‘ఢిల్లీ’ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-04-02T09:17:41+05:30 IST

విశాఖపట్నాన్ని ఇప్పుడు ‘ఢిల్లీ కనెక్షన్‌’ టెన్షన్‌ పెడుతోంది.

‘ఢిల్లీ’ టెన్షన్‌

ఢిల్లీ వెళ్లి వచ్చిన ఐదుగురికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారుల ఆందోళన

ఢిల్లీ వెళ్లి వచ్చిన 14 మందితోపాటు వారితో సన్నిహితంగా మెలిగిన మరో 51 మంది ఆసుపత్రికి తరలింపు

వీరిలో కొందరికి నెగెటివ్‌గా నిర్ధారణ 

మరికొంతమంది రిపోర్టులు రావలసి ఉందని వైద్యుల వెల్లడి


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) : విశాఖపట్నాన్ని ఇప్పుడు ‘ఢిల్లీ కనెక్షన్‌’ టెన్షన్‌ పెడుతోంది. ఈనెల మొదటి వారంలో దక్షిణ ఢిల్లీలో నిర్వహించిన మత సమావేశంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 14 మంది పాల్గొనగా, అందులో ఐదుగురు కరోనా వైరస్‌ బారినపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో ఐదు కేసులు నమోదుకావడం, అవన్నీ ఢిల్లీ సమావేశంతో ముడిపడి వున్నవి కావడంతో అధికార యంత్రాంగంతోపాటు జిల్లా ప్రజల్లోను ఆందోళన నెలకొంది. 


ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి హాజరైన 14 మందిని, వారితో సన్నిహితంగా  వున్న మరో 21 మందిని అధికారులు మూడు రోజుల కిందట గుర్తించి నగరంలోని ఛాతీ, అ ంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. అప్పటికప్పుడు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. వీరిలో నలుగురికి వైరస్‌ సోకినట్టు మంగళవారం రాత్రి ప్రకటించారు. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్టు బుధవారం ఉదయం తెలియజేశారు. దీంతో జిల్లాలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 11 చేరింది. ఇదిలావుంటే, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల కుటుంబసభ్యులు, గత పది రోజుల నుంచి వారితో సన్నిహితంగా మెలిగిన మరో 30 మందిని అధికారులు బుధవారం ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. వీరి వద్ద నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిసింది. 


రావాల్సిన రిపోర్టులు

ఢిల్లీ నుంచి వచ్చిన 14 మంది, వారితో సన్నిహితంగా మెలిగిన మరో 51 మంది...మొత్తం 65 మంది నుంచి అధికారులు నమూనాలు పరీక్షలకు పంపించారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, కొంతమందికి నెగెటివ్‌ వచ్చినట్టు తెలిసింది. అయితే, నెగిటివ్‌ ఎంతమందికి వచ్చింది?, ఇంకా ఎంతమంది అనుమానిత వ్యక్తుల ఫలితాలు రావాల్సి వుందన్నది తెలియాల్సి ఉంది. 


పదకొండుకు చేరిన కేసుల సంఖ్య

బుధవారం నమోదైన కేసుతో కలిపి జిల్లాలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అయితే వీరిలో వైరస్‌ బారినపడిన మొదటి వ్యక్తిని మంగళవారం అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం పది మంది ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ బారినపడినట్టు బుధవారం నిర్ధారించిన వ్యక్తి తాటిచెట్లపాలెం ప్రాంత వాసి (54)గా తెలిసింది. ఆయన కూడా ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొని వచ్చారు. 

Updated Date - 2020-04-02T09:17:41+05:30 IST