Abn logo
Aug 5 2020 @ 00:24AM

కరోనా వేళ.. కిచెన్‌ సరికొత్తగా!

‘కొవిడ్‌-19’ మూలంగా కిచెన్‌ రూపురేఖల్లో మార్పులు రాబోతున్నాయి. వంటగదిలో వాడే ఉపకరణాలను సైతం కరోనాను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్నారు. లాక్‌డౌన్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ల కారణంగా కుటుంబసభ్యులంతా వంటగదిలోకి వెళ్లి తలో చేయి వేస్తుండటంతో కుకింగ్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది, దాంతో వారి అవసరాలకు తగ్గట్టుగా గ్యాడ్జెట్స్‌ మారుతున్నాయి. మొత్తానికి కరోనా విపత్తు హోమ్‌ కుకింగ్‌ని అత్యాధునికంగా మార్చింది.

కరోనా ఎఫెక్ట్‌తో ‘కిచెన్‌’ అనేది కుటుంబ సభ్యులందరూ కలిసే ప్రదేశంగా మారింది. అక్కడే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దాంతో వంటిల్లు పొగలు కక్కే ప్రదేశంగా కాకుండా కూల్‌గా ఉండాలనే డిమాండ్‌ వస్తోంది. 

  • కస్టమర్ల అభిరుచి మేరకే ఎయిర్‌కండిషనర్‌తో కూడిన చిమ్నీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. సాధారణంగా వంటింట్లోని ఫ్యాన్‌ అతి వేగంతో తిరగడం అసాధ్యం. అలాగని ఏసీని పెట్టలేరు. ‘అందుకే లోకలైజ్డ్‌ కూలింగ్‌తో ఉండే ఇన్నోవేటివ్‌ ఎయిర్‌కండిషనర్‌ కమ్‌ చిమ్నీ బెస్ట్‌’ అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఇది వంటగదిలోని వేడిని తగ్గిస్తుంది.  

  • మసాలాలను భద్రపరుచుకోవడానికి ‘కూల్‌ డ్రాయర్స్‌’ కొత్తగా వస్తున్నాయి. ఇవి తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. వీటిని మాడ్యులర్‌ కిచెన్స్‌లో ఏర్పాటుచేస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనం కాకుండా గది వాతావరణంలో ఇవి ఉంటాయి. మసాలాలను కూల్‌ డ్రాయర్స్‌లో ఉంచాలి. 

  • అలాగే ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా ఉండే సింక్‌లు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. సాధారణంగా భారతీయ వంటకాలన్నీ నూనెతో, మసాలాలతో ఉంటాయి. వాటితో వండిన గిన్నెలను సింక్‌లో వేయడం వల్ల, సింక్‌ మొత్తం జిడ్డుగా మారుతుంది.  కొత్తగా వస్తున్న సింక్‌లు లోతుగా ఉంటాయి. వాటికి ఆటో వాటర్‌ హీటర్స్‌ ఉంటాయి. సింక్‌లో నీళ్లు ఒక మోతాదు వరకు వచ్చి, వాటంతట అవే కటాఫ్‌ అవుతాయి. వేడినీళ్లు ఎంత కావాలంటే ఆ మేరకు సెట్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సింక్‌లోని గిన్నెలు స్టీమ్‌తో శుభ్రమై తళతళా మెరుస్తాయి. 

  • ప్రస్తుతం వినియోగదారులు పని తొందరగా అవడానికి వేగం, సామర్థ్యమున్న ఎలకా్ట్రనిక్‌ పరికరాలను వంటగదిలో వాడటానికి మొగ్గు చూపుతున్నారు. కన్వెక్షన్‌ మైక్రోవేవ్స్‌ అమ్మకాలు బాగా పెరిగాయి. అలాగే ఫుడ్‌ ప్రాసెసర్స్‌, వాక్యూమ్‌ క్లీనర్స్‌, మైక్రోవేవ్స్‌ వాడకం పెరిగిందంటున్నారు మార్కెట్‌ నిపుణులు. లాక్‌డౌన్‌ వల్ల ఫుడ్‌ ప్రాసెసర్స్‌కు ఇటీవల డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. కెటిల్స్‌ను కూడా చాలామంది క్రేజీగా కొంటున్నారు. 


  • వెల్‌నెస్‌ గ్యాడ్జెట్స్‌ వాడకం కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఎయిర్‌ఫ్రైయ్యర్‌ బాగా కొంటున్నారు. డీప్‌ ఫ్రై సమయంలో వచ్చే వాసనను ఇది నియంత్రిస్తుంది. స్లో జ్యూసర్‌ (ఇది మెల్లగా క్రష్‌ చేస్తుంది), న్యూట్రీ బ్లెండ్‌ల వైపు కూడా కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. 


  • ఫ్రిజ్‌లలో కూడా అత్యంత ఆధునిక సౌకర్యాలు వచ్చాయి. కొత్తతరం ఫ్రిజ్‌లలో బ్యాక్టీరియా పెరుగుదల లేకుండా... ఎన్ని వారాలైనా కూరగాయలు, పదార్థాలు తాజాగా ఉండేలా... విటమిన్లు నశించని రీతిలో ఏర్పాట్లు ఉంటున్నాయి. 

  • కరోనా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి వేఫల్‌ మేకర్స్‌, బ్రెడ్‌ మేకర్స్‌, మల్టీపర్పస్‌ శాండ్‌విచ్‌ మేకర్లు సైతం వచ్చాయి. మొత్తానికి ‘కొవిడ్‌-19’ మానవ జీవితంలో మార్పులు తెచ్చినట్టే, వంటిల్లును కూడా చాలా మార్చేసిందనే చెప్పాలి.


Advertisement
Advertisement
Advertisement