ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-03T06:07:28+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ పట్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు

ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం

మూడు బృందాలు ఏర్పాటు

అనుమానిత లక్షణాలు ఉంటే క్వారంటైన్‌ సెంటర్స్‌కు

రైల్వే స్టేషన్‌లోనూ వైద్య బృందాలు

12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి

స్కిల్‌ కాంపిటేషన్‌లో పాల్గొనేందుకు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన నలుగురు విద్యార్థులకు కరోనా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ పట్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఎయిర్‌పోర్టులో మూడు బృందాలను నియమించింది. వైద్యులతో కూడిన ఈ బృందాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు చేయడంతోపాటు అనుమానాస్పద లక్ష ణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించ నున్నాయి. మూడు బృందాలు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి. నేరుగా విదేశాల నుంచి విశాఖకు వచ్చే విమానాలు లేవు కాబట్టి...ఇతర ప్రాంతాల్లో దిగి, ఇక్కడకు వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ తిరుపతిరావు తెలిపారు. అదేవిధంగా రైల్వే స్టేషన్‌లోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.


ఆ దేశాల ప్రయాణికులపై దృష్టి.. 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, ఇజ్రాయిల్‌ వంటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాలకు ఆదేశాలు అందాయి. 


నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌.. 

స్కిల్‌ కాంపిటేషన్‌లో పాల్గొనేందుకు వేర్వేరు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన నలుగురు విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే, వీరితో సన్నిహి తంగా మెలిగిన మరో 25 మందికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.  


కొత్తగా 28 మందికి పాజిటివ్‌

జిల్లాలో కొత్తగా 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు గురువారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,58,968కు చేరింది. ఇందులో 1,57,466 మంది కోలుకోగా, మరో 399 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో 1,103 మంది మృతిచెందారు.

Updated Date - 2021-12-03T06:07:28+05:30 IST