సెల్యూట్‌

ABN , First Publish Date - 2020-04-05T10:12:57+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాకు రాకుండా అడ్డుకోవడంలో పోలీసుల పాత్ర కీలకం. ఒకవైపు వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావడంతో పాటు 144 సెక్షన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

సెల్యూట్‌

నిరంతర విధుల్లో పోలీసులు

జిల్లాలో పటిష్టంగా 144 సెక్షన్‌ అమలు 

క్షణం తీరికలేకుండా గడుపుతున్న అధికారులు

అన్నార్తులకు అండగా సేవలు


కరోనా వైరస్‌ జిల్లాకు రాకుండా అడ్డుకోవడంలో పోలీసుల పాత్ర కీలకం. ఒకవైపు వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావడంతో పాటు 144 సెక్షన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అన్నార్తులకు అండగా నిలుస్తున్నారు. ఆపదలో ఎవరున్నా వారిని క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా కర్తవ్యంగా భావిస్తూ స్ఫూర్తిదాయక సేవలు అందిస్తున్నారు. 


విజయనగరం క్రైమ్‌/ సాలూరు, ఏప్రిల్‌ 4:

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌పై ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు వారితో గుంజీలు తీయించడం.. ప్లకార్డులు చేత పట్టించడం.. కాసేపు ఎండలో నిల్చోబెట్టడం లాంటి చిన్న చిన్న శిక్షలు విధిస్తూ వాహనదారులు మళ్లీ మళ్లీ నిబంధనలు అతిక్రమించకుండా చూస్తున్నారు. వీలైనంత వరకు సమన్వయంతో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిలకు మాత్రమే శిక్షలు విధిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు రోడ్డుపైకి వచ్చే వాహనదారులకు దండాలు పెడుతూ దయచేసి ఇంటిని వీడకండి అని కోరుతున్నారు. కొందరు పోలీసులు కుటుంబాలకు దూరంగా విధుల్లో ఉంటున్నారు.


ప్రతి ఒక్కరూ భార్యాపిల్లలతో ఇంటి పట్టునే ఉండండి అని చెప్పే పోలీసులు తాము మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో కొన్ని చోట్ల భోజనం, తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. రాష్ట్రాలను, జిల్లాలను కలవర పెడుతోంది. ఈ తరుణంలో ఆ మహమ్మారి జిల్లాను తాకకుండా చూడడంలో వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శానిటేషన్‌ విభాగాలతో పాటు పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. 


అందరూ రోడ్డుపైనే...

జనతా కర్ఫ్యూ నాటి నుంచి పోలీస్‌ శాఖలోని పైస్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ  రోడ్లపైనే ఉంటున్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారెంటైన్‌ సెంటర్లకు తరలించటంతో పాటు హోం క్వారంటైన్‌లో ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా కట్టడికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తరచూ ప్రత్యేక డ్రిల్‌ నిర్వహిస్తున్నారు.


జిల్లాలో ఎస్పీ బి.రాజకుమారితో పాటు ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, సీఐ, ఆర్‌ఐలు 24 మంది, రిజర్వు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు 96, ఏఎస్‌ఐ, హెచ్‌సీలు 526, పోలీస్‌ కానిస్టేబులు 1200, హోంగార్డులు 450, ఎస్టీఎఫ్‌ 300, ఏసీబీ, సీఐడీ సిబ్బంది కలిపి 200 మంది నిరంతరం విధుల్లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలెవరూ రహదార్లపై తిరగకుండా కంట్రోల్‌ చేస్తున్నారు. ఎస్పీ నిత్యం సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. దిగువ స్థాయి సిబ్బందికి దశ, దిశను నిర్దేశిస్తున్నారు.


సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టి

కరోనాపై సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపించకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్ల నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  కొత్తవారిని గ్రామాలు, పట్టణాల్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. వలస జీవులు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన  క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి చేయూతనిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-04-05T10:12:57+05:30 IST