ఇంటింటా భయంభయం

ABN , First Publish Date - 2020-07-05T10:23:40+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిం వేగంగా పెరుగుతోంది. ప్రారంభంలో రాష్ట్రంలోనే రెండో కేసుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇంటింటా భయంభయం

ఉమ్మడి జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

జలుబొచ్చినా హడలిపోతున్న జనం


ఖమ్మం, జూలై 4(ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిం వేగంగా పెరుగుతోంది. ప్రారంభంలో రాష్ట్రంలోనే రెండో కేసుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో విదేశాలనుంచి వచ్చిన విద్యార్థిని నమోదుకావడంతో జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడింది. ఆ తరువాత కట్టుదిట్టమైన చర్యలతో మహమ్మారిని అదుపు చేసినా లాక్‌డౌన్‌ ఆంఽక్షలు సడలించిన తరువాత గత నెలరోజులుగా వైరస్‌ వేగం పెంచింది. ఇరు జిల్లాల్లో రోజురోజుకు కేసులు పదులసంఖ్యలో పెరుగుతుండడంతో ఇప్పుడు ప్రతి ఇంటినీ కరోనా భయం పట్టుకుంది. పిల్లలు, పెద్దలు ఎవరు దగ్గినా, జలుబు వచ్చినా జ్వరం భారిన పడ్డా అదరిలో కరోనా అనుమానం తలెత్తుతుంది. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట కరోనా కేసులు నమోదయ్యాయన్న సమాచారం వస్తుండడంతో అందరిలోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే ఆటలు, చదువులు లేకుండా విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గృహిణులు ఇల్లు దాటని పరిస్థితి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, రోజువారి కార్మికులు మాత్రమే పనులకు వెళుతున్నారు.


బయటకు వెళుతున్నవారు మాస్కులు ధరిస్తున్నా ఇప్పుడు హైదరాబాదుతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చినవారి ద్వారా ఆసుపత్రులనుంచి, శుభకార్యాలకు హాజరైనవారికి కరోనా సోకి వారి ద్వారా గ్రామాలకు, పట్టణాలకు కరోనా చేరుకుంది. ఇప్పుడు కాలనీల్లో, ఆయా బజార్లలోనూ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరిలో భయాందోళనలో మొదలైంది. ఖమ్మంజిల్లా పరిధిలో ఇప్పటికే వందకు పైగా పాజిటివ్‌ కేసులు దాటిపోయాయి. శనివారం నాటికి 103 కేసులు నమోదుకాగా 51మందికోలుకోగా 44మంది చికిత్సలో ఉన్నారు. ఆరుగురు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఐదుగురు కోలుకోగా 50మంది చికిత్సలో ఉన్నారు. ఒకరు మరణించారు.


ఇప్పుడు కరోనా వ్యాప్తి వేరేవేరు దిశల్లో సాగుతుంది. షాపులు, ఆసుపత్రులు, చికెన్‌, మటన్‌, ఫిష్‌ షాపులు, రాజకీయ పార్టీల కార్యక్రమాలు, భౌతికదూరం పాటించకుండా గుమికూడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారితో కరోనా వ్యాప్తి చెందుతోంది. దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి వ్యక్తిగత, ఆరోగ్య అవసరాల నిమిత్తం హైదరాబాదు విజయవాడ వెళ్లి వస్తున్న వారి వెంట వచ్చి పడుతుంది. ఇలా కరోనా కేసులు రోజురోజుకు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఇంటిలో కరోనా భయం పట్టుకుంది. ఇంటిపక్కన ఉన్నవారి ఆరోగ్య పరిస్థతి ఏంటో తెలియని పరిస్థితిలో కొందరు కరోనా పాజిటివ్‌ లక్షణాలు వచ్చినా ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంటివద్దను సొంత వైద్యాలు సాగిస్తున్నారు. వాట్సాప్‌, యూటూబ్‌లో కరోనా నివారణ చర్యలు తెలుసుకుంటూ ఆరోగ్య పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఎటునుంచి ఎవరినుంచి వచ్చి పడుతుందోనన్న భయం అందరిలోను కనిపిస్తోంది.

Updated Date - 2020-07-05T10:23:40+05:30 IST