మందుల కొరత

ABN , First Publish Date - 2020-03-23T07:39:29+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజురోజుకీ..

మందుల కొరత

  • మాస్కులు, శానిటైజర్లకీ కొరతే.. చేతులెత్తేసిన ఇటలీ
  • సాయానికి ముందుకొచ్చిన రష్యా, చైనా

వాషింగ్టన్‌, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, ఆ స్థాయిలో మందుల సరఫరా మాత్రం జరగడం లేదు. ఇది కూడా వైరస్‌ విస్తరణకు ఓ కారణంగా మారుతోంది. ఇటలీ పరిస్థితయితే మరీ దారుణంగా తయారైంది. మరణాల్లో ఇప్పటికే చైనాను దాటేసిన ఆ దేశంలో ఆదివారం అత్యధికంగా 6,600 కొత్త కేసులు, 650 కొత్త మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా అక్కడ 4,825 మరణాలు నమోదయ్యాయి.


 ఈ స్థితిలో ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది. ప్రజలు ఆందోళన చెందకుండా, పరిస్థితులు మెరుగయ్యే వరకు ఓపిగ్గా ఉండాలని, అంతకుమించి చేసేదేమీ లేదని ప్రకటించింది. ఇటలీకి అవసరమైన మందులను, వైద్య సిబ్బందిని పంపించేందుకు రష్యా ముందుకొచ్చింది. చైనా కూడా 100 టన్నుల మందులు, మాస్కులు, ఇతరత్రా పరికరాలను చెక్‌రిపబ్లిక్‌కు అందించేందుకు ముందుకొచ్చింది. అమెరికాలో కూడా పరిస్థితులు దిగజారుతున్నాయి. అనేక రాష్ట్రాలు మూతపడ్డాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం కావలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. న్యూయార్క్‌ గవర్నర్‌ మాట్లాడుతూ.. తాము మందుల కొరతతో అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నామని, అండ కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తున్నామని చెప్పారు. ఒక్లహోమా నగరంలోని ఆరోగ్య కార్యకర్తలు.. తమకు రక్షణ పరికరాలు డొనేట్‌ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని ఆసుపత్రుల్లోని సిబ్బంది.. వాళ్లే సొంతంగా మాస్కులు తయారుచేసుకుంటున్నారు. ఈ మహమ్మారి అక్కడ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. అక్కడ కూడా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.


 దీంతో పరిస్థితులు మరింతగా విషమిస్తున్నాయి. క్రమంగా ఈ వ్యాధి అమెరికా మొత్తాన్ని కమ్మేస్తోంది. అక్కడి 30 రాష్ట్రాల్లో ఇప్పటికే మరణాలు నమోదయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ 1 ట్రిలియన్‌ డాలర్లు కేటాయించేందుకు సిద్ధపడ్డారంటేనే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ‘‘త్వరలోనే మేం ఓ గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం’’ అంటూ ఆయన ఇటీవల ప్రకటించారు. కొవిడ్‌ మరణాల్లో ఇటలీ, చైనా తర్వాత స్థానంలో ఉన్న స్పెయిన్‌లో కూడా పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఆస్పత్రులు నిండిపోయాయి. దీంతో హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లను కూడా ఆస్పత్రులుగా మార్చేశారు. దీంతో పాటు మందుల కొరత కూడా వారిని తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మందుల కొరత ఇలాగే కొనసాగితే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2020-03-23T07:39:29+05:30 IST