Abn logo
Mar 26 2020 @ 03:52AM

నిర్లక్ష్యం వీడండి

ముందు జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

సామాజిక దూరం పాటించడం ద్వారా

మనల్ని మనం కాపాడుకుకోవడంతో పాటు

సమాజాన్ని రక్షించుకుందాం

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

...ఒకవేళ వచ్చినా ఇంట్లోకి వెళ్లేప్పుడు

తప్పనిసరిగా సబ్బు/శానిటైజర్‌తో

చేతులు శుభ్రం చేసుకోవాలి

చేతులతో నోటిని, ముక్కును, కళ్లను తాకకుండా జాగ్రత్తపడాలి. 

చిన్నారులు, వృద్ధులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి 

క్వారంటైన్‌ ధిక్కరిస్తే జైలే.. 

ఛాతీ ఆసుపత్రిలో 23 మంది

విమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో 65 మంది..

పది రోజుల్లో కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్‌

సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేస్తాం

‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా ఇన్‌చార్జి వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ కె.విజయలక్ష్మి(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): ‘కరోనా వైరస్‌ పట్ల ప్రజలు భయాందోళన చెందవద్దు. అదే సమయంలో మనకేమీ కాదన్న నిర్లక్ష్యమూ వద్దు.  వీలైనంత వరకు సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు సమాజాన్ని కాపాడుదాం...’ అని అంటున్నారు ఇన్‌చార్జి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ కె.విజయలక్ష్మి. కరోనా వైరస్‌ నియంత్రణకు చేపడుతున్న చర్యలు, తదితర అంశాలపై ఆమె బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే....


భయాందోళన వద్దు

కరోనా వైరస్‌ పట్ల ప్రజలు భయాందోళన చెందడం కంటే...దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగి వుండడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే ప్రజలు ఆశించిన స్థాయిలో స హకారాన్ని అందించడం లేదు. ఇప్పటికీ రోడ్ల మీదకు అధికంగా వస్తున్నారు. దీనివల్ల వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశముంది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావడం ద్వారా వైరస్‌ సోకే వారి సంఖ్యను చాలావరకు తగ్గించేందుకు అవకాశముంది. వైరస్‌ సోకితే ఏం జరిగిపోతుందో అన్న భయాందోళన కంటే దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతిఒక్కరూ పాటించాలి. అప్పుడే కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశముంది. వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుండేవారు వైరస్‌ బారినపడినా త్వరగా కోలుకునేందుకు అవకాశముంది. అయితే వృద్ధులు, చిన్నారులు వేగంగా ఈ వైరస్‌ బారినపడేందుకు అవకాశమున్న నేపథ్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. 


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిది. ఒకవేళ వచ్చినా, ఇంట్లోకి వెళ్లే ముందు సబ్బు/శానిటైజర్‌తో జాగ్రత్తగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను బయటకు వెళ్లిన సమయంలో చేతులతో నోటిని, ముక్కును, కళ్లను తాకకుండా జాగ్రత్తపడాలి. ఈ మూడింటి ద్వారానే వైరస్‌ సోకే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తపడాలి. ప్రతి 30-40 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌ బారినపడకుండా ఉండవచ్చు. 


పది రోజుల్లో ల్యాబ్‌

జిల్లాలో నమోదయ్యే అనుమానిత కేసుల నమూనాలను కొద్దిరోజుల కిందట వరకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించేవాళ్లం. ప్రస్తుతం కాకినాడ పంపిస్తున్నాం. ఒక్క రోజులోనే రిపోర్టులు వస్తున్నాయి. పది రోజుల్లో కేజీహెచ్‌లో ల్యాబ్‌ ఏర్పాటుకానుంది. 


క్వారంటైన్‌ ధిక్కరిస్తే జైలే.. 

విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ అలా కాకుండా బయట వుంటామంటే మేం ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ సెంటర్లకు రావచ్చు. తప్పనిసరిగా ప్రజానీకానికి దూరంగా ఉండాలి. కాదని బయట తిరిగితే కఠినచర్యలు తీసుకుంటాం. మొదట వారికి నోటీసులు ఇస్తాం. ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఇచ్చాం. వారు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుని సమాచారాన్ని అందిస్తున్నారు.


సిబ్బందికి మాస్క్‌లు అందిస్తాం

మాస్క్‌లు, శానిటైజర్లు కొరత ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా కిందిస్థాయిలో పనిచేసే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఐదు లక్షల మాస్క్‌లు, 50 వేల శానిటైజర్‌ బాటిల్స్‌ కావాలని ఇండెంట్‌ పెట్టాం. వచ్చిన వెంటనే సిబ్బందికి పంపిణీ చేయనున్నాం.   


ఛాతీ ఆసుపత్రిలో 23 మంది

ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలోని కరోనా వార్డులో ప్రస్తుతం 23 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు. మరో 65 మంది విమ్స్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్నారు. 30 అనుమానిత కేసులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 


Advertisement