కరోనా వైరస్.. వైద్య శాస్త్రవేత్తల సలహాలివీ..!

ABN , First Publish Date - 2020-02-09T20:59:30+05:30 IST

‘కరోనా’ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్ చైనా నుంచి మొదలైంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గు, జలుబు, జ్వరం...

కరోనా వైరస్.. వైద్య శాస్త్రవేత్తల సలహాలివీ..!

‘కరోనా’ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్ చైనా నుంచి మొదలైంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గు, జలుబు, జ్వరం కలిగి ఉంటారు కాబట్టి సాధారణ దగ్గు, జలుబు ఉన్నవారిని కూడా అనుమానించాల్సి వస్తోంది. ఈ వైరస్ వ్యాపించకుండా చైనా ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది, కానీ పూర్తి స్థాయి ఫలితాలు కనపడడం లేదు. దీనికి కారణం ఈ వైరస్ గురించి పూర్తి సమాచారం లేకపోవడమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అందువల్ల ఇలాంటి వైరస్ వచ్చినప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలను వారు వివరించారు.


ఎలా వ్యాపిస్తోంది?

కరోనా వైరస్ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా(కరచాలనం, ఆలింగనం, శృంగారం) వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కరోనా వ్యాధి ఉన్నవారు పీల్చి వదిలిన గాలి ద్వారా, లేదా వారి తుమ్ము ద్వారా గాలిలో ఉండే క్రిముల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.


వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కరోనా వైరస్‌కు పూర్తి స్థాయిలో విరుగుడు కనుగొనేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందని, దీని ఖర్చు  దాదాపు బిలియన్ డాలర్లు అవుతుందనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఈ విరుగుడు మందు ద్వారా భవిష్యత్తులో ఇటువంటి వైరస్‌లు రాకుండా నివారించగలమని వారంటున్నారు. అప్పటివరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వ్యాపించకుండా నివారించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. కరోనాతో బాధపడే వారిని మిగతా రోగులకు దూరంగా, విడిగా ఉంచాలి. కరోనా వ్యాధిబారిన పడినవారిని చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, సమాజ సేవ చేసే వారు ఈ వ్యాధి బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ బాధితుల స్పుటమ్(ఎంగిలి) పరీక్ష, బ్రాంకోస్కోపీ ప్రత్యేక గదుల్లేనే చేయాలి. వ్యాధిగ్రస్తులకు సమీపంగా ఉండే వ్యక్తులు(డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు) క్రమం తప్పకుండా చేతులను మంచి సానిటైజర్‌తో శుభ్రపరుస్తూ ఉండాలి. ఆస్పత్రులు, ఇంటి వద్ద గాలిని పరిశుద్ధి చేసే యంత్రాల(ఎయిర్ ప్యూరిఫయింగ్ డివైస్)ను ఉపయోగించాలి. ప్రభుత్వం రీయూజెబుల్ మాస్కులు అందుబాటులోకి తేవాలి.

Updated Date - 2020-02-09T20:59:30+05:30 IST