Abn logo
Aug 2 2021 @ 11:25AM

పొంచి ఉన్న ముప్పు.. ఓ వైపు Corona Thirdwave.. మరోవైపు Rains..

  • పిల్లల విషయంలో జాగ్రత్త
  • అప్రమత్తతతో ఇబ్బందులకు చెక్‌

హైదరాబాద్‌ సిటీ : ఓ పక్క మూడో వేవ్‌ ఆందోళన.. మరో పక్క వర్షాలు.. ఇలాంటి వాతావరణంలో పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులైన డయేరియా, డెంగీ, చికున్‌ గున్యా, శ్వాసకోశ వ్యాధులు, అతిసార, కలరా బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు.


మలేరియా, డెంగీ లక్షణాలు..

మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చాయంటే వారం, పది రోజులపాటు మంచం పట్టాల్సిందే. జ్వరం వచ్చి తగ్గుతుండటం, చలి, ఒంటి నొప్పులు, తలనొప్పి, వాంతులు, కడుపులో నొప్పితో హై ఫీవర్‌ వంటి ఇబ్బందులు ఎదురవుతాయని వై ద్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో కొన్నిసార్లు రక్త ప్రసరణ తగ్గిపోవడం, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. డెంగీకి నిర్ధిష్టమైన మందులు లేవు. సపోర్ట్‌ మెడిసిన్‌తో జబ్బును నియంత్రించాలి.

వాంతులు.. విరోచనాలు

నీరు, ఆహార కాలుష్యంతో టైఫాయిడ్‌, విరోచనాలు, త్రీవమైన గ్యాస్ట్రో ఎంటరైటీస్‌, హైపటైటిస్‌ జబ్బుల బారిన పడే ముప్పు ఉంటుంది. వర్షపునీరు,డ్రైనేజీ నీరు మంచినీటితో కలవడంవల్ల తాగే నీరు కలుషితమవుతోంది. ఆ నీరు  తాగిన వారు వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. అపరిశుభ్రమైన పరిసరాలు, నీళ్లు, ఆహారంవల్ల హైపటైటీ‌స్-ఏ, హైపటైటీ‌స్-ఈ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 


పిల్లల విషయంలో జాగ్రత్త

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు పండ్లు, గుడ్డు, తృణ ధ్యానాలతో సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. ఇంట్లో తయారు చేసిన వేడి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. కాచి, చల్లార్చిన నీళ్లు, వేడి పానీయాలు మాత్రమే ఇవ్వాలి. రోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు అందించాలి. పొడి, తేలికపాటి దుస్తులు వేయాలి. పిల్లలు అలర్జీ, ఆయాసంతో ఇబ్బందులు పడుతుంటే తివాచీలు, కర్టెన్లు, తేమ గోడలను శుభ్రంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్‌షీట్లు, దిండు కవర్లు, కర్టెన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. కూలర్లు, ఫ్లవర్‌ పాట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్త పడాలి. దోమల నివారణకు మస్కిటో కాయిల్స్‌ వినియోగించవద్దు. క్రీమ్‌లు పూయవద్దు. పిల్లలు జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, దదుర్లు, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడడం, బద్దకం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. - డాక్టర్‌ అనుపమ ఎర్ర, పిల్లల వైద్యురాలు, రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి.

దోమలు మురిసే కాలం 

వర్షాలకు ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచి ఉండటంవల్ల దోమలు పెరుగతాయి. అవి డెంగీ, మలేరియాను విస్తరింపజేస్తాయి. దోమల నివారణపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఇది.


టైఫాయిడ్‌ జ్వరం

బయటి ఆహారం, నీరు, జ్యూస్‌ వంటివి వర్షాల వల్ల కలుషితమయ్యే ప్రమాదముంది. అవి తీసుకుంటే టైఫాయిడ్‌ బారిన పడతారు. దీంతో ఎక్కువగా జ్వరం రావడం, కడుపులో నొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తే టైఫాయిడ్‌గా అనుమానించి, చికిత్స తీసుకోవాలి.