తిరుపతి గజ.. గజ.. టెస్ట్‌లు ఆపేశారు..!

ABN , First Publish Date - 2020-08-04T21:14:45+05:30 IST

తిరుపతి కొర్లగుంటలో నివాసం ఉండే ఒక కుటుంబం అనుమానంతో ప్రయివేటు ల్యాబ్‌లో కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంది. అయిదారు రోజులు దాటుతున్నా

తిరుపతి గజ.. గజ.. టెస్ట్‌లు ఆపేశారు..!

వచ్చిన రిపోర్టులూ పేరుకుపోతున్నాయి..

పాజిటివో, నెగటివో తెలియక ఆందోళనలో ప్రజలు.. 

విపరీతంగా వైరస్‌ వ్యాప్తి


తిరుపతి (ఆంధ్రజ్యోతి): తిరుపతి కొర్లగుంటలో నివాసం ఉండే ఒక కుటుంబం అనుమానంతో ప్రయివేటు ల్యాబ్‌లో కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంది. అయిదారు రోజులు దాటుతున్నా వారి రిపోర్టులు రాలేదు. ల్యాబ్‌కి వెళ్ళి అడిగితే ప్రభుత్వానికి అప్‌లోడ్‌ చేసేశామని చెప్పారు. బతిమలాడితే మీ కుటుంబలోని ఆరుగిరిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. వెంటనే ఆ కుటుంబం తగిన చికిత్స కోసం ప్రయత్నించింది. వలంటీర్‌ను సంప్రదిస్తే, రిపోర్టు రాకుండా మిమ్మల్ని కోవిడ్‌ కేంద్రాల్లో చేర్చుకోరు అని చెప్పేశారు. ప్రయివేటు ఆసుపత్రులను సంప్రదించినా ఇదే సమాధానం. 70 ఏళ్ళు పైబడిని ఇద్దరు వృద్ధులున్న ఆ కుటుంబం తీవ్ర భయాందోళనతో ఉంది. ఏ అర్ధరాత్రో ఎవరికైనా ఊపిరాడని పరిస్థితే వస్తే దిక్కేమిటని రోదిస్తోంది.


తిరుచానూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడికి వారం కిందట ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది. అంబులెన్స్‌ సాయంతో రుయా ఆసుపత్రికి వెళ్ళారు. చికిత్స వెంటనే అవసరం అని చెప్పారు. అయితే బెడ్‌లు లేవు అని నేల మీద పడుకోబెట్టారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు ప్రయివేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. కోవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు లేకుండా చికిత్స చేయలేమని చెప్పేశారు. స్విమ్స్‌లోగానీ, రుయాలో గానీ ఆలస్యం అవుతుందని ప్రయివేటు ల్యాబ్‌కి వెళ్ళి చేయించుకున్నారు. 31న స్వాబ్‌ ఇస్తే ఇప్పటికీ రిపోర్టు రాలేదు. వైద్యమూ అందడం లేదు. ఏ క్షణం ఏమవుతుందో అనే భయంతో ఆ కుటుంబం వణికి పోతోంది.


తిరుపతి నగరంలో ఇటువంటి వారు అనేకమంది ఉన్నట్టు ఆంధ్రజ్యోతి దృష్టికి వచ్చింది. టెస్ట్‌లు చేయించుకున్నా రిపోర్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆరా తీస్తే సాంకేతిక సమస్యలు సరిదిద్దడంలో జరుగుతున్న జాప్యం వేలాది మందిని ప్రమాదంలోకి నెడుతోందని తెలిసింది. ఇప్పటికే ఇలా 50 వేల రిపోర్టులు పేరుకుపోయి ఉన్నాయి. మరోవైపు టెస్ట్‌లు ఆపేశారు. రిపోర్టు వచ్చినా అప్‌డేట్‌ చేయలేకపోవడంతో చివరికి ప్రయివేటు ల్యాబ్‌లోనూ టెస్ట్‌లు ఆగిపోయాయి. ఈ పరిస్థితి తిరుపతి నగరాన్ని వైరస్‌ కోరల్లోకి నెడుతోంది. 


తిరుపతి నగరంలో కరోనా వైరస్‌ బీభత్సం మొదలైంది. ఈ తీవ్రతను గుర్తించి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో సమన్వయకమిటీ ఏర్పడింది. ఆసుపత్రులనూ, కోవిడ్‌ కేంద్రాలనూ సందర్శించి నిర్మాణాత్మకమైన అనేక సూచనలు చేసింది. ఈ దశలో తీసుకునే జాగ్రత్తలే తిరుపతి నగరాన్ని కాపాడుతాయని హెచ్చరించింది. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వయంగా శిల్పారామంలో కోవిడ్‌ కాల్‌సెంటర్‌లో కూర్చుని పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా ఒకవైపు సాగుతూ ఉంటే మరోవైపు రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాశీన వైఖరి వల్ల తీవ్ర ప్రమాదకర పరిస్థితులు దాపురించబోతున్నాయి. స్విమ్స్‌, రుయాల్లో టెస్ట్‌లు గత ఐదు రోజులుగా ఆగిపోయాయి. స్వాబ్‌ సేకరించడం లేదు. ఇప్పటిదాకా సేకరించిన స్వాబ్‌ల రిపోర్టులు బాధితులకు అందకుండా వేలకు వేలు పేరుకుపోతున్నాయి. రాజధానిలో సాంకేతిక పరమైన లోపాలు సరిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పాడింది. ఈలోగా వైరస్‌ విజృంభణ దారుణంగా  ఉండే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 


