కరోనా కాస్కో.. టీకా రెడీ..

ABN , First Publish Date - 2021-01-07T06:08:34+05:30 IST

ప్రత్యేక ఇన్సూలేటెడ్‌ కార్గో

కరోనా కాస్కో.. టీకా రెడీ..

పకడ్బందీగా వాక్సినేషన్‌ ప్రక్రియ 

నిల్వలకు 95 కేంద్రాలు

జీహెచ్‌ఎంసీలో రెండు ప్రధాన  స్టోరేజీలు

గ్రేటర్‌కు రానున్న 1.32 లక్షల డోసులు 

టీకా వేసేది ఏఎన్‌ఎం

ప్రవేశ ద్వారం, వెళ్లే మార్గం వేర్వేరుగా...


కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌కు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారం రోజుల్లో వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. వ్యాక్సిన్‌ రాగానే నిల్వ చేయడానికి జిల్లాలో 93 స్టోరేజీ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక ఇన్సూలేటెడ్‌ కార్గో విమానాల ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వ్యాక్సిన్‌ రానుంది. అక్కడ నుంచి కోఠిలోని రాష్ట్ర వ్యాక్సిన్‌ సెంటర్‌కు తరలిస్తారు.  అక్కడ నుంచి జీహెచ్‌ఎంసీలోని రెండు స్టోరేజీ సెంటర్లకు చేరుస్తారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన మరో 93 స్టోరేజీ కేంద్రాలకు ఈ వ్యాక్సిన్‌ను తరలిస్తారు. శ్రీరాంనగర్‌, చుట్టలబస్తీ, హరాజ్‌పెంట, బేగంబజార్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాలకు తరలిస్తారు. ఏ రోజుకు ఆ రోజు స్టోరేజీ కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా టీకాలు ఇచ్చే కేంద్రాలకు తరలిస్తారు. 


1.32 లక్షల డోసులు...

గ్రేటర్‌ హైదరాబాద్‌కు 1.32 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపించనున్నట్లు తెలిసింది. వీటిని 2 నుంచి 8 సెల్సియస్‌ డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. 


ఏఎన్‌ఎం ద్వారా టీకాలు

కరోనా వ్యాక్సిన్‌ను ఏఎన్‌ఎం ద్వారానే ఇప్పించనున్నారు. ఇందుకు తగిన శిక్షణ వారికి ఇచ్చారు. సహాయంగా ఇతర సిబ్బంది ఉంటారు. ఇందుకు గాను దాదాపు 500 మంది స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలను నియమించనున్నారు. 


వేర్వేరు ద్వారాలు...

వ్యాక్సిన్‌ కేంద్రంలో ప్రవేశ ద్వారం, తిరిగి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. రోజూ ఉదయం 9 నుంచి 5 గంటల వరకు వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ రెండు గంటలకు 25 మంది చొప్పున టీకాలు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి

తొలివిడత వైద్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. ఇందులో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ తదితరులు ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో పనిచేసే అందరికీ వ్యాక్సిన్‌  వేయనున్నారు. జిల్లాలో దాదాపు 78,236 మందికి, రంగారెడ్డి జిల్లాలలో 26,078 మందికి, మేడ్చల్‌ జిల్లాలో 14,702 మంది హెల్త్‌వర్కర్లకు టీకాలు ఇస్తారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఎవరికి సూచించిన కేంద్రంలో వారే టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. 


ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా...

హైదరాబాద్‌లో 278 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌హోములు, పెద్ద క్లినిక్‌లలో కూడా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రభుత్వ  బోధనాస్పత్రులు, యూపీహెచ్‌సీలు, స్కూల్స్‌, కమ్యూనిటీ హాళ్లలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 


మంత్రి తలసానితో చర్చలు...

హైదరాబాద్‌ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కరోనా వ్యాక్సిన్‌ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో డాక్టర్‌ వెంకటి చర్చించారు. పంపిణీలో తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. ముందుగానే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, అవగాహన కల్పించామని వివరించారు. 


కలెక్టర్‌ సమీక్ష...

హైదరాబాద్‌ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కలెక్టర్‌ శ్వేతా మహంతి బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో  కరోనా వ్యాక్సిన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఎస్‌పీహెచ్‌ఓ, మెడికల్‌ ఆఫీసర్లు, ఇతర అధికారులతో మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అందించే విషయంలో కొవిడ్‌ యాప్‌ సాంకేతికతను వారికి వివరించారు. ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. 


ఉస్మానియాలో రేపు డ్రై రన్‌- 13 నుంచి వ్యాక్సినేషన్‌

మంగళ్‌హాట్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆసుపత్రిలో ఈ నెల 8వ తేదీన డ్రై రన్‌, 13, 14, 15 తేదీల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డ్రై రన్‌ నిర్వహించిన ప్రాంతంలోనే మూడు రోజుల పాటు 2602 మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహించి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు, సరఫరా చేసేందుకు అవసరమైన సౌకర్యాలను ముందుగానే సమకూర్చుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-01-07T06:08:34+05:30 IST