మొదలైన వ్యాక్సినేషన్‌... సర్వత్రా రిలాక్సేషన్‌...

ABN , First Publish Date - 2021-01-17T04:42:44+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శనివారం తొలిరోజు కొవిడ్‌ టీకా కార్యక్ర మం విజయవంతమైంది. టీకా తీసుకున్నవారిలో ఎవరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఉమ్మడి జిల్లాలో 21సెంటర్లలో 30మంది చొప్పున 630 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా, 441 మంది తీసుకున్నారు. వివిధ కారణాలతో 180 మంది వ్యాక్సిన్‌ను పొందలేకపోయారు. ముందే పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారుల్లో కొందరు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, జ్వరంతో బాధపడుతుండడం, బాలింతలు కావడం, ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించడం, చివరి నిమిషంలో అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల కొన్ని సెంటర్లలో కొందరికి టీకాలు వేయలేకపోయారు.

మొదలైన వ్యాక్సినేషన్‌... సర్వత్రా రిలాక్సేషన్‌...
వరంగల్‌ ఎంజీఎంలో మొదటి వ్యాక్సిన్‌ వేయించుకుంటున ్న ఎంజీఎం ఆస్పత్రి కార్పెంటర్‌ సిద్ధయ్యచారి, అభినందిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, కడియం

కొవిడ్‌ టీకాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు విజయవంతం
ఎంపిక చేసిన 630 మందిలో 441 మందికి వ్యాక్సిన్‌
పలు కారణాలతో 189 మంది దూరం
అర్బన్‌ జిల్లాలో నిరసనల మధ్య వ్యాక్సినేషన్‌
ఫ్లెక్సీలపై ప్రధాని ఫొటో లేకపోవడంపై బీజేపీ నాయకుల ఆగ్రహం


హన్మకొండ/హన్మకొండ అర్బన్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శనివారం తొలిరోజు కొవిడ్‌ టీకా కార్యక్ర మం విజయవంతమైంది. టీకా తీసుకున్నవారిలో ఎవరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఉమ్మడి జిల్లాలో 21సెంటర్లలో 30మంది చొప్పున 630 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా, 441 మంది తీసుకున్నారు. వివిధ కారణాలతో 180 మంది వ్యాక్సిన్‌ను పొందలేకపోయారు. ముందే పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారుల్లో కొందరు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, జ్వరంతో బాధపడుతుండడం, బాలింతలు కావడం, ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించడం, చివరి నిమిషంలో అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల కొన్ని సెంటర్లలో కొందరికి టీకాలు వేయలేకపోయారు.

వ్యాక్సినేషన్‌
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆరు సెంటర్లలో మొత్తం 180మందికి, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నాలుగు సెంటర్లలో 120మందికి బదులు 106మందికి, జనగామ జిల్లాలో రెండు సెంటర్లలో మొత్తం 60 మందికి, ములుగు జిల్లాలో రెండు సెంటర్లలో మొత్తం 60 మందిలో 40 మందికి, మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగు సెంటర్లలో 120మందికి గానూ 115 మందికి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మూడు సెంటర్లలో మొత్తం 90 మందికి టీకాలు వేశారు. తొలి టీకాను నాలుగో తరగతి ఉద్యోగులకు వేశారు.  కొన్ని సెంటర్లలో డాక్టర్లు వేయించుకున్నారు. టీకా తీసుకునేందుకు ఎవరూ సంకోచించకుడా ధైర్యంగా ముందుకొచ్చారు.

అర్బన్‌ జిల్లాలో..
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి అకడమిక్‌ హాల్‌లో డిజిటల్‌ స్ర్కీన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత వ్యాక్సిన్‌ సెంటర్‌కు చేరుకొని రిబ్బన్‌కట్‌ చేశారు. జ్యోతిప్రజ్వలన చేసి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రఽధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కృషితోనే ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు.

కాగా, మొదటి టీకాను ఎంజీఎం ఆస్పత్రిలో కార్పెంటర్‌గా పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగి సిద్ధయ్యచారి తీసుకున్నారు. హన్మకొండలోని పోచమ్మకుంటలోని యూపీహెచ్‌సీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని యూపీహెచ్‌సీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, హసన్‌పర్తి పీహెచ్‌సీలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌, కమలాపూర్‌ పీహెచ్‌పీలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కలెక్టర్‌ రాజీవ్‌గాందీ హన్మంతు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, డీఎంహెచ్‌వో లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆత్మకూరులో కలెక్టర్‌ హరిత వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. 120 మందికి 106 మంది టీకాలు వేయించుకున్నారు.

