కదలని ఇంధనం

ABN , First Publish Date - 2020-04-05T10:39:34+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.

కదలని ఇంధనం

కరోనా ఎఫెక్టు.. పడిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు

లాక్‌డౌన్‌తో జిల్లావ్యాప్తంగా 80 శాతానికిపైగా వినియోగం ఢమాల్‌

మార్చి 23కు ముందు రోజుకు 3.20 లక్షల లీటర్ల పెట్రోల్‌ వాడకం

లాక్‌డౌన్‌ ప్రకటించాక 64 వేల లీటర్లలోపే అమ్మకాలు

5.76 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం కాస్తా 48 వేల లీటర్లకు డౌన్‌

హైవేపైనున్న 120 బంకుల్లో అమ్మకాలు మరీ దిగదుడుపు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం అమ్మకాలు 20 శాతానికి పడిపోయాయి. ఉదయం ఆరు నుంచి పదకొండు లోపే ప్రజలు అత్యవసర పనులకు బయటకు రావాలనే నిషేధాజ్ఞలు, అటు లారీలు, ట్రక్కులు, బస్సుల రవాణాపై ఆంక్షలు కొనసాగుతుండడంతో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై ప్రభావం భారీగా పడింది. బంకులు పనిచేసే వేళలకు కూడా గడువు విధించడంతో అమ్మకాలు  నేలచూపులు చూస్తున్నాయి. దీంతో లక్షల లీటర్ల విక్రయాలు కాస్తా వేలల్లోకి పడిపోయాయి. జిల్లాలో మొత్తం 320 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి.


సాధారణ రోజుల్లో అంటే లాక్‌డౌన్‌ ప్రకటించక ముందు రోజుకు జిల్లావ్యాప్తంగా అన్ని బంకుల పెట్రోలు అమ్మకాల సరాసరి 3.20 లక్షల లీటర్లు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, ఇతర పట్టణాలు, హైవేపై ఉన్న బంకుల్లో కొన్ని రోజుకు 2,700 లీటర్లకుపైగా విక్రయించేవి. సరాసరిన అమ్మకాలు లెక్కిస్తే జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల లీటర్ల వరకు విక్రయించేవి. ఇప్పుడు అన్ని బంకుల రోజువారీ అమ్మకాల సరాసరి ప్రకారం రోజుకు 64 వేల లీటర్లకు మించి విక్రయాలు జరగడం లేదు. ఇదిలాఉంటే లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 2,700 లీటర్ల పెట్రోల్‌ విక్రయించే బంకులు ఇప్పుడు 200 లీటర్లు అమ్మడం గగనమవుతోంది. 


డీజిల్‌ మరీ దారుణం..

డీజిల్‌ విషయానికి వస్తే మార్చి 23కు ముందు జిల్లాలో అన్ని బంకులు కలిపి రోజుకు 5.76 లక్షల లీటర్ల విక్రయాలు జరిపేవి. ఇందులో నగరాలు, జాతీయరహదారులపై ఉన్న బంకుల విక్రయాలు ఎక్కువ. అప్పట్లో రాజమహేంద్రవరం, కాకినాడలో కొన్ని బంకుల్లో రోజుకు 1800 నుంచి 2 వేల లీటర్ల వరకు అమ్మకాలు జరిపేవి. కానీ ఇప్పుడు 150 లీటర్లు కూడా విక్రయాలు జరగడం లేదు. ఇలా జిల్లాలో అన్ని బంకుల సరాసరి రోజు వారి అమ్మకాలు 48 వేల లీటర్లు కూడా దాటడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు ఇంధన సంస్థల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకర్లు పదుల సంఖ్యలో బంకులకు వచ్చి ఫిల్లింగ్‌ చేసి వెళ్లేవి. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా రావడం లేదు. ప్రధానంగా లారీలు, బస్సులు, ట్రక్కుల వినియోగం అత్యధికం కాగా, ఇవి నిలిచిపోవడంతో వినియోగం సింహభాగం తగ్గిపోయింది.


ఇదే విషయమై జిల్లా పెట్రోల్‌ బంకుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ అమ్మకాలు లాక్‌డౌన్‌ తర్వాత 20 శాతానికి లోపే పడిపోయాయని వివరించారు. బంకుల వారీగా చూస్తే సగానికిపైగా పెట్రోల్‌ బంకుల అమ్మకాలు మునుపటితో పోల్చితే పది శాతం లోపే ఉన్నాయని వివరించారు. మరోపక్క జిల్లాలోని మొత్తం పెట్రోల్‌ బంకుల్లో 120 బంకులు జాతీయ రహదారిపై ఉన్నాయి. వీటిలో విక్రయాలు మరీ దారుణంగా పడిపోయాయి. హైవేపై వాణిజ్య వాహనాలు దాదాపు తిరగడం లేదు. దీంతో వీటిలో చాలావరకు మూతపడ్డాయి. అయితే గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలవ్వడంతో కొద్దిగా డీజిల్‌ అమ్మకాలు పుంజుకుంటున్నాయి.

Updated Date - 2020-04-05T10:39:34+05:30 IST