బాలు పాటకు పట్టాభిషేకం

ABN , First Publish Date - 2020-09-06T05:30:00+05:30 IST

బాలసుబ్రహ్మణ్యం పాటలంటే ఆయనకు పిచ్చి. ఆ అభిమానంతోనే బాలు పాడిన ప్రతి పాటనూ సేకరించి...

బాలు పాటకు పట్టాభిషేకం

బాలసుబ్రహ్మణ్యం పాటలంటే ఆయనకు పిచ్చి. ఆ అభిమానంతోనే బాలు పాడిన ప్రతి పాటనూ సేకరించి... వాటి రాగాలు క్రోడీకరించి... అక్షరబద్ధం చేస్తున్నారు డాక్టర్‌ ఏనుగు శివరామప్రసాద్‌. రెండు దశాబ్ధాలకు పైగా సాగుతున్న ఈ పరిశోధన వెనక పరిశ్రమ ఇది... 


సంగీతం ప్రపంచ భాష. ఆ భాషను ప్రకటించే అనుభూతి పాట. ఆరో ఏట నుంచే పాట నా జీవన గమనంలో భాగమైపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు దగ్గర రామరాజులంక మాది. నాకు ఐదో ఏడు వచ్చే సరికి అమ్మానాన్నలు దూరమయ్యారు. దాంతో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగాను. ఇంట్లో అమ్మమ్మ త్యాగరాజ కీర్తనలు పాడుతుండేవారు. ప్రముఖ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి మా బంధువు. ఆయనకు ఘంటసాల గారు తెలుసు. ఇలా సంగీతంతో అనుబంధం ఉన్న వాతావరణంలో పెరగడంతో చిన్నప్పటి నుంచే నాకు పాటలపై మక్కువ పెరిగింది. ఎంతగా అంటే... బడికి వెళ్లినప్పుడు తప్పితే, వేరెక్కడికెళ్లినా నా చేతిలో రేడియో ఉండేది. అందులో పాటలు వింటూ, వాటితో కలిపి పాడుతుండేవాడిని. స్కూల్లో, కాలేజీల్లో పాటలు పాడినందుకు ప్రైజ్‌లు కూడా వచ్చాయి. 


ఆ లోటు తీర్చారు... 

అయితే మా చిన్నప్పుడు గాయకుడంటే ఘంటసాల గారే! ‘ఆయన లోటు ఎవరు తీర్చగలరు’ అనుకుంటున్న తరుణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రంగప్రవేశం చేశారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా ఆయన రాగయుక్తంగా ఆలపించేవారు. ‘శంకరాభరణం’ చిత్రం తరువాత ‘ఘంటసాల వారసుడు వచ్చాడని’ అనుకున్నాం. నేను ఆయన వీరాభిమాని అయిపోయా. ఆ స్ఫూర్తితో రేడియోల్లో పాటలు పాడాలని 1980లో డిగ్రీ అవ్వగానే హైదరాబాద్‌కు మకాం మార్చా. అకౌంటెంట్‌గా చిన్న ఉద్యోగం. అది చేసుకొంటుండగా ఆలిండియా రేడియోలో అవకాశం వచ్చింది. అయితే పాడడానికి కాదు... పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా. తరువాత కొన్నేళ్లు ఓ టీవీ ఛానల్‌లో మ్యూజిక్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశాను. అప్పట్లో దూరదర్శన్‌లో వచ్చే ‘చిత్రలహరి, మధుర గీతాల’కు కలిపి దాదాపు 800 పాటలకు వ్యాఖ్యానాలు రాశాను. అలా పాటలతో అనుబంధం పెరిగింది. 


‘రాగాల’ పుస్తకం... 

అదే సమయంలో పాట విని వదిలేయకుండా అది ఏ రాగంలో కంపోజ్‌ చేశారో తెలుసుకోవాలనే తపన ఎక్కువైంది. అడిగితే ఎవరూ చెప్పేవారు కాదు. దాంతో నేనే పరిశోధన మొదలుపెట్టాను. 1931 నుంచి 2015 వరకు వచ్చిన తెలుగు పాటలకు రాగాలను పరిశోధించాను. వాటిల్లో 150 రాగాలను ఎంపిక చేసి... 3 వేల పాటల రాగ లక్షణాలతో 2013లో ‘ఏ గానమో ఇది ఏ రాగమో’ పేరిట ఒక పుస్తకం తీసుకువచ్చాను. నా ఈ చిరు ప్రయత్నాన్ని ‘శాంతా బయోటెక్‌’ వరప్రసాద్‌రెడ్డి ప్రోత్సహించి, అచ్చు వేయించారు. దానికి బాలు ‘ముందు మాట’ రాశారు. ఆయన పుట్టినరోజునాడు దీన్ని విడుదల చేశాం. 


