వేగం పెంచిన వైరస్‌

ABN , First Publish Date - 2022-01-14T08:45:38+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 47,884 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,348..

వేగం పెంచిన వైరస్‌

  • రాష్ట్రంలో ఒక్కరోజే 4,348 కేసులు
  • చిత్తూరులో 932 మందికి పాజిటివ్‌
  • శ్రీకాకుళంలో మరో నలుగురికి ఒమైక్రాన్‌  


అమరావతి, తిరుపతి, శ్రీకాకుళం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 47,884 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,348 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో ఇద్దరు మరణించారని వైద్యఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,92,227కి, మరణాల సంఖ్య 14,507కి పెరిగింది. తాజాగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 932 మందికి వైరస్‌ సోకగా.. విశాఖపట్నంలో 823, నెల్లూరులో 395, గుంటూరులో 338, కృష్ణాలో 296, విజయనగరంలో 290, శ్రీకాకుళంలో 259, తూర్పుగోదావరిలో 247, అనంతపురంలో 230 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసులు కూడా రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. గురువారం నాటికి రాష్ట్రంలో 14,204 యాక్టివ్‌ కేసులున్నాయి. ఒకరోజు వ్యవధిలో 261 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 20,63,516కి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,048 యాక్టివ్‌ కేసులుండగా.. ఆ తర్వాత విశాఖలో 2,746 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. 


సిక్కోలులో మరో 4

శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య ఏడుకి చేరింది. బుధవారం ఇక్కడ మూడు కేసులు బయటపడగా.. గురువారం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం మండలంలో ఒకటి, కంచిలి మండలంలో రెండు, వజ్రపుకొత్తూరులో ఒక కేసు బయటపడింది. ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఖతార్‌ నుంచి రాగా... మిగిలిన ముగ్గురు దుబాయి నుంచి వచ్చారు.


కొవిడ్‌పై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

పాల్గొన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వీడియో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితిపై ఆరా తీశారు.  కరోనా విజృంభన నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హోంమంత్రి సుచరిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, వైద్య ఆరోగ్య శాఖ (కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, మేనేజ్‌మెంట్‌ ) ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్‌, ఎపీఎంఎ్‌సఐడీసీ వీసీ అండ్‌ ఎండీ మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-14T08:45:38+05:30 IST