నాయుడుపేటలో రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2020-04-04T10:28:33+05:30 IST

కరోనా వైరస్‌ నాయుడుపేటను చుట్టేస్తుం ది. మూడు రోజుల్లో ఆరుగురికి పాజిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో వణుకుతున్నారు. క

నాయుడుపేటలో రెడ్‌ అలర్ట్‌

నాయుడుపేట, ఏప్రిల్‌ 3: కరోనా వైరస్‌ నాయుడుపేటను చుట్టేస్తుం ది. మూడు రోజుల్లో ఆరుగురికి పాజిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో వణుకుతున్నారు. కరోనా బాధితులో ఐదుగురు ఢిల్లీలో జరిగిన జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు కాగా ఒకరు ఓ బాధితుడి భార్య. దీంతో అప్రమత్తమైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పోలీసు, రెవెన్యూ అధికారులు నాయుడుపేటలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి ప్రజలెవ్వరూ గడపదాడి బయటకు రావద్దని కోరారు. నాయుడుపేట నుంచి ఢిల్లీలో జరిగిన జమాత్‌కు వెళ్లి వచ్చిన 21 మందిని గుర్తించిన అధికారులు విడతల వారీగా ఐసోలేషన్‌కు తరలించారు. వారిలో మొదటి రోజు ఒకరు, రెండో రోజు ఇద్దరు, మూడో రోజు ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


దీంతో ఈ ఆరుగురి కుటుంబ సభ్యులతో పాటు వీరితో సన్నిహితంగా ఉన్న సుమారు 50 మంది వరకు ఐసోలేషన్‌కు తరలించగా మొదటి రోజు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం గూడూరు డీఎస్పీ భవానీ శ్రీహర్ష, ఆర్డీవో సరోజిని, డివిజనల్‌ పీవో డాక్టర్‌ రమాదేవి, డివిజన్‌లోని అన్నిశాఖల అధికారులతో సమీక్షించారు. కరోనా ఉగ్ర రూపం దాల్సిన నేపథ్యంలో నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ పట్టణాలకు ఆయా మండలాలతో పాటు పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం మండలాల ప్రజలు రావద్దని, ఆమేరకు తహసీల్దార్లు వీఆర్వోలతో గ్రామాల్లో దండోరా వేయించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణాల్లో శనివారం ఒక్క రోజు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటలలోపు పాలు, నిత్యావసర సరుకులు, మందులు, కూరగాయాలు కొనుగోలు చేయాలన్నారు. ఆదివారం నుంచి కేవలం పాలు, నీరు, మందుల దుకాణాలు మాత్రమే అందుబాటులో ఉంచాలని, ఇతర ఏ దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.


అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వవద్దనారు. పట్టణాలు ద్విచక్ర, కార్లు వంటి వాహనాలను నిషేధించాలన్నారు. నియోజకవర్గం నుంచి విదేశాలకు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి సమాచారం సేకరించడంలో విఫలమయ్యారంటూ డివిజనల్‌ పీవో డాక్టర్‌ రమాదేవిని ఉద్దేశించి అన్నారు.  ప్రజలు స్వచ్చందంగా గృహాల్లోనే ఉంటేనే కరోనాను వందశాతం నివారించవచ్చన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య చర్యలకు అవసమైన నిధులక కోసం వెనకాడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారులు, కమిషనర్లు, ఎంపీడీవోలు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T10:28:33+05:30 IST