ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బ... కిడ్నీ, లివర్ అమ్ముకునే దుస్థితికి జనం!

ABN , First Publish Date - 2021-08-08T13:36:39+05:30 IST

ఒకవైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు...

ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బ... కిడ్నీ, లివర్ అమ్ముకునే దుస్థితికి జనం!

తిరువనంతపురం: ఒకవైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు తరచూ విధిస్తున్న లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలు... ఇవన్నీ కేరళ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్, పాజిటివిటీ రేటు, డెత్ రేటు... ఇలా అన్నింటిలో దేశంలో కేరళ ప్రథమస్థానంలో ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కొంతమంది చిరు వ్యాపారులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. 


తిరువనంతపురానికి చెందిన ఒక స్ట్రీట్ వెండర్ తన దుకాణం ముందు ఒక బోర్డు పెట్టి, దానిపై ‘నా కిడ్నీ, లివర్ ఆరోగ్యంగానే ఉన్నాయి. నేను వాటిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు. ఇదే తరహాలో ఒక బస్సు ఓనర్ చాలా రోజులుగా రోడ్డు పక్కన నిలిపివుంచిన తన బస్సుపై ఒక నోటీసు అతికించి, దానిపై... ‘దీనిని కోజికోడ్‌లో స్క్రాప్ కింద విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నానని’ రాశారు. ఇటువంటి దృశ్యాలు కేరళలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆర్థిక సమస్యలతో వేర్వేరు ప్రాంతాల్లో30 మంది ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు వెలుగుచూశాయి. ఈ ఘటనలన్నింటికీ కరోనా మహమ్మారి పరిస్థితులే ప్రథాన కారణంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా మళ్లీ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-08-08T13:36:39+05:30 IST