ఆరంభంలో కఠినంగా.. తర్వాత ఉదాసీనంగా!

ABN , First Publish Date - 2021-05-07T10:24:53+05:30 IST

టోర్నీ మధ్యలో కరోనా వైరస్‌ ప్రవేశించి ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా పాజిటివ్‌గా తేలడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.

ఆరంభంలో కఠినంగా.. తర్వాత ఉదాసీనంగా!

న్యూఢిల్లీ: టోర్నీ మధ్యలో కరోనా వైరస్‌ ప్రవేశించి ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా పాజిటివ్‌గా తేలడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అప్పటివరకు క్రికెటర్లు టోర్నీని ఆస్వాదించినా వైరస్‌ చుట్టుముట్టడంతో వారూ తీవ్ర భయాందోళనలకు లోనయ్యారట. మరీ ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లయితే తాము క్షేమంగా స్వదేశం చేరగలమో లేదోననే ఒత్తిడికి గురయ్యారు. టోర్నమెంట్‌లో వైరస్‌ అడుగుపెట్టాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో కొందరు ఆటగాళ్లు వెల్లడించారు. ‘బయోబబుల్‌ విషయంలో ఫ్రాంచైజీలు, బీసీసీఐ ఉత్తమ చర్యలు తీసుకున్నాయి. కానీ యూఏఈలో బబుల్‌ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ఇక్కడ మాత్రం ఓ ఫ్లోర్‌ నుంచి మరో ఫ్లోర్‌కు రాకపోకలు సాగాయి. అంతేకాదు ఒకరి స్విమ్మింగ్‌ పూల్‌ను మరొకరు ఉపయోగించారు.


ప్రాక్టీస్‌ సౌకర్యాలు కూడా చాలా దూరంలో ఉన్నాయి’ అని ఓ క్రికెటర్‌ తెలిపాడు. టోర్నమెంట్‌ ఆరంభంలో బబుల్‌ నిబంధనలను కఠినంగా అమలు చేసినా తర్వాత ఉదాసీనంగా వ్యవహరించారని మరో క్రికెటర్‌ వెల్లడించాడు. బీసీసీఐ రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను ఏ ఒక్క ఆటగాడు కానీ, సహాయ సిబ్బందికానీ ఉల్లంఘించలేదని సన్‌రైజర్స్‌కు చెందిన శ్రీవత్స గోస్వామి చెప్పాడు. భారత్‌లో రోజువారీ కేసులు 4లక్షలకు చేరడం, మృతుల సంఖ్య వేలల్లో ఉండడం, ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులకు బెడ్లు దొరక్కపోవడం, ఆక్సిజన్‌ కొరత..వంటి వార్తలను సోషల్‌మీడియాలో చూసిన విదేశీ క్రికెటర్లు తీవ్ర ఆందోళన చెందారని గోస్వామి తెలిపాడు.  

Updated Date - 2021-05-07T10:24:53+05:30 IST