రోడ్డుపై కరోనా వైరస్‌ కారు

ABN , First Publish Date - 2020-04-09T09:37:56+05:30 IST

ప్రజల్లో అవగాహన కల్పించే దిశలో వినూత్నమైన కార్లు ఆవిష్కరించే సుధా కార్స్‌ కంపెనీ మరో కారును పరిచయం చేసింది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన

రోడ్డుపై కరోనా వైరస్‌ కారు

సుధా కార్స్‌ నుంచి మరో ఆవిష్కృతం 

లాంఛనంగా ప్రారంభించిన యజమాని సుధాకర్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో అవగాహన కల్పించే దిశలో వినూత్నమైన కార్లు ఆవిష్కరించే సుధా కార్స్‌ కంపెనీ మరో కారును పరిచయం చేసింది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధం చేసిన కరోనా వైరస్‌ కారును బుధవారం రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఈ మేరకు బహదూర్‌పురాలో ఉన్న సుధా కార్స్‌ కంపెనీలో తన కారును ఆవిష్కరించిన కంపెనీ యజమాని సుధాకర్‌ అవగాహనతోనే కరోనాను తరిమేద్దామనే ఉద్దేశ్యంతో కారును తయారు చేసినట్టు వివరించారు. నగర రోడ్లపై సంచరిస్తూ ప్రజలను లాక్‌డౌన్‌ పాటించే విధంగా చైతన్య పరచడంతో పాటు కరోనా నష్టాలు.. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పించాలనే ధ్యేయంతోనే సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.


ప్రజలు బయటకు రాకుండా ఉండటం.. క్వారంటైన్‌ పాటించడంపై అవగాహన కల్పించనున్నారు. 100 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బుల్లి కారుకు ఆరు చక్రాలున్నాయి. 40కి.మీ (ప్రతి గంట) వేగంతో నడిచే కారును తయారు చేయడానికి ముగ్గురు ఇంజనీర్లు 10 రోజుల పాటు రేయింబవళ్లు కృషి చేసి సిద్ధం చేశారని సుధాకర్‌ అన్నారు. ఫైబర్‌ బాడీతో సిద్ధంగా ఉన్న ఈ కారు లోపల ఒక్కరే కూర్చునే వీలుంటుంది. నగరంలో ప్రతి వీధిని ఈ కారు సందర్శిస్తూ ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. 


40 ఏళ్ల నుంచి

వినూత్న కార్ల తయారీకి చిన్నప్పటి నుంచే ఆసక్తి పెరిగిందని... 15ఏళ్ల ప్రాయంలోనే (40ఏళ్ల క్రితం) తొలిసారి ఓ వినూత్న కారు ట్యూన్‌ బగ్గీ ఆవిష్కరించి తన ఆలోచనలకు ప్రాణం పోశానని సుధాకర్‌ అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక సందర్భాలు.. ప్రజలను చైతన్య పరచడం లాంటి అవకాశాలకు అనుగుణంగా ప్రత్యేక కార్లు తయారుచేసి అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పటి వరకు 55 డిజైన్ల కార్లను, బైక్‌లను రూపొందించినట్టు సుధా కార్స్‌ కంపెనీ యజమాని సుధాకర్‌ తెలిపారు.


వాటిలో పక్షులను బంధించకుండా ‘కేజ్‌ కార్‌’, పొగ తాగడాన్ని నిలవరించడానికి ‘సిగరెట్‌ బైక్‌’, ఎయిడ్స్‌పై అవగాహనకు ‘కండోమ్‌ బైక్‌’, భద్రత కోసం ‘హెల్మెట్‌ కార్‌’లను తయారు చేసినట్లు వివరించారు. అదే విధంగా కరోనాను తరిమి కొట్టడానికి కరోనా వైరస్‌ కారును రూపొందించారు. సుధాకార్స్‌ కంపెనీలో కార్యాలయం, ఇతర అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రతి భాగం ఓ వాహన రూపంలోనే ఉండటం సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-04-09T09:37:56+05:30 IST