నలుగురు వైద్యసిబ్బందికి వైరస్‌

ABN , First Publish Date - 2020-04-09T09:03:15+05:30 IST

నలుగురు వైద్యసిబ్బందికి వైరస్‌

నలుగురు వైద్యసిబ్బందికి వైరస్‌

అనంతలో నమోదు.. ఒక్కరోజులోనే 34 కేసులు

ఆస్పత్రుల్లో కోలుకుంటున్నవారు 348 మంది 

గుంటూరులో 9, అనంతలో 7, కృష్ణాలో 6 

నెల్లూరులో 5, చిత్తూరు, ప్రకాశంలలో 3 చొప్పున

కర్నూలులో ఒక పాజిటివ్‌తో 75కు చేరిన కేసులు

రాష్ట్రంలో ఐదుకు చేరిన కరోనా మృతులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా ఉధృతి ఊపందుకుంది. బుధవారం ఒక్కరోజే 34 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కేసులు నమోదు కావడం వైరస్‌ వ్యాప్తి తీవ్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో మొత్తం కోలుకుంటున్నవారి సంఖ్య 348కి చేరింది. తాజాగా గుంటూరులో 9, అనంతపురం జిల్లాలో 7, కృష్ణాజిల్లాలో 6, నెల్లూరులో 5, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మూడు చొప్పున, కర్నూలు జిల్లాలో  ఒక కరోనా కేసు నమోదయ్యాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌, హౌస్‌సర్జన్‌, ఇద్దరు స్టాఫ్‌నర్సులకు కరోనా సోకింది. హిందూపురం, కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన 45 మంది మార్చిలో మక్కాకు వెళ్లి వచ్చారు. వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. వీరిలో ఆరుగురికి లక్షణాలు బయటపడటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరు చనిపోయారు. ఆయనకు వైద్యమందించిన డాక్టర్‌, హౌస్‌సర్జన్‌, ఇద్దరు స్టాఫ్‌నర్సులకు పాజిటివ్‌ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మక్కాకు వెళ్లొచ్చిన వారితో సంబంధాలున్న ఇద్దరు హిందూపురం వాసులకు, కళ్యాణదుర్గానికి చెందిన మరో వృద్ధుడికీ పాజిటివ్‌ వచ్చింది. 


అనంతలో వృద్ధుడి మృతి

కరోనా లక్షణాలతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన వృద్ధుడు(70) వారం క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. ఆయన కరోనా పాజిటివ్‌తో చనిపోయినట్లు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. 

కాగా, గుంటూరు జిల్లాలో మరో 9మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వలస వచ్చి గుంటూరులో నివసిస్తున్న ఓ కూలీకి కూడా వైరస్‌ సోకింది. కృష్ణాజిల్లా విజయవాడలో మరో 6పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో మరో ఐదుగురికి కరోనా సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చిత్తూరు జిల్లా నగరిలో వైరస్‌ బారిన పడ్డారు. ఇక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి వైరస్‌ సోకగా, వైద్య పరీక్షల్లో అతడి కుమారుడి(29)కి కూడా పాజిటివ్‌ వచ్చింది. ప్రకాశం జిల్లాలో మరో 3 కేసులు నమోదయ్యాయి. ఒంగోలుకు చెందిన ఓ వృద్ధుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కరోనా బారినపడ్డాడు. ఇప్పుడు అతడి తమ్ముడు, తమ్ముడి భార్య, వారి కోడలికి కరోనా ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఈ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 75కు చేరుకుంది. 


విశాఖలో ముగ్గురు డిశ్చార్జి

విశాఖ జిల్లా గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కోలుకున్నారు. వీరికి రెండుసార్లు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసిన అధికారులు నెగెటివ్‌ రావడంతో బుధవారం డిశ్చార్జ్‌ చేశారు. 

Updated Date - 2020-04-09T09:03:15+05:30 IST