పల్లెకు పాకిన కరోనా..!

ABN , First Publish Date - 2020-06-05T10:27:15+05:30 IST

తొలకరి మొదలైంది.. ఏరువాకకు రైతన్నలు సన్నద్ధ్దమవుతున్నారు. కష్టజీవులు ఖరీఫ్‌కు సై అంటున్న వేళ కరోనా మహమ్మారి గ్రామ

పల్లెకు పాకిన కరోనా..!

ప్రశాంత పల్లెల్లో అలజడి

మనవాళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

ఉపాధి, వ్యవసాయ పనుల్లో భౌతిక దూరం తప్పనిసరి

జిల్లాలో 17 కేసులు నమోదు

ఒక్క నవాబుపేటలోనే 13 మందికి పాజిటివ్‌

170కి చేరిన కరోనా బాధితులు


కడప, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తొలకరి మొదలైంది.. ఏరువాకకు రైతన్నలు సన్నద్ధ్దమవుతున్నారు. కష్టజీవులు ఖరీఫ్‌కు సై అంటున్న వేళ కరోనా మహమ్మారి గ్రామ సీమలకు పాకింది. పల్లె జనంలో అలజడి రేపుతోంది. ఇన్నాళ్లూ కరోనా భయం లేకుండా ప్రశాంతంగా గడిపిన గ్రామీణులు.. వ్యవసాయ పనులు మొదలవుతున్న వేళ కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్క నవాబుపేటలోనే 25 మందికి కోవిడ్‌-19 సోకింది. జిల్లాలో 170 కేసులు నమోదైతే అందులో 39 పల్లెల్లోనే. 


జిల్లాలో ఏప్రిల్‌ ఒకటో తారీఖున ఒకేరోజు 15 కేసులు నమోదయ్యాయి. ఆ రోజుతో మొదలైన కరోనా వ్యాప్తి గురువారం హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించిన 17 కేసులతో కలిపి 170కి చేరాయి. మొదట్లో పట్టణాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే పల్లెల్లో వ్యవసాయ పనుల జోరు పెరిగింది. ఈ సమయంలో పల్లెసీమల్లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుండడంతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు.


ఉపాధి పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

జిల్లాలో 774 పంచాయతీల పరిధిలో 29,179 ఉపాధి హామీ పథకం, శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. 4.94 లక్షల మంది కూలీలు రిజిసే్ట్రషన్‌ చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 1.50 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. అయితే.. పని దగ్గర భౌతిక దూరం పాటించడంలేదని, మాస్కులు ధరించడంలేదన్నది ప్రధాన ఆరోపణ. ఉపాధి హామీ అధికారులు కూడా కనీస జాగ్రత్తలు చెప్పడంలేదని తెలుస్తోంది. నవాబుపేటలో కరోనా వ్యాప్తికి ఉపాధి పనులకు వెళ్లడం కూడా ఓ కారణమని సమాచారం. దీంతో భౌతిక దూరం పాటి స్తూ పనులు చేసేలా ఎన్‌ఆర్‌జీఎస్‌ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.


పల్లెల్లో ఈ జాగ్రత్తలు పాటించాలి

  • గ్రామానికి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వలంటీరు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఏఎన్‌ఎంకు సమాచారం ఇవ్వాలి. మనవాళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు.
  • ఉపాధి హామీ పనుల్లో మనిషికి మనిషికి మీటరు దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. 
  • పొలం పనుల్లో రైతులు పక్క పక్కన కాకుండా దూరదూరంగా పనులు చేయాలి.
  • వరి నాట్లు, విత్తనాలు వేసే సమయంలో కూలీల మధ్య కనీసం మీటరు దూరం ఉండాలి. 
  • సాయంత్రం పొలం పనుల నుంచి రాగానే ఊరి రచ్చబండ వద్దకు చేరుకుని గుంపులుగా కూర్చోవడం మంచిదికాదు. ఇంట్లోనే ఉండడం ఉత్తమం. 
  • పొలం పనులకు వెళ్లిన కూలీలు, రైతులు మధ్యాహ్నం భోజనం కూడా దూరదూరంగా కూర్చుని తినడం ఉత్తమం.


ఒక్క వ్యక్తి నుంచి 24 మందికి..

మైలవరం మండలం నవాబుపేటలో ఒక్కరితో మొదలైన కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గురువారం ఆ గ్రామంలో మరో 13 మందికి పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరితో కలిపితే బాధితుల సంఖ్య 25కు చేరింది. అంటే ఒక్క వ్యక్తి నుంచి 24 మందికి కరోనా వ్యాపించింది. దీంతో గ్రామంలో జనం భయాందోళన చెందుతున్నారు. వైరస్‌ ఎలా వ్యాపించిందో లింకు తెలియడంలేదు. ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆ గ్రామాన్ని సందర్శించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వీధి నుంచి చుట్టూ 400 మీటర్లలో క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. ప్రొద్దుటూరులో ఇద్దరికి, కడపలో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఇద్దరు కువైత్‌ నుంచి వచ్చిన వారు అని అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు 170కి చేరాయి.


గుండెపోటా.. కరోనాతో మృతి చెందారా..?

నవాబుపేటలో 64 ఏళ్ల వృద్ధుడు బుధవారం కరోనా బాధితులను చూసి షాక్‌కు గురై  మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుతోనే చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే.. ఆ వృద్ధుడికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందని విశ్వసనీయ సమాచారం. కోవిడ్‌-19 నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. పాడి మోసిన నలుగురు పీపీఈ కిట్‌లు ధరించి.. అంత్యక్రియలకు నలుగుదైరుగురిని మాత్రమే అనుమతించారు. అధికారుల పర్యవేక్షణలోనే అంత్యక్రియలు జరిగాయి. దీంతో అతను గుండెపోటుతో మరణించాడా..? కరోనా పాజిటివ్‌ వల్ల మృతి చెందాడా..? అన ్న ప్రశ్న గ్రామస్తులను వెంటాడుతోంది. అయితే.. మృతి చెందిన వృద్ధుడు కంటైన్మెంటు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహించామని అఽధికారులు పేర్కొనడం కొసమెరుపు.


జిల్లాలో గ్రామాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ః


మండలం గ్రామం కేసులు 


మైలవరం నవాబుపేట 25

వేంపల్లె వేంపల్లె 4

సంబేపల్లె మోటకట్ల 1

బద్వేలు గొడుగునూరు 1

పోరుమామిళ్ల జిల్లెల్ల 1

చిట్వేలు చిట్వేలు 1

పుల్లంపేట దొండ్లోపల్లె 1

ఓబులవారిపల్లె చిన్నఓరంపాడు 1

జమ్మలమడుగు గండికోట 1

చెన్నూరు చెన్నూరు 2

ప్రొద్దుటూరు కల్లూరు 1


మొత్తం 39



జిల్లాలో కరోనా వైరస్‌ శాంపిల్స్‌ రిజల్ట్స్‌ 

- మొత్తం శాంపిల్స్‌ ః  37005

- రిజల్ట్స్‌ వచ్చినవి ః  35397

- నెగటివ్‌ ః  35222

- పాజిటివ్‌ ః  170

- రిజల్ట్స్‌ రావలసినవి ః  1608

- జూన్‌ 4వతేదీకి తీసిన శాంపిల్స్‌ ః 1212

Updated Date - 2020-06-05T10:27:15+05:30 IST