటున్నారు.


లెక్కల్లోకి వచ్చేనా? 

కరోనా సెల్ఫ్‌ కిట్స్‌తో పాజిటివ్‌ నిర్ధారణ జరిగినా చాలా వరకు ప్రభుత్వ లెక్కల్లో చేరడం లేదు. ముందుగా యాప్‌లో నమోదు చేసుకుని, ఈ కిట్స్‌తో పరీక్షలు చేసుకోవాల్సి ఉండ గా, చాలామంది అలా చేయడం లేదు. దీంతో లాభానికన్నా నష్టమే ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్తే సమస్య లేదు కానీ, అపార్ట్‌మెంట్‌ వాసులు ఏమంటారో అని.. మరో భయంతోనే వారు ఎప్పటిలాగే బయట తిరిగితే పాజిటివిటీ రేటు పెరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. 


కిట్ల నాణ్యత

ర్యాపిడ్‌ యాంటీజెన్‌(ఆర్‌ఏటీ) పరీక్షలు ఇంట్లోనే చేసుకునేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) 12 రకాల కిట్లకు అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన కిట్లు మాత్రమే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరు స్థానిక కంపెనీలు, అనుమతి లేని సంస్థల కిట్లు విక్రయిస్తున్నారని, వాటి వినియోగం వల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చునని అంటున్నారు. 


స్టాండర్డ్‌ కంపెనీ కిట్లనే వాడాలి

సొంత పరీక్షల్లో సరైన నమూనాల సేకరణ ఉండదు. శిక్షణ పొందిన వారు నమూనా తీస్తే ఫలితం సరిగ్గా వస్తుంది. నమూనాలు సేకరించే సమయంలో ముక్కులో నాజిల్స్‌ తగలాలి. గొంతులో రెండు వైపులా స్వాబ్‌ తగలాలి. అలాగే, చాలా కిట్లు నాణ్యంగా ఉంటాయని కూడా చెప్పలేం. స్టాండర్డ్‌ కంపెనీలకు చెందిన కిట్లు మాత్రమే వినియోగించాలి. 

- కోటేశ్వరరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఐప్యాథ్‌ ల్యాబ్‌ 


 కచ్చితత్వం రాదు.. 

సొంతంగా పరీక్ష చేసుకుంటే ఫలితం కచ్చితత్వాన్ని చెప్పలేం. క్లినికిల్‌గా నిర్ధారించుకోవడమే మంచిది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనే సైంటిఫిక్‌ కట్‌ ఆఫ్‌ 35గా పేర్కొంటారు. చాలా మందిలో సిటీ సైకిల్‌ 22, 23 ఉంటాయి. మొదటి, రెండో వేవ్‌లో ఆర్టీపీసీఆర్‌లో నెగిటివ్‌ వచ్చి, సిటీస్కాన్‌లో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయమూ తెలిసిందే. సొంత టెస్ట్‌లో ముక్కు, గొంతులో సరిగ్గా తగిలే విధంగా స్వాబ్‌ పెట్టకపోతే ఫలితంలో తేడా వస్తుంది. ముక్కు, గొంతులో గుచ్చుకుపోతే రక్తం వచ్చే అవకాశం ఉంది.

- డాక్టర్‌ రవీంద్రారెడ్డి, పల్మానాలజిస్టు, కామినేని ఆస్పత్రి 


అనవసర పరీక్షలతో ఆందోళన 

సొంతంగా చేసుకునే పరీక్షలలో ఒమైక్రాన్‌ను గుర్తించలేం. ప్రభుత్వం గుర్తించిన ల్యాబ్‌లలో 3జీన్‌ మల్టీప్లెక్స్‌ ఆర్టీపీసీఆర్‌ ఎన్‌జీన్‌, ఓఆర్‌ఎస్‌ ఎస్‌జీన్‌ పరీక్ష చేసి నిర్దారించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సాంకేతిక నిపుణులు మాత్రమే స్పష్టత ఇవ్వగలరు. అనవసరంగా పరీక్షలు చేసుకోని రోగులు ఆందోళన చెందాల్సి వస్తుంది. కొవిడ్‌ ఉంది.. లేదు.. అది ఏ వేరియంట్‌ అని డాక్టర్‌ నిర్ధారించి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. రోగి తెలుసుకోని ఆందోళన పడాల్సింది ఏమీ లేదు. 

- డాక్టర్‌ జగదీష్‌ కుమార్‌, జనరల్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌ ఆస్పత్రి 

Updated Date - 2022-01-18T13:46:35+05:30 IST