కో-విన్ యాప్‌లో సాంకేతిక లోపాలు... అందని సందేశాలు!

ABN , First Publish Date - 2021-01-19T16:19:31+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై యావత్ దేశం పోరాడుతోంది. వ్యాక్సినేషన్...

కో-విన్ యాప్‌లో సాంకేతిక లోపాలు... అందని సందేశాలు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై యావత్ దేశం పోరాడుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభించి మూడు రోజులు గడిచింది. ఇప్పటికే లక్షల మందికి టీకాలు వేశారు. అయితే ఈ నేపధ్యంలో పలు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి రూపొందించిన కో-విన్ యాప్‌లో పలు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. కొంతమందికి టీకాలు వేయించుకోవాల్సిన సమయానికి సంబంధించిన సమాచారం అందడం లేదు.


మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలో వ్యాక్సినేషన్ తొలిరోజునే కో-విన్ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలు కనిపించాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలో చాలామందికి తెలియలేదు. దీంతో వారంతా వివిధ ఆసుపత్రులకు ఫోన్ చేసి, దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం తొలిరోజున ఢిల్లీలోని 35 శాతం ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అందలేదు. రెండవరోజు కూడా ఇటువంటి సమస్యే ఎదురు కావడంతో వివిధ ఆసుపత్రులలోని సిబ్బంది టీకా తీసుకోవలసినవారికి ఫోన్‌చేసి సమాచారం అందించాల్సివచ్చింది.

Updated Date - 2021-01-19T16:19:31+05:30 IST