వ్యాక్సిన్‌ కొరత.. ప్రజల వెత

ABN , First Publish Date - 2021-04-20T07:21:57+05:30 IST

కరోనాను ఎదుర్కోవడానికి

వ్యాక్సిన్‌ కొరత.. ప్రజల వెత

అల్వాల్‌,  ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ (టీకా) ఒక్కటే పరిష్కారమని అటు అధికారులు, ఇటు వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు టీకా కోసం కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వల్ప ఫీజు తీసుకుని టీకా ఇస్తున్నారు. ఒకే సారి అధిక సంఖ్యలో జనం వస్తుండడంతో టీకా కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్‌ లభించక చాలా మంది వెనుదిరుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుతో పాటు, డైరెక్టుగా వచ్చేవారికి కూడా టీకా ఇచ్చే ఏర్పాట్లు ఉండటంతో ఆయా సెంటర్లకు ప్రజలు ఉదయం 7 గంటల నుంచే వస్తున్నారు. 


అల్వాల్‌లో మూడు సెంటర్లలో

అల్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని నవ కళాకేంద్రంలో ఉచితంగా టీకా వేస్తుండగా, రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు తీసుకుని టీకా వేస్తున్నారు. కొరతతో అందరికీ టీకా వేయలేక పోతున్నారు. 


సరఫరా తక్కువ

అల్వాల్‌ పీహెచ్‌సీలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు నేరుగా వచ్చిన 200 మందికి టోకెన్‌లను జారీ చేస్తున్నారు. వారందరికీ ఇచ్చాక సమయం ఉంటే మరో వంద మందికి కూడా టీకా ఇస్తున్నారు. కానీ, రోజూ 500 నుంచి 600 మంది వరకు 45 ఏళ్లు దాటినవారు టీకా కోసం నిరీక్షిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో వైద్యులు అందరికీ ఇవ్వలేకపోతున్నారు. దీనిపై కొన్నిసార్లు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పంపిణీని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


సోమవారం 1000  డోస్‌ల వచ్చాయి

అల్వాల్‌ పీహెచ్‌సీకి సోమవారం 1000 డోస్‌లు వచ్చాయి. 600 మందికి ఇచ్చాం. 400 డోస్‌లను మంగళవారం కోసం స్టోర్‌ చేశాం. వ్యాక్సిన్‌ పట్ల అవగాహన పెరగడంతో జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ టీకా అందే విధంగా కృషి చేస్తున్నాం. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించడమే తమ ధ్యేయం. 

- వీరయ్య, ఫార్మసిస్ట్‌, అల్వాల్‌ పీహెచ్‌సీ.

Updated Date - 2021-04-20T07:21:57+05:30 IST