నేడే కరోనా టీకా...

ABN , First Publish Date - 2021-01-16T05:38:22+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ వైరస్‌ మహమ్మారికి ఇక చెక్‌ పడనుంది. శనివారం ఉదయం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

నేడే కరోనా టీకా...

  • మరికొన్ని గంటల్లో కరోనా వ్యాక్సిన్‌
  • వేసేందుకు సిద్ధమైన వైద్యఆరోగ్యశాఖ
  • రంగారెడ్డి జిల్లాలోని కేంద్రాలకు చేరుకున్న 1,190 డోసులు 
  • 9 కేంద్రాలు ఏర్పాటు
  • వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు మూడు కేంద్రాల్లో..
  •  మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 11 కేంద్రాల్లో ప్రారంభం
  • షాపూర్‌నగర్‌ యూహెచ్‌సీ, శామీర్‌పేట పీహెచ్‌సీల్లో ప్రారంభించనున్న మంత్రి మల్లారెడ్డి


ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ వైరస్‌ మహమ్మారికి ఇక చెక్‌ పడనుంది.  శనివారం ఉదయం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిరోజు జిల్లాలో ఎంపిక చేసిన 23 కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. మొదట వైరస్‌పై ముందుండి పోరాడుతున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు టీకా వేస్తారు. తరువాత ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో పనిచేస్తున్న  డాక్టర్లు, సిబ్బంది, ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా మహమ్మారి అంతు చూసేందుకు అడుగు ముందుకు పడింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి కరోనావ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటలకు టీకా వేయనున్నారు. వ్యాక్సిన్‌ వేసేందుకు జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి 1190 డోసులు సిద్ధం చేసి వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పంపించేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌వర్కర్లు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటి విడతలో 26,789 మంది ఉద్యోగులు, సిబ్బందికి కొవిడ్‌ టీకా ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి రోజున నేడు టీకా కేంద్రంలో 30 మదికి మాత్రమే వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.  మొదటి రోజు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 18వ తేదీ నుంచి ప్రతీ కేంద్రంలో 100 మం దికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ చేసిన తర్వాత అరగంట పాటు వారిని వ్యాక్సినేషన్‌ కేం ద్రంలో ఉంచాలని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉత్పన్నమైనా వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా అవసరమైన మందులు సిద్ధంగా ఉంచారు. 108 అంబులెన్స్‌ వాహనాలను కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద సిద్ధం చేశారు. 

 మొదట హెల్త్‌కేర్‌ వర్కర్లకే.. 

(ఆంధ్రజ్యోతి,వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో తాండూరు జిల్లా ఆసుపత్రితో పాటు వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి, పరిగిలోని సీహెచ్‌సీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. ఒక్కో ఆసుపత్రిలో 30మంది వంతున మొత్తం 90 మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. మొదటి రోజు, ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. తొలి విడతలో భాగంగా జిల్లాకు 46 కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ వాయిల్స్‌ కేటాయించారు. వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. ఆది, బుధ, శనివారాలతో పాటు ఇతర పబ్లిక్‌ హాలీడే్‌సల్లో వ్యాక్సినేషన్‌ ఇవ్వరని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింథే తెలిపారు. 

క్రమంగా పెరగనున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మూడు కేంద్రాల్లో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా  సెంటర్లను పెంచనున్నారు.  దీంతోపాటు వ్యాక్సినేషన్‌ ఇచ్చే వారి సంఖ్య కూడా పెరగనుంది. ప్రతీ కేంద్రంలో వంద మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, క్రమంగా ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 3,039 మంది హెల్త్‌ కేర్‌వర్కర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు, ఆతరువాత ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో పనిచేస్తున్న 2,356 మంది డాక్టర్లు, సిబ్బంది, ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 5,395 మంది డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్త్‌కేర్‌ వర్కర్లను గుర్తించి వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఎవరికి ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ వ్యాక్సిన్‌ వేయనున్నారనేది సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించనున్నారు. తొలిరోజు ప్రారంభించనున్న మూడు కేంద్రాలతో పాటు జిల్లాలో కొడంగల్‌, మర్పల్లి సీహెచ్‌సీలు, 22 రూరల్‌, అర్బన్‌ పీహెచ్‌సీల్లో 5,395 మంది వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం 50 ఏళ్లకు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వైర్‌సపై ముందుండి పోరాడుతున్న పోలీసు, మునిసిపల్‌, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. 

