లక్షణాలుంటేనే పరీక్ష.. రూటుమారిన కరోనా టెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-04T21:30:57+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెరిగిన కరోన వైరస్‌ వ్యాప్తితో భయాందోళన తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. పరీక్ష నిర్వహణలో మార్పులు చేస్తున్నారు.

లక్షణాలుంటేనే పరీక్ష.. రూటుమారిన కరోనా టెస్ట్‌

మొదట ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు

తరువాత ప్రైమరీ.. ఇప్పుడు కరోనా లక్షణాలు ఉంటేనే..      


ఏలూరు-ఆంధ్రజ్యోతి: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెరిగిన కరోన వైరస్‌ వ్యాప్తితో భయాందోళన తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. పరీక్ష నిర్వహణలో మార్పులు చేస్తున్నారు.  మొదట్లో కరోనా లక్షణాల్లో ఏ ఒక్కటి బయటపడినా కంగారు పడేవారు. పరీక్షలు పెద్దగా చేయకపోవడంతో పాజిటివ్‌ కేసులు బయటపడేవి కావు. క్రమేపీ పరీక్షలు అందుబాటులోకి రావడం, ఏలూరులోని ల్యాబ్‌ల ఏర్పాటుతో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు పరీక్షలు చేయడంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. పాజిటివ్‌గా తేలిన వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు, తర్వాత కేవలం ప్రైమరీ కాంటాక్ట్‌లు, ప్రస్తుతం కేవలం లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు పరిమితం చేశారు. 


పరీక్షలతో పెరిగిన కేసులు

 కరోనా వ్యాప్తి ఆరంభంలో పరీక్షలు అందుబాటులో లేవు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు వెయ్యి లోపు ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహిం చడం కష్టతరంగా ఉండేది. పాజిటివ్‌ 8 వేలు దాటిన తరువాత ఏలూరు ఆశ్రంలో ల్యాబ్‌ అందుబాటులోకి తెచ్చారు. ఈ ల్యాబ్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ వేగవంతం చేయడంతో వేల కేసులు నమోదై వైరస్‌ ఉధృతి తెలిసివచ్చింది. ఏలూరు సహా మిగిలిన పట్టణాల్లో ఆర్‌డీటీ కిట్లతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో కరోనా బాధితులను గుర్తించేందుకు దాదాపు 20 ‘సంజీవిని‘ బస్సులను ఏర్పాటు చేశారు. దీనితో 20 రోజుల్లోనే జిల్లాలో భారీగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. నమూనాల సేకరణకు అనుగుణంగా పరీక్షల వేగం పెరగడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అవగతం అయింది. ప్రత్యేకించి ర్యాపిడ్‌ టెస్ట్‌లన్నీ గంటల్లోనే ఫలితాలు రావడంతో ప్రధాన పట్టణాలలో దాదాపు లక్షకు పైగానే పరీక్షలు చేయగ లిగారు. జిల్లాలో దాదాపు 14వేల పైబడి పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.


పరీక్షలు చేయండి 

తమ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న వారికి పాజిటివ్‌ ఉంది కాబట్టి తమకు పరీక్షలు నిర్వహించాలని వందల సంఖ్యలో ప్రతీరోజు పట్టుబడుతున్నారు. సచివాలయం, వలంటీరు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో సహా మిగతావారంతా మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సిఫారసు చేస్తామని వైద్యుల అంగీకారంతో పరీక్ష చేస్తామని చెబుతున్నా కొందరు పెడచెవిని పెడుతున్నారు. అధికార పక్షానికి చెందిన పార్టీ నేతలతో సిఫార్సు చేయిస్తున్నారు.


ఇలా నియంత్రించారు..

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల మాదిరి పరీక్షల నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. తొలుత కరోనా బాధితుడికి ప్రైమరీ, సెకంటరీ కాంటాక్ట్‌లుగా పదుల సంఖ్యలో పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత ప్రైమరీ కాంటాక్ట్‌లకే పరీక్షలు పరిమితం అయ్యాయి. ల్యాబ్‌లు, కిట్‌లు అందుబాటులో ఉండడంతో భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. తాజా పరిస్థితుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు పరిమితం చేశారు. బాధితుడికి సన్నిహితంగా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులైనా సరే లక్షణాలు కనబడితేనే పరీక్షలు చేస్తున్నారు. అప్పటి వరకు గడప దాటొద్దంటూ సూచనలతో సరిపెడుతున్నారు. కేర్‌ సెంటర్‌, ఐసొలేషన్‌ వార్డుల్లో బాధితులకు కూడా పది రోజుల తర్వాత లక్షణాలు ఉంటేనే పరీక్ష చేస్తున్నారు. లక్షణాలు లేకుంటే డిశ్చార్జ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T21:30:57+05:30 IST