‘ప్రైవేట్‌’లోనూ వ్యాక్సినేషన్‌ అంతంతే..

ABN , First Publish Date - 2021-01-26T05:27:35+05:30 IST

ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ లక్ష్యాలు ‘మూడు అడుగులు ముందుకు పడితే ఆరు అడుగులు వెనక్కి పడుతున్న’ చందంగా ఉంది.

‘ప్రైవేట్‌’లోనూ వ్యాక్సినేషన్‌ అంతంతే..
మమతలో కలెక్టర్‌ కర్ణన్‌, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు

 1739మందికి టీకా తీసుకొంది 739మందే 

ప్రభుత్వ వైద్య ఉద్యోగుల మాప్‌అప్‌లోనూ అదే తీరు

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ కర్ణన్‌, డీఎంహెచ్‌వో మాలతి

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 25 : ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ లక్ష్యాలు ‘మూడు అడుగులు ముందుకు పడితే ఆరు అడుగులు వెనక్కి పడుతున్న’ చందంగా ఉంది. తొలివిడతలో ప్రభుత్వ వైద్యఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలకు వ్యాక్సిన్‌ ఇవ్వగా 64శాతం మేరకు లక్ష్యం పూర్తయ్యింది. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యఉద్యోగుల వంతు రాగా.. వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాక్సిన్‌ డబ్బాలతో నిరీక్షించినా ఫలితం కనిపించలేదని విమర్శలు వెలువడ్డాయి. సోమవారం ప్రైవేట్‌ అస్పటల్స్‌ ఉద్యోగులకు కొవిషీల్డ్‌ మొదటి డోసుతో పాటు ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాలను గుర్తించి ప్రభుత్వ వైద్య ఉద్యోగులకే వ్యాక్సినేషన్‌ బాధ్యతలను అప్పగించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వ్యాక్సినేషన్‌ నిర్వహించగా 1,739 మందికి గాను 739 మంది ప్రైవేట్‌ వైద్య ఉద్యోగులు, డాక్టర్లు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇక ప్రభుత్వ వైద్య ఉద్యోగులకు నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో 1,672మందికి గాను 39మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ కర్ణన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, ఇతర ప్రోగ్రామ్‌ అఫీసర్లు వెళ్లి పర్యవేక్షించారు. పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ కేంద్రాలను పరిశీలించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. 

భద్రాద్రి జిల్లాలో 656 మందికి వ్యాక్సినేషన్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మొత్తం 886మంది ప్రైవేట్‌ వైద్య ఉద్యోగులకు టీకా వేయాలన్న లక్ష్యం పెట్టుకోగా 656మంది వ్యాక్సినేషన్‌కు హాజరయ్యారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌నాయక్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు లేవన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, స్టాఫ్‌ నర్సులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది ఆరోగ్యకార్యకర్తలు ఆశాకార్యకర్తలు నిర్వహించగా.. డిప్యూటీ డీఎంహెచ్‌వో, భావ్‌సింగ్‌, డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి నాగేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షించారు.

ఇరుజిల్లాల్లో 18మందికి కొవిడ్‌ 

కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఖమ్మం సంక్షేమవిభాగం, జనవరి 25 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 18మందికి కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 899 మందికి పరీక్షలు నిర్వహించగా 14మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 8, భద్రాచలం డివిజన్‌లో ఆరుగురు బాధితులున్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఖమ్మం జిల్లాలో నలుగురు కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు రోజువారీ నివేదికలో పేర్కొన్నారు.


Updated Date - 2021-01-26T05:27:35+05:30 IST