మరోసారి కన్నెర్రజేసిన ట్రంప్..ఈ సారి కూడా..!

ABN , First Publish Date - 2020-05-23T01:09:46+05:30 IST

కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష

మరోసారి కన్నెర్రజేసిన ట్రంప్..ఈ సారి కూడా..!

వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విషయాన్ని తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిచిగన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రామానికి హాజరైన ఆయన.. ఆఫ్రికన్-అమెరికన్ లీడర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఈ మహమ్మారి చైనా నుంచే వచ్చిందన్నారు. కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు విస్తరించకుండా కట్టడి చేయడంలో చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించారు.  కరోనా వైరస్‌ను ఉద్దేశిస్తూ..‘అది చైనా నుంచే వచ్చింది. దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చైనాతో మనం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న కొద్ది రోజుల్లో ఇది సంభవించింది. ఈ విషయాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోవద్దు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే చైనా‌పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నది ట్రంప్ వెల్లడించలేదు. కాగా.. కరోనా నేపథ్యంలో చైనాపై ట్రంప్ గతకొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ అమెరికాను కుదిపేసింది. అమెరికాలో మహమ్మారి విజృంభిస్తుండటంతో అక్కడ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య, నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పేరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 96 వేల మంది మరణించగా.. 16.21లక్షల కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. 


Updated Date - 2020-05-23T01:09:46+05:30 IST