మొదట ఆసుప‌త్రి కోసం వేట‌.... ఇప్పుడు మృత‌దేహం కోసం వెదుకులాట‌!

ABN , First Publish Date - 2021-05-16T16:58:35+05:30 IST

దేశ‌రాజ‌ధానిలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం...

మొదట ఆసుప‌త్రి కోసం వేట‌.... ఇప్పుడు  మృత‌దేహం కోసం వెదుకులాట‌!

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన సిద్ధార్థ కుమార్‌ త‌న సోద‌రి దీపిక‌ మృతదేహం కోసం నెల రోజులుగా ఆసుప‌త్రి చుట్టూ తిరుగుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో అతను ఈ విష‌యమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఇప్ప‌టికీ ఎటువంటి చర్యలు చేప‌ట్ట‌లేదు. దీనిగురించి సిద్ధార్థ  మీడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్ 12 న త‌న సోద‌రి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, దీంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామ‌ని, ఏప్రిల్ 15న ఆసుపత్రిలో కోవిడ్ టెస్ట్ చేయ‌గా, పాజిటివ్ నిర్ణార‌ణ అయ్యింద‌న్నారు. దీంతో ఆమెను కోవిడ్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించార‌ని తెలిపారు. 


ఈ నేప‌ధ్యంలో ప‌లు ఆసుప‌త్రుల చుట్టూ తిరిగినా బెడ్లు దొర‌క‌లేద‌ని, ఎట్టకేల‌కు లోక్ నాయక్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయ‌గ‌లిగామ‌న్నారు. అయితే అక్క‌డ‌ చికిత్స పొందుతూ ఆమె క‌న్నుమూసిందన్నారు. కాగా ఇంత‌లో అత‌ని తల్లిదండ్రులు, సోదరులు కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబ స‌భ్యులెవ‌రూ లోక్ నాయ‌క్  ఆసుప‌త్రికి వెళ్ల‌లేక‌పోయారు. అయితే ఆమె మృతి చెందింద‌ని ఆసుప‌త్రి సిబ్బంది ఫోను చేసి వారికి చెప్పారు. దీంతో సిద్ధార్థ‌ తిరిగి ఆసుప‌త్రికి వెళ్లాడు. త‌న సోద‌రి మృత‌దేహం కోసం ఆసుప‌త్రిలోని మార్చురీలో వెదికాడు. అయినా ఫ‌లితం లేకపోయింది. దీంతో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను సంప్ర‌దించినా ఫ‌లితం లేక‌పోయింది. అయితే ఆమె మృతదేహాన్ని వేరెవ‌రో తీసుకువెళ్లి  ఉండవచ్చని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో ఆ యువ‌కుడు ఈ ఉదంతంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.  త‌న సోద‌రిని చివ‌రిసారిగా కూడా చూడ‌లేక‌పోయామ‌ని సిద్ధార్థ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.

Updated Date - 2021-05-16T16:58:35+05:30 IST