కరోనా మహమ్మారికి మంచి మందు ఇదే...

ABN , First Publish Date - 2021-05-17T17:23:40+05:30 IST

ఎవరేమన్నా, ఏం విన్నా వ్యక్తిగతంగా....

కరోనా మహమ్మారికి మంచి మందు ఇదే...

  • వార్డులో ఒక్కడినే...
  • ఆత్మబలమే కరోనాకు మంచి మందు
  • తలచేది జరగదు.. జరిగేది తెలియదు 
  • కరోనా విజేత, రచయిత ఉదయభాను.ఎం

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : ‘‘కరోనా మహమ్మారికి ఎలాంటి వివక్షా లేదు. జ్వరంతో మొదలై ఎంతటి వారినైనా జడిపిస్తుంది. వైరస్‌ బారిన పడిన వారు భయపడకుండా చికిత్సకు మానసికంగా తయారవ్వాలి. ఎవరేమన్నా, ఏం విన్నా వ్యక్తిగతంగా బెదరకుండా ఆశావాదంతో ముందుకు కదలాలి. ఆత్మబలమే కరోనాకు మంచి మందు. తలచేది జరగదు. జరిగేది తెలియదు’’ అంటున్నారు కొత్తపేటలో ఉండే కరోనా విజేత, రచయిత ఉదయభాను.ఎం(67). ఆయన కొన్నాళ్ల కింద ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. కరోనా నుంచి ఎలా బయటపడ్డారో ఆ అనుభవాలు ఆయన మాటల్లోనే...


సాధారణ జ్వరంతో మొదలై...

ముందుగా సాధారణ జ్వరం, జలుబుతో అనారోగ్యం మొదలైంది. ప్యారాసిటమాల్‌ తీసుకున్నా మూడు రోజుల వరకు జ్వరం తగ్గలేదు. కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. కార్డియాక్‌ పేషెంట్‌ను కావడం వల్ల సీటీ స్కాన్‌, ఎక్స్‌రే తదితర టెస్టులు చేయించారు. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య 3 వేలకు పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. టెంపరేచర్‌ పెరగకుండా, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా వైద్యులు తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేశారు. వార్డులో ఒక్కడినే ఒంటరిగా ఉంటున్నా, నిరంతర పరీక్షలు ఒకింత ఆందోళన కలిగించే అంశాలే అయినా అస్సలు ధైర్యం కోల్పోలేదు. నెగెటివ్‌ ఆలోచనలను దరి చేరనీయకుండా అన్నింటినీ సరి చేసుకుంటూ గడిపాను. కేన్సర్‌, టీబీల కన్నా కరోనా భయంకరమైన, ప్రమాదకరమైన వ్యాధి కాదనే స్థిర అభిప్రాయానికి వచ్చాను. చికిత్సతో తప్పక నయమవుతుందని సంపూర్ణంగా విశ్వసించాను.


కొంత తాత్విక చింతన 

ఆస్పత్రిలో ఉన్న మూడు రోజులూ టీవీ చూడలేదు. పేపర్‌ చదవలేదు. సీనియర్‌ సిటిజన్‌ను కావడం వల్ల వయసు రీత్యా కొంత తాత్విక చింతన అలవడింది. మృత్యువు భయం ఉండేది కాదు. జీవితం ఒక రైలు ప్రయాణం, దిగాల్సిన స్టేషన్‌ వస్తే దిగిపోవాల్సిందే కదా. ప్రయాణం మధ్యలో కలిసిన వారు భార్య పిల్లలు, బంధువులు, మిత్రులు. మనం పుట్టినప్పుడే భగవంతుడు గమ్య స్థానం టికెట్‌ మన చేతిలో పెట్టి పంపిస్తాడు. అందుకేనేమో చనిపోతానన్న భయం అస్సలు కలగలేదు.


ఒంటరి తనం నుంచి...

ఒంటరితనం వీడి ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాను. వైద్యులు పదిరోజులు ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పి మందులు ఇచ్చారు. భార్య శారద, పిల్లలు ఆప్యాయంగా చూసుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలే మనలో జీవితేఛ్ఛను ఇనుమడింపజేస్తాయి. పోషకాహారం ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేసింది. కాలక్షేపానికి పాత పాటలు వింటూ, నచ్చిన సినిమాలు చూస్తూ స్వాంతన పొందాను. జరిగిన దానికి మధన పడడం మాని, ఇష్టమైన పనులు కొనసాగించడం కూడా ఆరోగ్యానికి ఉపయోగపడింది. కరోనా సంబంధిత వార్తలు అతిగా చూడలేదు. చూసిన వాటికి అతిగా స్పందించలేదు. రోజూ రెండుసార్లు టెంపరేచర్‌ చూసి, ఆక్సీమీటర్‌ మెజర్‌మెంట్స్‌ ఓ డైరీలో రాశాను. పాత మిత్రులతో, బంధువులతో మనసు విప్పి మాట్లాడాను. వారందరూ ధైర్య వచనాలు పలికేవారు. రెండు వారాల తర్వాత పరీక్షలో నెగెటివ్‌ రావడంతో హమ్మయ్యా అంటూ నిట్టూర్చాను. అనంతరం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి ప్రణమిల్లడం తప్పా మరేమీ చేయలేని అల్పజీవిని. ఇదే పెద్ద పాఠం మన  జీవిత దృక్పథాన్ని మార్చుకోవడానికి. తలచేది జరగదు... జరిగేది తెలియదు.

Updated Date - 2021-05-17T17:23:40+05:30 IST