కరోనా గుప్పిట..

ABN , First Publish Date - 2020-03-20T06:22:44+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభణతో భారత కార్పొరేట్‌ రంగం కుదేలవుతోంది. అవ్యవస్థీకృత వ్యాపారాలూ వెలవెలబోతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తితో విమానయానం, పర్యాటకం, ఆతిథ్యం, రవాణా, లోహాలు, ఆటో, టెక్స్‌టైల్‌, ఆభరణాలు, రియల్టీ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

కరోనా గుప్పిట..

అన్ని రంగాల్లోనూ భయాందోళనలు 

ఉద్దీపనల కోసం కార్పొరేట్ల డిమాండ్‌

ఉద్యోగాలకు కరువైన భద్రత 


కరోనా వైరస్‌ విజృంభణతో భారత కార్పొరేట్‌ రంగం కుదేలవుతోంది. అవ్యవస్థీకృత వ్యాపారాలూ వెలవెలబోతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తితో విమానయానం, పర్యాటకం, ఆతిథ్యం, రవాణా, లోహాలు, ఆటో, టెక్స్‌టైల్‌, ఆభరణాలు, రియల్టీ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరాకీ కరువైంది.. ఆదాయం పడిపోయింది. ఫలితంగా పలు కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంక్షోభ పరిణామంలో ఉద్యోగుల భవిష్యత్‌ అనిశ్చితిలో పడింది. ఎయిర్‌లైన్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు సహా తదితర సంస్థలు  వేతనం లేని సెలవులు.. జీతాల్లో కోతలు.. చిట్టచివరి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. ప్రభుత్వ మద్దతు, ఆర్థిక చేయూతతో పాటు నిబంధనల సడలింపులు, మినహాయింపులిస్తే తప్ప కోవిడ్‌ ప్రభావిత రంగ కంపెనీలు మళ్లీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని ఇండస్ట్రీ ప్రతినిధులంటున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి ఊరట కల్పించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం, ఆర్‌బీఐ పరస్పర సహకారంతో ఆర్థిక, ద్రవ్య విధానపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలందుతున్నాయి. 


భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిని వచ్చే త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) చివరినాటికి కట్టడి చేయగలిగితే పరిశ్రమలు తిరిగి కోలుకునేందుకు 6 నుంచి 9 నెలలు పట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. కరోనా ప్రభావంతో భారత పరిశ్రమలు పలు అవాంతరాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిణామంతో దేశ ఆర్థిక వృద్ధి చక్రం పూర్తిగా గాడితప్పవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 


ప్రభుత్వ సాయానికి క్రెడాయ్‌ డిమాండ్‌ 

గడిచిన కొన్ని నెలల్లో దేశంలో గృహ విక్రయాలు గణనీయంగా తగ్గడంతోపాలు చాలావరకు ప్రాజెక్టుల్లో నిర్మాణాలు నిలిచిపోయాయని క్రెడాయ్‌ అంటోంది. ఈ నేపథ్యంలో రియల్టీ కంపెనీల రుణ చెల్లింపులకు 3 నెలల మారటోరియం కల్పించాలని, మార్కెట్లో అదనపు ద్రవ్య లభ్యత కోసం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత ప్రాజెక్టుల పూర్తికి అదనపు గడువు ఇవ్వాలని క్రెడాయ్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇప్పటికే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది. 


ఉద్దీపనలివ్వండి: ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ

కరోనా భయాలతో హోటళ్లు, రెస్టారెంట్లకు కస్టమర్లు భారీగా తగ్గారు. దాంతో ఆతిథ్య సేవల వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. నష్టాల్లోకి కూరుకుపోతున్న తమ రంగానికి ఉద్దీపనాలివ్వాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌, రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. 


ఇంధన డిమాండ్‌ 11 శాతం డౌన్‌ 

కరోనాతో విమానయానం, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితం కావడంతో దేశంలో ఇంధన డిమాండ్‌ మార్చి ప్రథమార్ధంలో 10-11 శాతం తగ్గింది. 


శాఖలకు రావొద్దు: యాక్సిస్‌ బ్యాంక్‌ 

బ్యాంక్‌ బ్రాంచీలకు వచ్చే బదులు నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, చాట్‌బోట్‌ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని యాక్సిస్‌ బ్యాంక్‌ తన కస్టమర్లను కోరింది.  ఈ మేరకు ఖాతాదారులకు ఈ-మెయిల్స్‌ పంపింది. 


ఆర్‌బీఐ  సిబ్బందికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ 

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తన మెజారిటీ ఉద్యోగులకు ఇంటి నుంచే ఆఫీసు పనులు చక్కబెట్టేందుకు అనుమతిచ్చింది. అన్ని రీజియన్ల కార్యాలయాల్లోని సిబ్బందికి ఆర్‌బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. 


సిబ్బందిని తొలగించవద్దు: సీఐఐ

సవాళ్ల సమయమే అయినప్పటికీ సిబ్బందిని తొలగించవద్దని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తన సభ్య కంపెనీలను కోరింది. గత ఏడాది చివరినాటికి 9,325 కంపెనీలు ఈ వాణిజ్య మండలి సభ్యత్వం కలిగి ఉన్నాయి. 


కంపెనీలకు సెబీ ఊరట 

కార్పొరేట్‌ కంపెనీలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొంత ఊరట కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు 45 రోజుల అదనపు గడువు కల్పించింది. దీంతో కంపెనీలకు నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు జూన్‌ 30 వరకు సమయం లభించనుంది. అంతేకాకుండా వార్షిక ఫలితాల సమర్పణకు నెల రోజుల అదనపు సమయం ఇచ్చింది. కంపెనీ ఒక బోర్డు సమావేశం తర్వాత మరో సమావేశం నిర్వహణకు పాటించాల్సిన గడువు విషయంలోనూ వెసులుబాటు కల్పించింది. త్రైమాసిక కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నివేదికల సమర్పణకు గడువును మే 15 వరకు పొడిగించింది. 


ఎయిర్‌లైన్స్‌కు రూ.12,000 కోట్ల ప్యాకేజీ?

దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,000-12,000 కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా ఎయిర్‌లైన్స్‌కు విమాన ఇంధన పన్నుతోపాటు ఇతర పన్నులను తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ఉంది. కాగా, కరోనా ప్రభావం నుంచి ప్రపంచవ్యాప్త ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు 20,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌   (ఐఏటీఏ) అంచనా వేసింది. 


పని ‘తీరు’ మారింది 

కరోనా నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పించడం దగ్గరి నుంచి వారి విదేశీ పర్యటనల రద్దు వరకు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పని విధానంపై టైమ్స్‌ జాబ్స్‌ సర్వే నిర్వహించింది. పలు రంగాలకు చెందిన 1,256 మంది వృత్తి నిపుణుల నుంచి వివరాలు సేకరించింది. కరోనా కారణంగా ఈ మధ్య  తమ పని విధానం తీవ్రంగా ప్రభావితమైందని 63 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. వృత్తి సంబంధిత పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని మరో 33 శాతం మంది తెలిపారు. ఐటీ రంగ ఉద్యోగులపై అధిక ప్రభావం పడిందని 27 శాతం మంది చెప్పారు. ఎగుమతి, దిగుమతి వాణిజ్యం (23ు) ఆ తర్వాత స్థానంలో ఉంది. 

Updated Date - 2020-03-20T06:22:44+05:30 IST