బ్రిట‌న్‌ను బెంబేలెత్తిస్తున్న 'క‌రోనా'.. ఒక్కరోజే 938 మరణాలు

ABN , First Publish Date - 2020-04-10T12:59:51+05:30 IST

రెండు నెలల పసిబిడ్డను కాపాడుకొని.. కరోనాపై పోరులో తన విజయంపై ఆశలను ఇటలీ సజీవం చేసుకొంది.

బ్రిట‌న్‌ను బెంబేలెత్తిస్తున్న 'క‌రోనా'.. ఒక్కరోజే 938 మరణాలు

స్పెయిన్‌, ఇటలీని మించి ఇంగ్లండ్‌లో మృత్యుఘోష

రోమ్‌, ఏప్రిల్‌ 9: రెండు నెలల పసిబిడ్డను కాపాడుకొని.. కరోనాపై పోరులో తన విజయంపై ఆశలను ఇటలీ సజీవం చేసుకొంది. ముందు తల్లిలో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో రోమ్‌లోని బారీలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసినప్పుడు తల్లితోపాటు ఆమె పసికందుకూ కరోనా పాజిటివ్‌ తేలింది. గత నెల 18వ తేదీ నుంచి ఐసొలేషన్‌లో ఉన్న వీరిద్దరూ కోలుకొన్నారనే చల్లని కబురును గురువారం ప్రభుత్వం వినిపించింది. 


18,279 మరణాలతో ప్రపంచంలోనే అత్యంత విషాదాన్ని మోస్తున్న ఇటలీకేకాదు, మొత్తం యూర్‌పకి ఈ వార్త గొప్ప ఊరటే! గురువారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 93,575 మరణాలు చోటుచేసుకొంటే, అందులో యూర్‌పలోనే 62,402 మంది చనిపోయారు. మొత్తం 15 లక్షల పాజిటివ్‌లు తేలితే, ఒక్క ఈ దేశాల్లోనే 7.87 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేటిదాకా 3.12 లక్షలమంది ప్రాణాలతో బయటపడ్డారు. 


బ్రిటన్‌లో ఇప్పటికి 7,097 మంది చనిపోగా, 60,733 పాజిటివ్‌ కేసులు తేలాయి. అమెరికా తరువాత అంతటి తీవ్రతను మరణాల రేటులో ఇప్పుడు బ్రిటనే చవిచూస్తోంది. 24గంటల్లో ఇక్కడ 938 మరణాలు సంభవించాయి. కరోనా సోకిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆస్పత్రిలో కోలుకొంటున్నారు. ఫ్రాన్స్‌లో 1.12 లక్షల కేసులు తేలగా, 10,869 మంది మరణించారు. ఒక్కరోజులో 541 మంది ఆస్పత్రుల్లో మృత్యువాతపడ్డారు. స్పెయిన్‌లో గురువారం 728 మరణాలు చోటుచేసుకోగా, బుధవారం (757)తో పోల్చుకొని వైద్యులు, ప్రభుత్వం కొంత ఊరట పొందారు. కొత్త కేసులు, మరణాల రేటూ తగ్గాయని ప్రకటించారు.


మరో రెండువారాలపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడానికి అనుమతించాలని పార్లమెంటును ప్రధాని పెడ్రో కోరారు. ఆస్ర్టేలియాలోకి కరోనాను మోసుకొచ్చిన ఓడ మరో పది రోజులు రేవులోనే ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఈ ఓడ గత నెల 19వ తేదీన 2,700 మందితో సిడ్నీ రేవుకు చేరుకొన్ననాటినుంచే..ఈ దేశంలో కరోనా కేసులు పెరిగాయి. లాక్‌డౌన్‌ తొలగిపోయిన చైనాలో గురువారం 2 మరణాలు నమోదయ్యాయి. 


63 కొత్త కేసుల తో 1,100 మందికి ఇక్కడ పాజిటివ్‌ తేలింది. విదేశాల నుంచి వస్తున్నవారిద్వారానే రెండో విడత కేసులు పెరుగుతున్నాయ ని ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్‌లో కొత్తగా 1,634 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులోనే 117 మరణాలతో మృతులు 4,100కు చేరారు. పాక్‌లో నమోదైన 248 కేసులతో 4,322కు పాజిటివ్‌లు చేరాయి. ఒకేరోజు 287 కేసులు బయటపడటంతో సింగపూర్‌ అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశా ల్లో ఎవరూ గుమిగూడటానికి లేదంటూ ఆదేశాలు చేసింది. 

Updated Date - 2020-04-10T12:59:51+05:30 IST