ఎమ్మెల్సీ ‘నారదాసు’ కుటుంబానికి కరోనా

ABN , First Publish Date - 2020-08-03T10:42:38+05:30 IST

శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు ఆయన కుటుంబసభ్యులందరికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. నారదాసు

ఎమ్మెల్సీ ‘నారదాసు’ కుటుంబానికి కరోనా

ఎనిమిది మందికి పాజిటివ్‌

1న 93 మందికి వ్యాధి నిర్ధారణ 

1722కు చేరిన వైరస్‌ పీడితులు 

జిల్లా ఆస్పత్రిలో ఐదుగురు, ఇంటి వద్ద ఒకరు మృతి 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు ఆయన కుటుంబసభ్యులందరికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు ఆయన సతీమణి, సోదరుడు, సోదరుడి కోడలు, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్‌, వంట మనిషి ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకోగా వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్సీ, ఆయన సతీమణి, సోదరుడు, డ్రైవర్‌ హైదరాబాద్‌లో చికిత్స కోసం వెళ్లారు. మిగతావారంతా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈనెల 1న జిల్లాలో 93 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు వ్యాధిబారిన పడ్డ సంఖ్య 1722కు చేరింది.


ఆదివారం ఆరుగురి మృతి

కరోనా వ్యాధితో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరీంనగర్‌కు చెందిన ఇద్దరు, గోదావరిఖని,  8ఇంక్లైయిన్‌ కాలనీ, మందమర్రికి చెందిన ఒక్కొక్కరు మొత్తం ఐదుగురు మృతిచెందారు. కరీంనగర్‌ భగత్‌నగర్‌కు చెందిన 75 సంవత్సరాల వృద్దుడికి శనివారం కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉన్న ఆయన శనివారం రాత్రి బాత్‌రూంకు వెళ్లి కుప్పకూలి చనిపోయాడు. వ్యాధి నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురై ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా సుమారు 80 మందికి కరోనా వ్యాధి సోకినట్లు స్థానిక సమాచారం మేరకు తెలిసింది. హుజురాబాద్‌ మండలంలో 30 మందికి, జమ్మికుంటలో 16 మందికి, రామడుగు మండలంలో ఒకరికి, కొత్తపల్లి మండలంలో ఒకరికి, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయినట్లు సమాచారం. కరీంనగర్‌ పట్టణంలోని వివిధ కాలనీలలో సుమారు 30మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు సమాచారం. 

Updated Date - 2020-08-03T10:42:38+05:30 IST