Abn logo
May 22 2020 @ 04:55AM

చొప్పదండిలో మరొకరికి కరోనా

కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో భయం...భయం 

పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి ప్రయాణించిన మరో 23 మంది 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): ముంబై నుంచి స్వగ్రామానికి వచ్చిన మరో వలస కార్మికుడికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి కూడా చొప్పదండి పట్టణానికి చెందిన వాడే కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నది. బుధవారం ఐదు వైద్య బృందాలు 267 గృహాలకు వెళ్లి 1,068 మందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహించగా గురువారం పది వైద్య బృందాలు 502 ఇళ్ళలోని 1974 మందిని స్ర్కీనింగ్‌ చేశారు. 13న చొప్పదండి మండలానికి చెందిన ఆరుగురు ముంబై నుంచి తిరిగి వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా వ్యాధి సోకింది. వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంటిలో నివాసముండే వారు. ఈనెల 12న చొప్పదండికి చెందిన ఆరుగురు, రామడుగుకు చెందిన ఐదుగురు, జగిత్యాల జిల్లా మల్యాలకు మండలానికి చెందిన ఐదుగురు, పెగడపల్లి మండలానికి చెందిన నలుగురు, ధర్మపురి మండలానికి చెందిన ఇద్దరు, గొల్లపల్లి, బుగ్గారం, సిరిసిల్ల మండలాలకు చెందిన ఒక్కొక్కరు మొత్తం 25 మంది కలిసి ఓ వాహనంలో జిల్లాకు వచ్చారు. ఒక రోజంతా వీరు కలిసే ప్రయాణం చేశారు. వీరిలో ఇద్దరికి కరోనా వ్యాధి నిర్ధారణ కాగా మిగతావారి కుటుంబాల్లో భయాందోళనలు రేకెత్తాయి.


హోం క్వారంటైన్‌ నిబంధనల ఉల్లంఘన

ముంబై నుంచి వచ్చిన వారందరిని హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, బయట ఎట్టిపరిస్థితుల్లో తిరగవద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించినా ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ముంబై నుంచి వచ్చిన వారంతా స్వేచ్చగానే తిరుగుతున్నారని, దీంతో పట్టణంలో ఇంకెతమందికి కరోనా సోకుతుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. చొప్పదండి మండలంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మండలంలో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరయ్యారని, మరో పాజిటివ్‌ వ్యక్తి మిత్రులతో కలిసి రోజూ విందులు చేసుకున్నాడని సమాచారం. వీరితో కలిసి తిరిగిన వారు భయాందోళనకు గురవుతున్నారని తెలిసింది. గంగాధర మండలానికి చెందిన ఒక మహిళకు జలుబు, దగ్గు జ్వరం తీవ్రంగా ఉండగా ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్‌ తీసుకొని కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించారు.   వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారికి హోంక్వారంటైన్‌ విధించకుండా ప్రభుత్వమే క్వారంటైన్‌కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇళ్లలో ఉండాలనే నిబంధనలను వారు పాటించక పోవడంతో గ్రామాలతో అందరికీ ఆ వ్యాధి సోకే ప్రమాదం లేకపోలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


హోం క్వారంటైన్‌లో 1,089 మంది

జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో 1,089 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. వీరందరిపై అధికారులు దృష్టిసారించి నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాల్సిన అవసరం ఉంది. చొప్పదండిలో మొదట పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని  శాతవాహన యూనివర్సిటీలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అందులో సదరు వ్యక్తి తండ్రికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. రెండో వ్యక్తికి సంబంధించిన వారిని క్వారంటైన్‌ చేసి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. 


పరీక్షలు నిర్వహించక పోవడంపై విమర్శలు 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో, పొరుగు జిల్లాలో విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా జిల్లాలో లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముంబై నుంచి 25 మంది ఒకే వాహనంలో వచ్చారని తెలిసినా వారిలో జిల్లావాసులను హోంక్వారంటైన్‌ నుంచి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించక పోవడాన్ని తప్పుపడుతున్నారు. హోంక్వారంటైన్‌ ముద్రలు వేసి వారికి పరీక్షలు నిర్వహించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో ముంబై నుంచి వచ్చిన ఒక వ్యక్తికి తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు ఉండడంతో కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అతడి నమూనాలను తీసుకొని ఇంట్లోనే ఉంచి వెళ్లారని, దీంతో ఆ కుటుంబంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.


గ్రీన్‌జోన్‌ అని చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అనుమానితులను ఆస్పత్రికి తరలించకుండా ఇళ్లలో ఉంచితే ఎవరు బాధ్యత వహిస్తారని మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ వృద్ధుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో అతనికి చికిత్స అందించిన వైద్యులకు సేవలు చేసిన నర్సులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించక పోవడాన్ని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాయికృష్ణారెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి సంబంధించిన కొందరికి మాత్రమే పరీక్షలు నిర్వహించి మిగతా వారికి ఎవరికి లక్షణాలు లేవనే కారణంగా పరీక్షలు చేయలేదు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగాన్ని ప్రజలు కూడా తప్పుబడుతున్నారు. కనీసం ముంబై నుంచి వచ్చిన వారికైనా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.    

Advertisement
Advertisement