బాలు గీతాలతో సంకలనం... 

ఇక బాలు గారి ప్రతి పాటా నా దగ్గర ఉంటుంది. అంటే ఆడియో రూపంలో కాదు. అక్షరబద్ధమై కాగితాల్లో! ‘మర్యాదరామన్న’ చిత్రం(1967)లో ఆయన పాడిన తొలి పాట నుంచి 2015 వరకు ఆయన పాటల సంకలనాన్ని రూపొందించాను. 4 భాగాలుగా చేసిన ఈ సంకలనాన్ని బాలు గారికే ఇచ్చాను. ఆయన పాటలు ‘చిటపట చినుకులు పడుతున్నట్టే’ మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. వింటున్నంతసేపూ మనతో తాళం వేయిస్తాయి. ఏ సినిమాలో పాటైనా సరే... మధ్యలో నుంచి అడిగినా ఠక్కున పాడేయగలను. ఘంటసాల, బాలు పాటలు లిరిక్స్‌తో సహా గుర్తుంటాయి. దాదాపు ముప్ఫై ఏళ్లుగా బాలు పాటల్లో అంతగా లీనమై... ఆయన గాత్ర మాధుర్యంలో పడి కొట్టుకుపోతున్నాను. 


ఎన్నెన్నో గీతాలు... 

పాట ఒక పక్షి లాంటిది. 1979లో రెక్కలు తెగిన సందర్భంలో ‘శంకరాభరణం’ చిత్రం వచ్చింది. అలా తెలుగు పాటకు మళ్లీ పట్టం కట్టిన గాయకుడు బాలు. నా అంచనా ప్రకారం ఆయన తెలుగులో సుమారు 15 వేల పాటలు పాడి ఉంటారు. తమిళంలో 5వేలు, కన్నడంలో 4 వేలు, ఇతర భాషల్లో మరో 3 వేల గీతాలు ఆలపించారు. సీరియల్స్‌, టైటిల్‌ సాంగ్స్‌ కూడా కలిపితే దాదాపు 30 వేల పాటలు బాలు గాత్రంలో పల్లవులయ్యాయి. 


ప్రతిభ ఉంటే ప్రోత్సహిస్తారు... 

బాలసుబ్రహ్మణ్యం గారిని వివిధ సందర్భాల్లో చాలాసార్లు కలిసే అవకాశం లభించింది. కనిపించినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. పాటల గురించి చర్చిస్తారు. నన్ను ‘పని రాక్షసుడు’ అని అంటుంటారు. అవతలివారిలో ప్రతిభ ఉందంటే భుజం తట్టే సహృదయులు ఆయన. ఒక్కముక్కలో చెప్పాలంటే స్నేహానికి, సహాయానికి, సానుభూతికి చక్కని నిదర్శనం. ఏదైనా కష్టం వస్తే సాయానికి వెనకాడని మనస్తత్వం బాలు గారిది.

హనుమా 


బాలు పాడిన పాటల్లో శివరామప్రసాద్‌ మెచ్చిన ఆణిముత్యాలు...

1. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల: 

(అంతులేని కథ/ 1976) 

2. ఓంకారనాదాను సంధానమౌ గానమే: 

(శంకరాభరణం/1979) 

3. మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు: 

(ఓ పాపా లాలి/ 1990) 

4. తేరే పాయల్‌ మేరే గీత్‌: 

(తేరే పాయల్‌ మేరే గీత్‌/ 1989) 

5. శ్రీ తుంబుర నారద గానామృతం: 

(భైరవద్వీపం/1994) 

6. ఆరు రుతువుల భ్రమణమున్నా: (ఆలాపన/1985)


వై.శివరామప్రసాద్‌, 8096283616

sruthilaya.ysrp@gmail.com


నవ్య ‘దృశ్యం పేజీ’లోని 

ఆసక్తికర కథనాల కోసం 

ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌

https://qrgo.page.link/Zidc5లో చదవండి.

Updated Date - 2020-09-06T05:30:00+05:30 IST