ఇక ఉచితంగా కరోనా టెస్టులు

ABN , First Publish Date - 2020-04-09T07:48:37+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ఉచితంగానే చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ప్రభుత్వ ప్రయోగశాలలైనా, ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు ల్యాబొరేటరీలలోనైనా...

ఇక ఉచితంగా కరోనా టెస్టులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ఉచితంగానే చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ప్రభుత్వ ప్రయోగశాలలైనా, ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు ల్యాబొరేటరీలలోనైనా.. ఈ టెస్టులు ఫ్రీగానే చేయాలి. ఎలాంటి ఫీజులూ వసూలు చేయరాదు’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబొరేటరీలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.


ఒక్కో పరీక్షకు రూ 4500 గరిష్ట పరిమితిని ఐసీఎంఆర్‌ విధించడాన్ని ప్రస్తావిస్తూ సామాన్యులు ఇంత ఎక్కువ మొత్తాన్ని ఎలా తట్టుకుంటారని పిటిషన్‌ వేసిన శశాంక్‌దేవ్‌ సుధీ అనే న్యాయవాది ప్రశ్నించారు. ఆయన వాదనతో  ధర్మాసనం ఏకీభవించింది.  తాము ఉచితంగా జరిపిన టెస్టుల ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలన్న ప్రైవేట్‌ ల్యాబ్‌ల వినతిపై తరువాత  స్పందిస్తామని స్పష్టం చేసింది. ఉచిత టెస్టులు చేయించాలన్న బెంచ్‌ సూచనను ప్రభుత్వ దృష్టికి తీసికెళతానని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నప్పటికీ న్యాయమూర్తులు ఆగలేదు. ఇంకా ఆగేది లేదని, దానిపై ఇప్పుడే ఉత్తర్వులు ఇచ్చేస్తున్నామని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.  

Updated Date - 2020-04-09T07:48:37+05:30 IST