కరోనా భయం..వీధులన్నీ మూసివేత

ABN , First Publish Date - 2020-04-04T12:13:13+05:30 IST

కరోనా భయం..వీధులన్నీ మూసివేత

కరోనా భయం..వీధులన్నీ మూసివేత

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : చెన్నై పుదుపేటలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అక్కడి వీధులన్నింటిని కార్పొరేషన్‌ అధికారులు మూసివేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతుండటంతో 144 నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుదుపేటలో ఐదుగురికి కరోనా వైరస్‌ సోకడంతో అధికారులు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలోని అన్ని వీథులను మూసివేశారు. పోలీసులు పుదుపేటకు వెళ్ళే అన్ని మార్గాలను మూసి  బారికేడ్లను పెట్టి ప్రజలను పుదుపేటలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు.


మేలో ప్లస్‌ టూ పరీక్షా ఫలితాలు...

కరోనా తాకిడి కారణంగా సమాధాన పత్రాల మూల్యాంకనం నిలిచిపోవడంతో ప్లస్‌టు పరీక్షా ఫలితాలు మేలో వెలువడతుతాయని అధికారులు ప్రకటించారు. రాష్ట్రమంతటా ప్లస్‌ టూ పరీక్షలు మార్చి రెండున ప్రారంభమై 24న ముగిశాయి.  ఈ పరీక్షలు ముగిసేసమయంలోనే దేశమంతటా కరోనా వైరస్‌ తాకిడి ప్రారంభమైంది. ఈ పరిస్థితులలో మార్చి 31 న ప్రారంభం కావలసిన మూల్యాంకనం వాయిదా పడింది.  దీంతో ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ నెల 24 ప్లస్‌టు పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులో అన్ని పరిస్థితులు అనుకూలించి మూల్యాంకనం పనులు ప్రారంభమైతే మే నెలలోగా ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


సొంతూళ్ళకు వెళ్లాలంటే కలెక్టర్‌ అనుమతి అవసరం...

రాష్ట్రంలో 144 నిషేధాజ్ఞలు అమలులో ఉండటంతో వివాహాలు, అంత్యక్రియలు, రక్త సంబంధీకుల అనారోగ్య పరిస్థితులు తదితర కారణాల వల్ల నగరవాసులు బయట ఊళ్ళకు వెళ్లాలంటే ఇకపై ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు  తహసీల్దార్లు, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ కమిషనర్లు అనుమతి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో వివాహాది శుభ, అశుభ కార్యాలయాలకు అత్యవసరంగా వాహనాల్లో వెళ్ళదలచినవారికి జిల్లా కలెక్టర్లు మాత్రమే అనుమతులివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. 

Updated Date - 2020-04-04T12:13:13+05:30 IST