24 గంటల్లో 4,500 మరణాలు!

ABN , First Publish Date - 2021-01-14T11:31:00+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. మంగళవారం.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4,470 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. అంటే

24 గంటల్లో 4,500 మరణాలు!

ఏకంగా 1.31 లక్షల మంది ఆస్పత్రులపాలు

అమెరికాలో కరోనా వైరస్‌ విలయ తాండవం

ప్రయాణికులకు నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి

బ్రిటన్‌తోపాటు అమెరికాలోనూ తాజా నిబంధన


వాషింగ్టన్‌, లండన్‌, బీజింగ్‌, జనవరి 13: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. మంగళవారం.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4,470 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. అంటే.. కరోనాతో నిమిషానికి ముగ్గురిపైనే చనిపోయారు. కాగా, కరోనా జన్మస్థానమైన చైనా (4,634) మొత్తం మరణాలకు.. అమెరికా తాజా మృతులు దాదాపు దగ్గరగా ఉండటం గమనార్హం. అగ్రరాజ్యంలో వైరస్‌ బారినపడి కొత్తగా 1.31 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. రోగులకు వసారాలు, పీడియాట్రిక్‌ వార్డుల్లోనూ చికిత్స అందించాల్సి వస్తోంది. మరోవైపు విదేశాల నుంచి వచ్చేవారికి ‘కరోనా నెగెటివ్‌’ రిపోర్టును అమెరికా తప్పనిసరి చేసింది. ఈనెల 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. కొత్త స్ట్రెయిన్‌తో అల్లాడుతున్న యూకే సైతం మంగళవారం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. విమానాలు, నౌకలు, రైళ్ల ద్వారా దేశంలోకి వచ్చే ప్రయాణికులకు.. 72 గంటల ముందుగా చేయించుకున్న కొవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్టును కచ్చితం చేసింది. నెగెటివ్‌ అయినప్పటికీ.. బ్రిటన్‌ చేరుకున్న అనంతరం 10 రోజులపాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 500 పౌండ్ల జరిమానాను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. యూకేలో బుధవారం ఒక్కరోజే 1,564 మంది కరోనాతో చనిపోయారు. దీంతో యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 84,767కు చేరింది. అలాగే ఇటీవలి నెలల్లో ఎన్నడూ లేనంతగా చైనాలో కేసులు వంద దాటాయి. బుధవారం నాటికి అక్కడ 115 కేసులు రికార్డయ్యాయి. ఇందులో స్థానిక వ్యాప్తిద్వారా నమోదైనవే 107 ఉండగా.. 90 కేసులు రాజధాని బీజింగ్‌ను ఆనుకుని ఉండే హెబెయ్‌ ప్రావిన్స్‌వే.


బీజింగ్‌లోనూ కొన్ని కేసులు వచ్చాయి. హెబెయ్‌ ప్రావిన్స్‌ ప్రాదేశికత లోనే బీజింగ్‌ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రావిన్స్‌లో కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. వచ్చే నెలలో కొత్త సంవత్సర (లూనార్‌) సెలవులు రానున్న సందర్భంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కాగా కరోనా పుట్టుకపై విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం గురువారం చైనాలో పర్యటించనుంది. పదిమంది సభ్యుల బృందం సింగపూర్‌ నుంచి నేరుగా.. కొవిడ్‌-19 కేంద్ర స్థానమైన వూహాన్‌కు వెళ్లనుంది.

Updated Date - 2021-01-14T11:31:00+05:30 IST