బ్రిటన్‌కు తిక్కరేగిందా..చైనాకు ఝలకివ్వనుందా..?

ABN , First Publish Date - 2020-03-30T21:35:51+05:30 IST

బ్రిటన్‌కు కూడా చైనా అంటే తిక్కరేగింది. కరోనా మహమ్మారి తీవ్రతను చైనా తొలి నాళ్లలో తక్కువ చేసి చూపిన కారణంగానే ప్రపంచం ప్రస్తుతం పెను విపత్తును ఎదుర్కొంటోందని బ్రిటన్ అధికార వర్గాలు భావిస్తున్నాయి.

బ్రిటన్‌కు తిక్కరేగిందా..చైనాకు ఝలకివ్వనుందా..?

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చైనా ఇమేజీ బాగా డ్యామేజ్ అయింది. ఈ మహమ్మారికి ప్రాణం పోసింది  మానవతప్పిదమా లేక ప్రభుత్వాల కుట్రా అన్న దానిపై ఇప్పటికే లెక్కకు మిక్కిలి అభ్రిపాయాలు వైరల్ అవుతున్నాయి. అయితే కరోనా విషయంలో చైనా గోప్యత పాటించిందన్న దానిపై ప్రపంచ దేశాల మధ్య ఏకాభ్రియాం ఉన్నట్టే కనిపిస్తోంది. తమ దేశంలో పురుడు పోసుకున్న వైరస్ గురించి చైనా ప్రపంచానికి ముందే తెలియజేసి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు మండిపడిన విషయం తెలిసిందే.


తాజాగా బ్రిటన్‌కు కూడా చైనా అంటే తిక్కరేగింది. కరోనా మహమ్మారి తీవ్రతను చైనా తొలి నాళ్లలో తక్కువ చేసి చూపిన కారణంగానే ప్రపంచం ప్రస్తుతం పెను విపత్తును ఎదుర్కొంటోందని బ్రిటన్ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇక కరోనా బారిన పడ్డ దేశాలకు సాయం చేస్తూ ఆయా దేశాలపై చైనా తన పట్టు బిగిస్తోందని కూడా బ్రిటన్  భావిస్తోంది. దీంతో.. ప్రస్తుత పరిస్థితులకు చైనా బాధ్యత వహించాలనే భావన అక్కడ క్రమంగా బలపడుతోంది.


గతంలో అమెరికా అభ్యంతరాలను కాదని బ్రిటన్ చైనాతో భారీ మౌలిక సదుపాయాల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటన్‌లో 5జీకి సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధి కోసం చైనా సంస్థ హువావేతో బ్రిటన్ చేతులు కలిపింది. తాజాగా ఈ ఒప్పందాన్ని బ్రిటన్ ప్రభుత్వం పునఃసమీక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


చైనా కంపెనీలతో చేయి కలపడం ద్వారా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో చైనా కాలుపెట్టడమే కాకుండా, దేశ భద్రతకు కీలకమైన మౌలిక వసతులు చైనా చేతుల్లోకి వెళతాయనే ఆందోళన బ్రిటన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘చైనా పాటించిన గోప్యత ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంత జరిగిన తరువాత కూడా ఏమీ కాలేదన్నట్టు చైనా వ్యవహరించడాన్ని మేం చూస్తూ ఊరుకోలేము’ అని ఓ బ్రిటన్ క్యాబినెట్ మంత్రి వ్యాఖ్యానించారంటే..చైనా తీరు పట్ల బ్రిటన్‌లో ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతోందో అర్థం చేసుకోవచ్చు.     

Updated Date - 2020-03-30T21:35:51+05:30 IST