కరోనా ‘వార్‌!’

ABN , First Publish Date - 2020-04-09T08:59:22+05:30 IST

కరోనా ‘వార్‌!’

కరోనా ‘వార్‌!’

కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి

చికిత్సలకు ప్రభుత్వ వైద్యులు దూరం

మొత్తం భారం ‘ప్రైవేటు’ వైద్యులపైనే

ఎస్మా కింద అనేకమందికి నోటీసులు

పీపీఈ, మాస్క్‌లు లేకుండా వైద్యమా?

ససేమిరా అంటున్న ప్రైవేటు డాక్టర్లు

తొలి ప్రాధాన్యం జీజీహెచ్‌కే ఇవ్వాలి

ప్రభుత్వ సిబ్బందికీ విధులు అప్పగించాలి

అప్పుడే మేమూ సేవలు అందిస్తాం

కాదంటే అరెస్టులకూ సిద్ధమేనని తీర్మానం!


(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

కరోనా బాధితులకు చికిత్స అందించడంపై కర్నూలు జిల్లాలో ప్రైవేటు వైద్యులు, ప్రభుత్వానికీ మధ్య పెను వివాదం నడుస్తోంది. వైద్యం చేయకుంటే ‘ఎస్మా’ కింద చర్యలు తప్పవని అధికార యంత్రాంగం సంకేతాలు పంపిస్తుండగా.... ‘అరెస్టులు చేసినా సరే, తగిన రక్షణ వ్యవస్థ లేకుండా చికిత్స అందించేది లేదు’ అని ప్రైవేటు డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. అసలు ఎందుకీ వివాదం! కర్నూలు జిల్లాలో ఎంతో పేరు పొందిన ప్రభుత్వ ఆస్పత్రి, అందులో పెద్దసంఖ్యలో డాక్టర్లు ఉండగా ప్రైవేటు వైద్యులను బతిమలాడటం, బెదిరించడం ఎందుకు? అనే సందేహం వచ్చింది కదూ! అక్కడికే వస్తున్నాం! రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాస్పత్రుల్లో ఒక్క కర్నూలు మినహా మిగిలిన పదింటిని కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చారు. అక్కడ... ప్రభుత్వ వైద్యులు, సిబ్బందే సేవలు అందిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లా మాత్రమే దీనికి మినహాయింపు! 75 కరోనా కేసులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా... ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన విశ్వభారతి మెడికల్‌ కాలేజీ, నంద్యాలలోని శాంతిరామ్‌ మెడికల్‌ కాలేజీలలో కరోనా చికిత్సలు అందిస్తున్నారు. అది కూడా పూర్తిగా ప్రైవేటు వైద్యులు, సిబ్బందితోనే!


జీజీహెచ్‌కు ఏమైంది?

కొవిడ్‌-19 రోగులకు తొలుత ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స అందించాలి. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో... ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ఆరోగ్యశ్రీ వర్తించే ప్రైవేట్‌ ఆస్పత్రులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేని ఆస్పత్రులను వాడుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే సూత్రం అమలవుతోంది. కానీ... కర్నూలులో మాత్రం జీజీహెచ్‌కు పూర్తి మినహాయింపు ఇచ్చారు. 250 ఎకరాల విస్తీర్ణంలో, వెయ్యి పడకల సామర్థ్యం, 400 మందికి పైగా వైద్యులు, 3వేల మంది సిబ్బంది పనిచేస్తున్న కర్నూలు ప్రభుత్వాస్పత్రికి ఎంతో పేరుంది. అయినప్పటికీ... దీనిని కొవిడ్‌ హాస్పిటల్‌గా గుర్తించలేదు. దీనిని వెనుక ఆస్పత్రికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ‘మనకెందుకీ తిప్పలు. కరోనా కేసులొస్తే రాత్రింబవళ్లు పని చేయాలి. పైగా... వైరస్‌ మనకు అంటుకుంటుం దేమో అనే భయం. వాటిని అన్నీ ప్రైవేటుకు పంపిద్దాం’’ అని వారు ఒక ఆలోచనకు వచ్చారు. కలెక్టర్‌ను కలిసి... నగరం నడిబొడ్డున జీజీహెచ్‌లో కరోనా రోగులను ఉంచడం మంచిది కాదని భయపెట్టి, ప్రైవేటు ఆస్పత్రుల ను కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించాలని ఉచిత సలహా పడేశారు. జిల్లా కలెక్టర్‌ ముందూ వెనుకా ఆలోచించకుండా ఈ సలహాను అమలు చేసినట్లు తెలిసింది.


శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని ప్రభుత్వాస్పత్రులు నగరం నడిబొడ్డునే ఉన్నాయి. వాటన్నింటినీ కొవిడ్‌ ఆస్పత్రులుగానే గుర్తించారు. కానీ... ఒక్క కర్నూలులో మాత్రమే నగరం మధ్యలో ఉందనే కారణం చెబుతున్నారు. మరో చిత్రమేమిటంటే... కరోనా చికిత్సల్లో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఒక్కరూ పాల్గొనడంలేదు. కడప జిల్లాలో ఫాతిమా మెడికల్‌ కాలేజీని కొవిడ్‌ ఆస్పత్రిగా గుర్తించినప్పటికీ... రిమ్స్‌కు చెందిన ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కర్నూలు వైద్యులు అదీ చేయట్లేదు. ‘కూల్‌’ గా ఔట్‌ పేషంట్‌ను చూసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులకు ‘కొవిడ్‌’ డ్యూటీలు  వేస్తూ జీజీహెచ్‌ వైద్యుల జోలికి వెళ్లడంలేదు.


ఎంత గొప్ప ప్రణాళిక

కరోనా పాజిటివ్‌ రోగులకు చికి త్స అందించేందుకు రూపొందించుకున్న ప్రణాళికను చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. పాజిటివ్‌లో ‘మైల్డ్‌, మోడరేట్‌’ కేసులకు చికిత్స చేసేందుకు 6 ఆస్పత్రులను గుర్తించారు. అందులో మొదటి ఐదు ప్రైవేటువే. ఆరోది... కర్నూలు ప్రభుత్వాసుపత్రి. ఇక... పరిస్థితి విషమించిన కేసులను ప్రాధాన్య క్రమంలో నెల్లూరు జీజీహెచ్‌కు, తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కాలేజీకి పంపించాలట! పరిస్థితి కిష్టంగా ఉన్న రోగిని కర్నూలు నుంచి వందల కిలోమీటర్లలో ఉన్న ఆస్పత్రులకు పంపించాలని నిర్ణయించడం ప్రాణాలతో చెలగాటమాడటమే! ఇక... ఈ జాబితాలో మూడో ఆప్షన్‌గా నంద్యాలలోని శాంతిరామ్‌ మెడికల్‌ కాలేజీని చేర్చారు. కర్నూలు జీజీహెచ్‌ మాత్రం ఎక్కడా లేదు.


ఎవరైతే ఏమిటి?

చికిత్స ఎక్కడైనా జరగొచ్చు! ఎవరైనా చేయొచ్చు! రోగులకు ఉపశమనం లభించడమే ముఖ్యం కదా.. అని అనుకోవచ్చు! జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్న ఈ కీలక సమయంలో... తమపైనే మొత్తం భారాన్ని మోపడంపై ప్రైవేటు వైద్యులు మండిపడుతున్నారు. ‘‘ఎన్‌-95 మాస్కులు, పీపీఈలు ఇవ్వకుండానే కరోనా రోగులకు చికిత్స చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేటు వైద్యుల ఎంపికలోనూ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా చికిత్సతో ఏమాత్రం సంబంధంలేని కార్డియాలజిస్టులు, ఆర్థోపెడీషియన్లు, సైకాలజిస్టులకు కూడా కబురుపెట్టారు. మరీ దారుణమేమిటంటే... ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన లేడీ డాక్టర్లను కూడా కరోనా చికిత్సలకోసం రావాలని ఆదేశించారు’’ అని ఒక వైద్యుడు తెలిపారు. రాకపోతే ఎస్మా కింద చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు పంపిస్తోంది. దీనిపై ప్రైవేటు వైద్యులు కస్సుమంటున్నారు. ‘‘కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మేమూ సిద్ధం. కానీ, చికిత్సల్లో  కర్నూలు జీజీహెచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందీ ఈ విధుల్లోకి రావాలి. ఆ తర్వాతే మాకు విధులు అప్పగించాలి. ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈలు ఇవ్వాలి. అలాగైతేనే రోగులకు చికిత్స అందిస్తాం. లేకపోతే... లేదు. కావాలంటే అరెస్టు కూడా చేసుకోవచ్చు’’ అని ప్రైవేటు వైద్యులంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పని భారం, రిస్క్‌ తప్పించుకునేందుకే జీజీహెచ్‌కు చెందిన ఇద్దరు అధికారులు కరోనా కేసులను ‘ప్రైవేటు’కు అప్పగించేలా కుట్ర పన్నారని ప్రైవేటు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. 


సిటీ మధ్యలో మంచిది కాదని..

ప్రభుత్వాసుపత్రికి వచ్చే ఓపీలలో ఈ మధ్య కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా ఉన్నాయి.  వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచాలి. అలాగే కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్ని నగరం నడి మధ్యలో ఉంచడం కూడా సరైన పని కాదని నంద్యాల శాంతిరామ్‌ హా స్పిటల్‌, విశ్వభారతి మెడికల్‌ కాలేజీతోపాటు నగరంలోని ఓ మూడు ప్రైవేట్‌ ఆసుపత్రులను కొవిడ్‌ ఆస్పత్రులుగా నిర్ధారించాం. అత్యవసరమనుకుంటే చివరి ప్రాధాన్యత కింద కర్నూలు జీజీహెచ్‌లోనూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులను జాయిన్‌ చేసుకుంటాం.

- డాక్టర్‌ రామ్‌ప్రసాద్‌, కర్నూలు జీజీహెచ్‌ 

Updated Date - 2020-04-09T08:59:22+05:30 IST