జనగామ జిల్లా పాలకుర్తి పీహెచ్‌సీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలిటీకాను స్వీపర్‌ చిలుకమారి ఆంజనేయులు వేయించుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. మొదటి టీకాను స్వీపర్‌ బక్క నర్సయ్య తీసుకున్నారు. ఈ  రెండు కేంద్రాల్లో మొత్తం 60 మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సెంటర్లలో వ్యాక్సినేషన్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని సెంటర్‌లో  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంబాలపల్లి సెంటర్‌లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. డోర్నకల్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పాల్గొన్నారు. మొత్తం 120 మందిలో 115 మంది టీకాలు వేయించుకున్నారు. మహబూబాబాద్‌లో 30కి 28 మంది, కంబాలపల్లిలో 30కి 29 మంది, తొర్రూరులో 30కి 28 మంది, డోర్నకల్‌లో మొత్తం 30 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి, ఏటూరునాగారం సీహెచ్‌సీలలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ ప్రారంభించారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పాల్గొన్నారు. మొత్తం 60 మందికి గానూ 40మందే టీకాలు తీసుకున్నారు.

భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పీహెచ్‌సీలో జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, మహదేవ్‌పూర్‌ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, చిట్యాల సీహెచ్‌సీలో స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. భూపాలపల్లిలో హెల్త్‌ అసిస్టెంట్‌ ఓరుగంటి గోపికృష్ణ, మహదేవ్‌పూర్‌లో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, చిట్యాలలో డాటాఎంట్రీ ఆపరేటర్‌ జూలూరు శ్రీనాథ్‌ తొలి టీకాలు తీసుకున్నారు.

పునర్జన్మ పొందినట్లయింది
- బి.రజిత, క్లర్క్‌ పాలకుర్తి పీహెచ్‌సీ

కొవిడ్‌ టీకా తీసుకోవడంతో పునర్జన్మ పొందినట్లయింది. వ్యాక్సిన్‌ లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మందు లేదని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. టీకా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా వ్యాక్సిన్‌ వస్తుందనుకోలేదు. వ్యాక్సిన్‌ రావడంతో ఆత్మస్థైర్యం పెరిగింది.

ఇతరులకు అవగాహన కల్పిస్తా..
- సోని, ఆశా వర్కర్‌ , హన్మకొండ

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నాకు కరోనాను ఎదుర్కోవడానికి బలం వచ్చిందనే ధైర్యం కలిగింది. ఆ తర్వాత అధికారులు కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించి ఇతరులకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తా. వ్యాక్సిన్‌ తీసుకొన్న తర్వాత 30 నిమిషాలపాటు అబ్జర్వేషన్‌లో పెట్టారు. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండో వ్యక్తిగా, మొదటి మహిళగా నాకు గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది.

టీకా వేసుకోవడం ఆనందంగా ఉంది
- బక్క నర్సయ్య, జనగామ జిల్లా ఆస్పత్రి స్వీపర్‌

కొవిడ్‌ సమయంలో ఆస్పత్రిలో భయంభయంగా విధులు నిర్వహించాను. జనగామ జిల్లాలో మొదటి కొవిడ్‌ టీకా నాకే వేయడం ఆనందంగా ఉంది. అధికారులు పూర్తి సమాచారంతో భరోసా కల్పించారు. దీంతో టీకా వేసుకున్న. ఎలాంటి భయాందోళనకు గురికాలేదు. టీకా వేసుకోవడం మరింత ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహించేలా భరోసా కలిగింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేదు.


ఫ్లెక్సీలు చించేసిన బీజేపీ కార్యకర్తలు
హన్మకొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఎంజీఎం ఆస్పత్రి, పోచమ్మమైదాన్‌, హసన్‌పర్తి, కమలాపూర్‌లోని వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయా సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని ఫొటో లేనందుకు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంజీఎం ఆస్పత్రి సెంటర్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీకా కార్యక్రమం ప్రారంభించిన కొద్దిసేపటికి బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఫ్లెక్సీలపై ప్రధాని  మోదీ ఫొటో లేనందుకు వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లెక్సీలను చించివేశారు. వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులకు, పోలీసులకు మధ్య తోపుటాల జరిగింది. కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వరంగల్‌ దేశాయిపేటలోని యూపీహెచ్‌సీలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ వద్ద  కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారికి టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడ కూడా వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు హసన్‌పర్తిలో పీహెచ్‌సీ, కమలాపూర్‌ పీహెచ్‌సీల్లోనూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగి ఫ్లెక్సీలను తొలగించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్‌ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్దం నరేష్‌, కనుకుంట్ల రంజిత్‌, సునిల్‌ కత్రి, కూచన క్రాంతి, సముద్రాల పరమేశ్వర్‌, తదితరులు ఈ  ఆందోళనలో పాల్గొన్నారు.





 











Updated Date - 2021-01-17T04:42:44+05:30 IST