Abn logo
Sep 24 2021 @ 23:34PM

పోలీసుల పహారాలో కరోనా వ్యాక్సినేషన్‌

కంగ్టి, సెప్టెంబరు 24:  కరోనా టీకా తీసుకునే విషయంలో మొదట్లో అలసత్వం ప్రదర్శించిన జనం.. ఇప్పుడు ఆరోగ్య కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం పరిమితికి మించి అధికంగా జనం వస్తుండడంతో వైద్యసిబ్బందికి తలనొప్పిగా మారుతున్నది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. రిజిస్ర్టేషన్‌ కోసం కౌంటర్‌, క్యూలో నిల్చునేందుకు ఏర్పాటు చేసినా కూడా జనం తోసుకుంటూ భౌతికదూరం మరిచారు. వైద్యాధికారి మనోహర్‌రెడ్డి పోలీసుల పహారాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించారు. నిత్యం వంద డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే సరఫరా అవుతున్నది. దీనికి తోడు సిరంజీల కొరత కూడా వేధిస్తున్నది. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కంగ్టి పీహెచ్‌సీకి ఉన్నతాధికారులు చొరవ చూపి అదనంగా వ్యాక్సిన్‌, సిరంజీలు సరఫరా చేయాలని వైద్యులు కోరుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం పీహెచ్‌సీకి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.