కలసి ఉంటే కలదు కష్టం!

ABN , First Publish Date - 2020-04-05T10:20:43+05:30 IST

నిత్యావసర కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా.. కొంతమంది ప్రజలు గుంపులుగా ఎగబడుతున్నారు.

కలసి ఉంటే కలదు కష్టం!

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రజలు, నేతలు

అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకోని వైనం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): నిత్యావసర కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా.. కొంతమంది ప్రజలు గుంపులుగా ఎగబడుతున్నారు. 


లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న కొంతమంది దాతలు..  కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 


ప్రభుత్వ పథకాలను పేదలకు పంపిణీ చేయడంలో కొంతమంది అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధి చూసుకుంటున్నారు. వలంటీర్ల ద్వారా నగదు, పింఛన్‌, బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. నేతలే జోక్యం చేసుకుని వీటిని అందిస్తూ గ్రూపు ఫొటోలు దిగుతున్నారు. దీనికోసం అందరూ ఒకేచోట గుమిగూడుతున్నారు. 


..ఇలా జిల్లాలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా.. సిక్కోలులో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పాజిటివ్‌ రాకపోవడం మంచి పరిణామమే. కానీ.. లాక్‌డౌన్‌ వేళ.. ప్రజలంతా ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తే... అందరూ గుంపులుగా ఒకచోట కలిసి ఉంటే... ప్రమాద ఘంటికలు తప్పవని వైద్య నిపుణులు... అధికారులు హెచ్చరిస్తున్నారు.  



కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని అధికారులు... వైద్యులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరికి చెవికెక్కడం లేదు. గుంపులుగా ఉండొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది జనం వినడం లేదు. అదృష్టవశాత్తూ జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ జిల్లాలో కొందరు ఈ హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం వేళల్లో ఇంటికొకరు చొప్పున మార్కెట్‌కు వెళ్లి.. భౌతిక దూరం పాటించాలనే అధికారుల సూచనలు పక్కన పెడుతున్నారు.


వాస్తవానికి కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఒకరు తాకిన వస్తువులు మరొకరు తాకినా... వ్యక్తుల మధ్య కనీసం మీటరు మేర భౌతిక దూరం పాటించకపోయినా ఈ వైరస్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ చాలామంది ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. రైతుబజార్లు, కిరాణా దుకాణాలు, చేపలమార్కెట్‌లలో కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. పోలీసులు కట్టడి చేసేందుకు యత్నిస్తే... కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవద్దా.. అని కొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. 


సేవలు సరే.. దూరం ఎక్కడ..?

జిల్లాలో కొంతమంది స్వచ్ఛంద సేవల పేరుతో పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంలో సేవా కార్యక్రమాల ద్వారా పేదలను ఆదుకోవడం మంచిదే. కానీ చాలా మంది సేవకులు సైతం భౌతిక దూరాన్ని పాటించపోవడం విమర్శలకు తావిస్తోంది. కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో భౌతికదూరం పాటించడం అవసరమనే విషయాన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవకులు గుర్తించాల్సి ఉంది.


పాలకుల తీరూ అంతే...

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తోంది. జిల్లాలో 38 మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 వంతున నగదు పంపిణీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వలంటీర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ... లబ్ధిదారునికి స్వయంగా వీటిని అందజేయాలి. కానీ... క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి లేదు. కొందరు నాయకులు విపత్తు సహాయక కార్యక్రమాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన బియ్యం, పింఛను, ఆర్థిక సాయం నగదును.. ఇద్దరు ముగ్గురు నాయకులు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తేనే.. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని ప్రభుత్వం మొత్తుకుంటున్నా, నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా, ప్రజలంతా పకడ్బందీగా భౌతికదూరం పాటిస్తే.. కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించి ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 


భౌతిక దూరం మేలు చేస్తుంది .. డా.చెంచయ్య, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

మాట్లాడేటప్పుడు... నడిచేటప్పుడు.. సమావేశాల్లో ఉన్నప్పుడు కూడా భౌతిక దూరం పాటించడం మంచిదే. దానివల్ల మేలు కలుగుతుంది. నోటిద్వారా, ముక్కు ద్వారా, మాట్లాడేటప్పుడు వ్యాధిగ్రస్తుడి నుంచి క్రిములు బయటకు వచ్చే అవకాశముంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఇటువంటి వారి దగ్గర ఉంటే.. వారు కూడా వ్యాధి బారిన పడే అవకాశముంది. ప్రపంచాన్ని కదిపేస్తున్న కరోనా కట్టడికి వీలైనంత వరకు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.

Updated Date - 2020-04-05T10:20:43+05:30 IST