59 మంది మృత్యువాత

ABN , First Publish Date - 2021-05-05T08:10:17+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు బెంబేలెత్తిసున్నాయి. వైరస్‌ కారణంగా సోమవారం 59 మంది మృత్యువాత పడ్డారు.

59 మంది మృత్యువాత

  • ఒక్క రోజులో ఇవే అత్యధిక మరణాలు
  • రాష్ట్రంలో కొత్తగా 6,876 మందికి కరోనా
  • కోలుకున్న కేసీఆర్‌.. 2 పరీక్షల్లోనూ నెగెటివ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు బెంబేలెత్తిసున్నాయి. వైరస్‌ కారణంగా సోమవారం 59 మంది మృత్యువాత పడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. గత నెల 28న 58మంది చనిపోగా.. తాజాగా ఆ సంఖ్యను మించి మరణాలు నమోదయ్యాయి. టెస్టులు తక్కువగా చేస్తుండడంతో కేసులు తక్కువగా నమోదవుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఎనిమిది రోజుల్లోనే ఏకంగా 444 మంది, ఈ నెలలో కేవలం మూడు రోజుల్లోనే 173 మంది మరణించడం వైరస్‌ ఉధృతికి అద్దం పడుతోంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 2,476కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 70,961 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 6,876 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,63,361కి పెరిగింది.


గత పది రోజులుగా రోజూవారీ పాజిటివ్‌ రేటు సగటున పది శాతం వరకు నమోదవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,029, మేడ్చల్‌లో 502, నల్లగొండలో 402, రంగారెడ్డిలో 387, వరంగల్‌ అర్బన్‌లో 354, సూర్యాపేటలో 372, జగిత్యాలలో 211, కరీంనగర్‌లో 264, ఖమ్మంలో 235, పాలమూరులో 229, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 218, సిద్దిపేటలో 258 కేసులు వచ్చాయి. కాగా, రెండు రోజుల నుంచి తెలంగాణలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల నుంచి 7,432 మంది డిశ్చార్జి కావడంతో రికవరీల సంఖ్య 3,81,365కు పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5382, ప్రైవేటు ఆస్పత్రుల్లో 17,851 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డులో 200 బెడ్లు ఉండగా.. అన్నీ నిండిపోయాయి. దీంతో కొత్తగా వచ్చే రోగులను చేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. కేసుల తీవ్రత దృష్ట్యా మరో 200 పడకలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


పెద్దపల్లి జిల్లాను కరోనా వణికిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే 300 మందికి కరోనా నిర్ధారణ కాగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గోదావరిఖని, రామగుండం, యైుటింక్లయిన్‌ కాలనీ ప్రాంతాల నుంచే 60శాతానికిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం 512 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కుటుంబాలపై కరోనా కాటు

కరోనా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన మహమ్మద్‌ జమీల్‌(45), నాసిర్‌(40), మునీర్‌(37), ఫాతిమాబేగం(50) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 15 రోజుల క్రితం ఫాతిమా మరణించగా, తర్వాత జమీల్‌, నాసిర్‌ మృతి చెందారు. మంగళవారం మునీర్‌ మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురానికి చెందిన కనికచర్ల పద్మ(45) సోమవారం కరోనాతో చనిపోయారు. ఇది తట్టుకోలేక భర్త సత్యనారాయణ(50) మంగళవారం గుండెపోటుతో మరణించారు. వేములవాడలో ఉండే గుమ్మడి ప్రకా్‌ష(44)తోపాటు ఆయన భార్య, పిల్లలు అభయ్‌, అభిజిత్‌(18)కు కరోనా సోకింది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ప్రకాష్‌ చనిపోయారు. తండ్రి అంత్యక్రియలు పూర్తయిన కొద్దిసేపటికే కుమారుడు అభిజిత్‌ తుదిశ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి(27) కరోనాతో  సోమవార అర్ధరాత్రి కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 24 గంటలు గడవక ముందే మంగళవారం ఆయన తండ్రి(59) మృతి చెందారు. 

Updated Date - 2021-05-05T08:10:17+05:30 IST