ఢిల్లీలో తెలు‘గోడు’

ABN , First Publish Date - 2020-04-08T09:36:02+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్న నేపథ్యంలో ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగు విద్యార్థులు 24 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఢిల్లీలో తెలు‘గోడు’

24 రోజులుగా క్వారంటైన్‌లోనే 33 మంది..

నెగెటివ్‌ వచ్చినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం


గుంటూరు, ఏప్రిల్‌ 7: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్న నేపథ్యంలో ఇటలీ  నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగు విద్యార్థులు 24 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. 14 రోజుల క్వారంటైన్‌ పేరిట ఐటీబీపీ క్వార్టర్స్‌లోనే మగ్గుతున్న వారి గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. ఇటలీలో ఉన్నత చదువులకు వెళ్లిన భారత విద్యార్థులు 214 మంది ప్రత్యేక విమానంలో మార్చి 14న ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో 82 మంది తెలుగువారు కాగా 33 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారు. వారిని ఢిల్లీలోనే క్వారంటైన్‌లో ఉంచి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులన్నీ నెగెటివ్‌ వచ్చాయి. అయినప్పటికీ వారిని స్వస్థలాలకు తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు.


ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నా పంజాబ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రత్యేక బస్సుల్లో తమ విద్యార్థులను తరలించాయి. తమను కూడా పంపాలని తెలుగు విద్యార్థులు ఆర్మీ అధికారులను కోరితే. క్లియరెన్స్‌ లెటర్‌ ఇస్తే పంపిస్తామని వారు స్పష్టం చేశారు. ఏపీ భవన్‌ అధికారులను సంప్రదిస్తే స్పందన లేదు. ఈ క్రమంలో వారి బాధలను వివరిస్తూ ఏబీఎన్‌ చానల్‌లో మంగళవారం ప్రత్యేక కఽథనం ప్రసారమైంది. వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. వారందరినీ ప్రత్యేక విమానం.. లేదంటే బస్సుల ద్వారా తరలిస్తామని ప్రకటించింది. ఏపీ మాత్రం స్పందించడం లేదని.. ఈనెల 16 వరకు అక్కడే ఉండాలంటూ ఏపీ భవన్‌ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 


హైదరాబాద్‌లో పెళ్లికి వచ్చి..

ఏఎ్‌సరావునగర్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): బంధువుల ఇంట్లో వివాహానికి హాజరైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కుటుంబాలు ఇరవై రోజులుగా హైదరాబాద్‌లోని ఏఎ్‌సరావు నగర్‌లో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాయి. స్థానిక బృందావన్‌ కాలనీకి చెందిన వి.టి. శ్రీనివాస్‌ కుమారుడి వివాహం మార్చి 21న స్థానికంగా  ఓ ఫంక్షన్‌ హాలులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురానికి చెందిన వి.జె.వి. రమణ, అంతర్వేదికి చెందిన డి.ప్రదీప్‌ కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు 15 మంది ఈ వివాహానికి వచ్చారు.


24న వారు తిరిగి వెళ్లవలసి ఉంది. అయితే మార్చి 22న జనతా కర్ప్యూ, 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. శ్రీనివాస్‌ ఇంట్లో ఇరుక్కొని ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు పంపించాలని రాచకొండ కమిషనరేట్‌లో విన్నవించామని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీలు కాదని వారు చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఏపీలోని 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి బాధలు చెప్పుకొన్నా స్పందన లేదన్నారు.

Updated Date - 2020-04-08T09:36:02+05:30 IST