కొవిడ్‌ టెస్టులు.. కొత్త ట్విస్టులు

ABN , First Publish Date - 2021-05-03T06:02:38+05:30 IST

కరోనా మహమ్మారి కరాళ నృత్యమాడుతోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. గత నెల 25 నుంచి చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. శనివారం వరకు వారం రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో 1,007, ములుగు జిల్లాలో 640 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 12 నుంచి భూపాలపల్లి జిల్లాలో 16 మంది మృతి చెందారు. ములుగు జిల్లాలో 20 మందికి పైగా తుదిశ్వాస విడిచారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కరోనా నివారణపె పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటం, కరోనా పాజిటివ్‌ వస్తే ఎలా మందులు వాడాలో తెలియకపోవటం వంటి సమస్యలతో చాలా మంది మృతి చెందుతున్నారని తెలుస్తోంది.

కొవిడ్‌ టెస్టులు.. కొత్త ట్విస్టులు

కొందరికే కరోనా నిర్ధారణ పరీక్షలు

వేధిస్తున్న కిట్ల కొరత  

పరిమిత టెస్టులతో తగ్గినట్టు కనిపిస్తున్న పాజిటివ్‌ కేసులు

ప్రతి రోజూ 600 లోపే టెస్టులు 

పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 60 లోపే ..

 ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద బాధితుల పడిగాపులు

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తరిస్తున్న మహమ్మారి


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కరోనా మహమ్మారి కరాళ నృత్యమాడుతోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. గత నెల 25 నుంచి చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. శనివారం వరకు వారం రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో 1,007, ములుగు జిల్లాలో 640  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 12 నుంచి భూపాలపల్లి జిల్లాలో 16 మంది మృతి చెందారు. ములుగు జిల్లాలో 20 మందికి పైగా తుదిశ్వాస విడిచారు.  ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కరోనా నివారణపె పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటం, కరోనా పాజిటివ్‌ వస్తే ఎలా మందులు వాడాలో తెలియకపోవటం వంటి సమస్యలతో చాలా మంది మృతి చెందుతున్నారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తిపై ప్రచారం చేయకపోవడం కూడా కేసులు పెరగడానికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇరుకు ఇళ్లు ఉండటంతో కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి నివసించడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని తెలుస్తోంది.  ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవటంతో చాలా చోట్ల వాటి వైపు కరోనా బాధితులు మొగ్గు చూపటం లేదు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిమిత టెస్టులతో తగ్గిన పాజిటివ్‌ కేసులు

 కరోనా టెస్టులపై ప్రభుత్వం పరిమితి విధించింది. ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తుండటంతో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో రోజుకు 20 నుంచి 60 టెస్టులకు మించ కుండా చేయాలని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో భూపా లపల్లి, ములుగు జిల్లాల్లో రోజుకు 600లోపే టెస్టులు నిర్వహిస్తున్నారు. గత నెల 25న భూపాలపల్లి జిల్లాలో 547 టెస్టులు చేశారు. 100 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 26న 1,460 టెస్టులు నిర్వహిస్తే 199 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో కూడా 25న 351 టెస్టు చేస్తే 39 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరుసటి రోజు 26న 2,372 టెస్టులు నిర్వహిస్తే 160 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో 27వ తేదీ నుంచి రెండు జిల్లాల్లో 500 నుంచి 600 మధ్య మాత్రమే కరోనా టెస్టులు నిర్వహి స్తున్నారు. దీంతో 80 నుంచి 170 వరకు పాజిటివ్‌ కేసులు నమోద వుతున్నాయి. కరోనా టెస్టులను పరిమితంగా చేయటంతో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో 4,892 టెస్టులు మాత్రమే చేయగా, ములుగు జిల్లాలో 6,167 నిర్వహించారు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో రోజుకు 3 వేల నుంచి 5 వేలకు కరోనా టెస్టులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కరోనా ఉధృతి పెరిగిన సమయంలో ఒక్క రోజు చేయాల్సిన టెస్టులను వారం రోజుల వరకు సర్దుబాటు చేస్తుండంతో కరోనా మరింత విస్తరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల సరిహద్దు ఉండటంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టెస్టుల కొరతకు తోడు వ్యాక్సి నేషన్‌కు టీకాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. కరోనా కట్టడి లేక.. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ అందుబాటు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. 

తప్పని పడిగాపులు

 కరోనా పాజిటివ్‌ టెస్టుల సంఖ్య తగ్గించటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించినా టెస్టులు చేసుకోవాలని, పాజిటివ్‌ వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని వైద్య నిపుణులతోపాటు ప్రభుత్వం సూచిస్తోంది.  కానీ, లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వం ఆస్పత్రికి వెళ్లినా టెస్టులు చేయటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలు ఉన్న వారు కరోనా టెస్టుల కోసం ఏం తినకుండా ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుం టున్నారు. మధ్యాహ్నం వరకు కూడా టెస్టులు చేయకపోవటం, కొన్ని చోట్ల తమ టార్గెట్‌ అయిపొయిందని, రేపు రండి అని పంపిస్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయకుండా పంపిస్తుండటంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సీటీ స్కాన్‌ ద్వారా అయినా కరోనాను గుర్తించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కొందరికి  కరోనాకు వైద్యం సకాలంలో అందక తుదిశ్వాస విడుస్తున్నారు. కరోనా లక్షణాలు ప్రతి ఒక్కరికీ టెస్టులు నిర్వహించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-05-03T06:02:38+05:30 IST