 3,270 డోసుల వ్యాక్సిన్‌

(ఆంధ్రజ్యోతి,మేడ్చల్‌జిల్లాప్రతినిధి): మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో తొలిరోజు టీకాను వేసేందుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో  మొత్తం 59 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వనున్నారు. జిల్లాలో శనివారం 11 కేంద్రాల్లో టీకాను ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.  కుత్బుల్లాపూర్‌ మండలం షాపూర్‌నగర్‌లో, శామీర్‌పేట్‌ మండలకేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో టీకాను రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లాలో ప్రతి కేంద్రానికి 30మంది చొప్పున మొత్తం 330 మందికి టీకాను వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో ఐదుగురు చొప్పున వైద్య సిబ్బందిని నియమించారు. మొత్తం 55 మంది సిబ్బందితో టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం జిల్లాకు 3,270 డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లాలో మొత్తం 14,700 మందికి టీకాను వేయనున్నారు. ఈనెల 18 నుంచి 59 కేంద్రాల్లో రోజువారీగా 100మందికి టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడత టీకాను 28 రోజలు తర్వాత వేయనున్నారు. 

టీకా పంపిణీకి ప్రత్యేకాధికారుల నియామకం

మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ టీకాను పంపిణీ చేసేందుకు గానూ జిల్లా యంత్రాంగం ఒక్కో కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించింది. ఆల్వాల్‌ పీహెచ్‌సీ కేంద్రానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పి.రవీందర్‌ను నియమించింది. అదేవిధంగా బాలానగర్‌ పీహెచ్‌సీకి జిల్లా అటవీశాఖ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, కుషాయిగూడ పీహెచ్‌సీకి జిల్లా వయోజనవిద్యా అధికారి ఎస్‌.గణే్‌షను, కీసర పీహెచ్‌సీకి జిల్లా ఎస్సీ డెవెల్‌పమెంట్‌ అధికారి జి.వినోద్‌కుమార్‌, మల్లాపూర్‌ యూహెచ్‌సీకి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి.బాలాజీ, వెంకట్‌రెడ్డినగర్‌ యూపీహెచ్‌సీకి జిల్లా మైనింగ్‌ ఏడీ టి.లింగస్వామి, నారపల్లి పీహెచ్‌సీకి జిల్లా సహకార శాఖ అధికారి ఎన్‌.శ్రీనివా్‌సరావు, శాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీకి ఉద్యానవన శాఖ అధికారి ఎం.ఎ.సత్తార్‌, మల్కాజ్‌గిరి పీహెచ్‌సీకి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఛత్రు, శామీర్‌పేట్‌పీహెచ్‌సీకి సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం జి.రాజేందర్‌, ఉప్పల్‌ పీహెచ్‌సీకి జిల్లాపశుసంవర్థక శాఖ అధికారి పి.శేఖర్‌లను నియమించింది. 


వ్యాక్సిన్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

 మంత్రి సబితాఇంద్రారెడ్డి 

 కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ఏర్పాట్లపై ఆమె శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాక్సిన్‌ నిల్వ, కేంద్రాలకు రవాణా చేసే విషయమై, కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రితో పాటు తాండూరుజిల్లా ఆసుపత్రి, పరిగి సీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని, 18వ తేదీ నుంచి అన్ని పీహెచ్‌సీల్లో ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలో 28 కేంద్రాల్లో రోజుకు ఒక్కోసెంటర్‌లో వందమందికి వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. వ్యాక్సిన్‌ వేసిన తరువాత, అబ్జర్వేషన్‌ కోసం ఉంచే వెయిటింగ్‌ హాల్‌లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే పెద్దాసుపత్రులకు తరలించడానికి వీలుగా 108, ఇతర అంబులెన్స్‌ వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆమె ఆదేశించారు. గర్భిణులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, 18 ఏళ్లలోపు ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయరని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య,  కలెక్టర్‌ పౌసుమిబసు, జడ్పీ వైస్‌చైర్మెన్‌ విజయకుమార్‌, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఎంహెచ్‌వో సుధాకర్‌ సింథే తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:38:22+05:30 IST