కరోనా మరో నలుగురికి

ABN , First Publish Date - 2020-04-05T09:55:51+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ మరో నాలుగుకు పెరిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఈనెల 3 వరకు 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శనివారం మరో నాలుగు పాజిటివ్‌

కరోనా మరో నలుగురికి

ఉమ్మడి జిల్లాలో 14కు చేరిన సంఖ్య 

అంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులే

నల్లగొండలో అనుమానితుల జాబితాలో మరో 26 మంది 

నిలిచిన స్వాప్‌ నమూనాల సేకరణ

మిగతావారి ఫలితాల కోసం ఎదురుచూపు


నల్లగొండ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్‌ పాజిటివ్‌ మరో నాలుగుకు పెరిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఈనెల 3 వరకు 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శనివారం మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో పాజిటివ్‌ నమోదైన కుటుంబ సభ్యుల్లో అనుమానితు ల స్వాప్‌ నమూనాలను పరీక్షలకు పంపగా, నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా వైద్యశాఖ అధికారి కొండల్‌రావులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తాజాగా వచ్చిన నాలుగు పాజిటివ్‌ కేసులు ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులే కావడం గమనా ర్హం. ఇక తొలుత గుర్తించిన ఆరు పాజిటివ్‌ కేసులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు వైద్య బృందాలు సర్వే నిర్వహించగా అందులో 26 మంది అనుమానితులు వెలుగులోకి వచ్చారు.


వారి స్వాప్‌ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రోజుకు వంద నమూనాలను పరీక్షిస్తుండటంతో, అక్కడ పెద్ద సంఖ్యలో ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు జిల్లా నుంచి నమూనాలు పంపవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం అనుమానితుల స్వాప్‌ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో పంపిన వాటి ఫలితాల కోసం కలెక్టర్‌తోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నిరంతరం ఫోన్లు చేస్తున్నారు. కాగా, పరీక్షలు చేయకుండా ఖాళీగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మూడు రోజులుగా వేచి ఉండేలా చేయడంపై అనుమానితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, వెంటనే పంపిస్తామని తీసుకొచ్చి రోజుల తరబడి ఉంచడం, నమూనాలు సేకరించకపోవడపై వారు ఫిర్యాదు చేస్తున్నారు.


రోగుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సామర్థ్యానికి మించి కరోనా సేవ లు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 45పడకల సామర్థ్యం కాగా, ప్రస్తుతం 51 మంది చికిత్స పొం దుతున్నారు. దీంతో మిర్యాలగూడ ఆస్పత్రికి 12 మంది, నాగార్జునసాగర్‌కు ఇద్దరు, నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి నలుగురిని తరలించి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నా రు. ఢిల్లీ ప్రార్థనలకు  వెళ్లి వచ్చిన ఓ ఉపాధ్యాయుడు నార్కట్‌పల్లి మండలంలో పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌ విధుల్లో పాల్గొన్నారు. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శనివారం సంబంధిత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు.


కొనసాగుతున్న ఇంటింటి సర్వే 

నల్లగొండ అర్బన్‌: నల్లగొండలోని రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో వైద్య బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. శనివారం వరకు మూడు వేల మందిని కలిసి వ్యక్తిగత, ఆరోగ్య వివరాలను సిబ్బంది సేకరించారు. మొత్తం 1700 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, 25బృందాలు పాల్గొంటున్నాయి. క్వారంటైన్‌ పీరియడ్‌ ముగిసే వరకు రెడ్‌జోన్‌ ప్రాంతవాసులు ఎవరూ బయటికి రావద్దని సూ చిస్తున్నారు. చేతుల మీద క్వారంటైన్‌ స్టాంపింగ్‌ వేస్తున్నారు. 


క్వారంటైన్‌ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని క్వారంటైన్‌ కేంద్రాలను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి,  మిగతా  డీఎంహెచ్‌వో కొండల్‌రావుతో కలిసి శనివారం సందర్శించారు. అనుమానితులను పలకరించి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.


ముగ్గురు హోంక్వారంటైన్‌లో

చండూరు: వివిధ ప్రాంతాల నుంచి మండలానికి వచ్చిన ముగ్గురిని హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారి శ్రీనివాసులు సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఒకరు కస్తాలకు, గోవా నుంచి ఇరువురు బంగారుగడ్డకు రాగా, విషయం తెలుసుకున్న ఆయన వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.


నార్కట్‌పల్లిలో విద్యార్థులకు వైద్యపరీక్షలు

నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసిన 48 మంది విద్యార్థులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో కల్యాణ్‌చక్రవర్తి పర్యవేక్షించారు. ప్రస్తుతానికి ఎవరికీ కరో నా లక్షణాలు లేవని, ముందు జాగ్రత్తగా విద్యార్థులు హోంక్వారంటై న్‌ పాటించాలని వారు సూచించారు.


ఇద్దరు అనుమానితులు క్వారంటైన్‌కు

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ నుంచి ఇద్దరు కరోనా అనుమానితులను నల్లగొండ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు యూఎ్‌పడబ్ల్యూసీ వైధ్యాధికారి డాక్టర్‌ విజయకుమారి తెలిపారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వచ్చిన ఒకరు మార్చి 19న సాగర్‌లోని ఆయన కుమారుడికి ఇంటికి వచ్చారని, దీంతో కుమారుడితోపాటు, అతడి బంధువును క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు.

Updated Date - 2020-04-05T09:55:51+05:30 IST