సాంకేతిక నిర్లక్ష్యం

కొవిడ్‌ చికిత్సలో స్వాబ్‌ టెస్ట్‌ అత్యంత కీలకం. టెస్టులో పాజిటివ్‌ వస్తేనే ఎక్కడైనా చికిత్స చేస్తారు. కోవిడ్‌ ఆసుపత్రిలోనో, కేంద్రంలోనో చేర్చుకుంటారు. అంతదాకా వారి పరిస్థితి అగమ్యగోచరమే. పాజిటివ్‌ కాకపోయినా ఏ చిన్న అనారోగ్యం ఉన్నా కోవిడ్‌ రిపోర్ట్‌ ఉంటేనే ఏ ఆసుపత్రిలోకి అయినా అనుమతిస్తున్నారు. దీంతో కోవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు అన్నది ముఖ్యం అయిపోయింది. అందుకే పెద్ద సంఖ్యలో అనుమానితులు తిరుమల దర్శనం టికెట్ల క్యూకన్నా ఎక్కువగా టెస్ట్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే గత ఐదు రోజులుగా తిరుపతి లో కోవిడ్‌ టెస్ట్‌లు ఆగిపోయాయి. దాదాపు 50 వేల రిపోర్టులు అప్‌లోడ్‌ కాకుండా ఉండిపోయియి. ఇవి అప్‌లోడ్‌ అయితే తప్ప బాధితులకు పాజిటివో, నెగటివో రిపోర్టు మెసేజ్‌ రాదు. అనుమానంతో టెస్ట్‌ చేసుకున్నవారంతా తాము పాజిటనవో, నెగటివో తెలియక తాము ఎలా ఉండాలో అర్ధం కాక అందోళనతో గడుపుతున్నారు. మరో మూడు,నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. 


అంటించేస్తున్నారు

ఈ పరిస్థితి ప్రమాదకరమని వైద్య నిపుణులు ఆందోళన పడుతున్నారు. ఫలితం అందనివాళ్ళు సాధారణ జీవితం గడిపేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్‌ అయితే పెద్ద సంఖ్యలో వైరస్‌ వ్యాప్తికి వారు కారకులవుతారు. బ్యాంకు, ప్రభుత్వ కార్యాలయాలూ, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే కొందరు ఇలా స్వాబ్‌ టెస్ట్‌కి ఇచ్చి యధాతధంగా తమ విధులకు హాజరవుతున్నారు. రిపోర్టులు ఆలస్యంగా రావడం వల్ల వీరు వందలాది మందికి వైరస్‌ను అంటించేస్తారు. వీరి కుటుంబాలను కూడా ప్రమాదంలో పడేస్తారు. ఇప్పటికే వెల్లడికాని రిపోర్టుల వల్ల నగరంలో ఎంత వ్యాప్తి జరిగిందో అనే ఆందోళన వైద్యాధికారుల్లో ఉంది. ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ విషయంలో చూపవలసినంత శ్రద్ధ చూపడం లేదు. వెల్లడైన ఫలితాలను అప్‌డేట్‌ చేయడంలోనే ఇంత జాప్యం జరుగుతూ ఉంటే వీరికి వైద్యం అందించవలసి వస్తే ఇంకెంత జాప్యం జరుగుతుందో అనే భయం అందరిలో నెలకొంటోంది. 


మూత దిశగా వికృతమాల క్వారంటైన్‌

పాజిటివ్‌ రిపోర్టులు రాకపోవడం వల్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే ప్రయత్నంగానీ వారిని ముందస్తుగా క్వారంటైన్‌ చేసే ప్రయత్నం గానీ జరగడం లేదు. రేణిగుంట సమీపంలోని 1700 గదులు ఉన్న వికృతమాల క్వారంటైన్‌లో ప్రైమరీ కాంటాక్టులను ఉంచేవారు. అయితే తిరుపతిలో గత అయిదు రోజులుగా టెస్టులు ఆగిపోవడంతో ప్రైమరీ,  సెకండరీ కాంటాక్టులు గుర్తించే పని జరగక వికృతమాల క్వారంటైన్‌ ఖాళీగా ఉండిపోయింది. దీనిని మూసేసే ఆలోచనలోనూ యంత్రాంగం ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2020-08-04T21:14:45+05:30 IST