కరోనా ఔషధాల కోసం భాగస్వామ్యం

ABN , First Publish Date - 2021-05-14T05:30:43+05:30 IST

అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచి కరోనా-2పై పోరాటానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫార్మా దిగ్గజం లుపిన్‌ ప్రకటించింది....

కరోనా ఔషధాల కోసం భాగస్వామ్యం

ప్రపంచ కంపెనీలపై లుపిన్‌ ఫోకస్‌


న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచి కరోనా-2పై పోరాటానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫార్మా దిగ్గజం లుపిన్‌ ప్రకటించింది. తొలి విడత కరోనా సమయంలో క్రియాశీలంగా ఉండకూడదన్న వ్యూహాన్ని మార్చుకుని ఇన్ఫెక్షన్ల నిరోధక ఔషధాల ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. కొవిడ్‌-19 అదుపు చేయగల కొత్త ఔషధాలు మెర్క్‌, ఫైజర్‌ నుంచి వచ్చాయని, లుపిన్‌ కూడా వాటిలో భాగస్వామి కావాలనుకుంటోందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ గుప్తా తెలిపారు. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, అయితే రాబోయే కొద్ది నెలల్లో చెప్పుకోదగ్గ పురోగతిని ఆశించలేమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు లేకుండా పడి ఉన్న తమ నాగ్‌పూర్‌ యూనిట్‌ను కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు.


రెమ్‌డెసివిర్‌ తయారుచేసే యోచన ఉన్నదా అన్న ప్రశ్నకు ఇందుకోసం తమ దరఖాస్తు పెండింగులో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ కంపెనీ భాగస్వామ్యంలో దాన్ని తయారుచేస్తామన్నారు. ఎలీ లిల్లీ భాగస్వామ్యంలో బారిసిటినిబ్‌ ఔషధం విడుదల చేయడానికి కనీసం రెండు నెలలు పడుతుందని గుప్తా చెప్పారు. డీజీసీఐ ఎంత త్వరగా అనుమతి ఇస్తుందనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. 


లాభంలో 18 శాతం వృద్ధి : ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లుపిన్‌ రూ.3,783 కోట్ల ఆదాయంపై రూ.460 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.3,846 కోట్లు కాగా లాభం రూ.390 కోట్లు. కాగా మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.15,163 కోట్ల ఆదాయంపై రూ.1,216 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 

Updated Date - 2021-05-14T05:30:43+05:30 IST