Abn logo
Apr 4 2020 @ 00:31AM

కరోనా అనంతర జీవితం

ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమే. ప్రపంచ అనైక్యత వల్ల ఏర్పడే తీవ్ర ప్రమాదాన్ని మానవాళి గుర్తించేందుకు కరోనా మహమ్మారి తోడ్పడగలదని ఆశిద్దాం. జాతీయవాద అహమికతో ఒంటరిగా ఉండిపోవడమో లేక వసుధైక సంఘీభావంతో వ్యవహరించడమో మానవాళి సత్వరమే నిర్ణయం తీసుకోవాలి. సమష్టిగా పోరు జరపకపోతే కరోనా కల్లోలం సుదీర్ఘ కాలం కొనసాగడం ఖాయం. వసుధైక సంఘీభావ మార్గాన్ని ఎన్నుకుంటే అది కరోనాపై యుద్ధానికేగాకుండా భావి మహమ్మారులు, ఉపద్రవాల పైనా విజయదుందుభి మోగించడానికి తోడ్పడగలదు.


మానవాళి ఇప్పుడు ఒక ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. బహుశా, మన తరంలో అతి పెద్ద ఉత్పాతమిది. వచ్చే కొద్ది వారాల్లో ప్రజలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే, రాబోయే సంవత్సరాలలో చాలవరకు ప్రపంచాన్ని తీర్చిదిద్దనున్నాయి. అవి, కేవలం మన ఆరోగ్య భద్రతా వ్యవస్థలనే కాదు, మన ఆర్థిక కార్యకలాపాలను, రాజకీయాలు, సంస్కృతిని కూడా సరికొత్తగా రూపొందిస్తాయి. మనం ఆ నిర్ణయాలను సత్వరమే, నిర్ణయాత్మకంగా అమలుపరిచితీరాలి. మన చర్యల దీర్ఘకాలిక పర్యవసానాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రత్యామ్నాయాల మధ్య ఒక దాన్ని ఎంచుకునేటప్పుడు మనకు మనం కొన్ని ప్రశ్నలు విధిగా వేసుకుని తీరాలి. అవి: తక్షణ ముప్పును ఎలా అధిగమించగలం? ప్రస్తుత ప్రళయం సమసిపోయిన తరువాత మనం ఎటువంటి ప్రపంచంలో నివసించనున్నాము? అవును, తుఫాను వెలుస్తుంది. ప్రశాంతత నెలకొంటుంది. విపత్తు ముట్టడి నుంచి మానవాళి బయటపడుతుంది. మనలో చాలామందిమి సజీవంగా వుంటాము, సందేహం లేదు. అయితే మనం ఒక విభిన్న లోకంలో జీవించనున్నాము. 


ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే పని చేస్తున్నప్పుడు, ఒకే చోట భౌతిక దూరాన్ని పాటిస్తూ సంభాషించుకుంటున్నప్పుడు జరిగేదేమిటి? పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ విద్యాలయాలయినప్పుడు సంభవించేదేమిటి? మామూలు సమయాలలో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా వ్యవస్థలు ఇటువంటి ప్రయోగాలకు ససేమిరా అంటాయి. అయితే ఇవి సాధారణ రోజులు కావు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు మనం ఏ మార్గాన్ని అనుసరించాలి? సంపూర్ణాధికార రాజ్య నిఘాను ఆమోదించడమా లేక పౌర సాధికారతను పెంపొందించడమా? జాతీయవాద అహమికతో ఒంటరితనంతో ఉండిపోవడమా లేక వసుధైక సంఘీభావంతో వ్యవహరించడమా? ఈ ప్రత్యామ్నాయాలలో మనం వేటిని అనుసరించాలి? వివేకవంతమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు సకల జనసమూహాలు నిర్దిష్ట మార్గదర్శకాలు విధిగా అనుసరించాల్సిన అవసరమున్నది. దీన్ని సాధించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి -ప్రభుత్వాలు ప్రజల కదలికలను నిరంతరం గమనిస్తూ, నిబంధనలను ఉల్లంఘించినవారిని కఠినంగా శిక్షించడం. సమాజంలోని ప్రతి ఒక్కరిపై నిరంతర నిఘా వుంచడం ప్రభుత్వాలకు నేడు సుసాధ్యంగా వున్నది. ఇది మానవాళి చరిత్రలో ఒక అపూర్వ పరిణామం. కరోనా వైరస్‌పై పోరులో పలు ప్రభుత్వాలు ఇప్పటికే అధునాతన నిఘా సాధనాలను నియోగించాయి. చైనా ఇందుకొక ఎన్నదగిన ఉదాహరణ. 21వ శతాబ్ది ప్రభుత్వాలు నిఘాకార్యకలాపాలకు వ్యక్తులపైగాక సర్వవ్యాప్తంగా వుండే సెన్సర్లు, శక్తిమంతమైన అల్గోరిథమ్స్‌పై ఆధారపడుతున్నాయి.


ఇటీవలి సంవత్సరాలలో వ్యక్తుల ప్రైవసీపై పెద్ద పోరాటం జరుగుతోంది. కరోనా వైరస్‌పై పోరు ఈ పోరాటానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ప్రైవసీ, ఆరోగ్యం మధ్య ఒకదాన్ని కోరుకోమంటే ప్రజలు నిస్సందేహంగా ఆరోగ్యాన్నే కోరుకుంటారు. సంపూర్ణాధికార రాజ్య నిఘా వ్యవస్థలను నెలకొల్పడం ద్వారా కాకుండా పౌరులకు సాధికారత కల్పించడం ద్వారానే మనం కరోనా మహమ్మారిపై విజయవంతంగా పోరాడగలుగుతాము. పౌర సాధికారత కల్పించడమనేది కరోనాను నిలువరించేందుకు జనసమూహాలు విధిగా నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించేలా చేసేందుకు దోహదం చేసే మార్గం. కరోనాను నిలువరించడంలో దక్షిణా కొరియా, తైవాన్, సింగపూర్‌లు గణనీయమైన ఫలితాలను సాధించాయి. ఈ దేశాలు విస్తృతస్థాయిలో ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయి; ఆ పరీక్షల ఫలితాలను దాపరికం లేకుండా వెల్లడించాయి. సమస్యపై మెరుగైన అవగాహన వున్న పౌరుల తోడ్పాటు వల్లే ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. చెప్పవచ్చేదేమిటంటే ప్రజలు నిర్దేశిత మార్గదర్శక సూత్రాలను అనుసరించేలా చేసేందుకు కేంద్రీకృత పర్యవేక్షణ, కఠిన శిక్షలు మాత్రమే ఏకైక మార్గం కాదు. ప్రజలకు వైజ్ఞానిక వాస్తవాలను చెప్పినప్పుడు, ఆ వాస్తవాలను చెప్పిన ప్రభుత్వాధికారులను విశ్వసించినప్పుడు పౌరులు స్వచ్ఛందంగా అనివార్య మార్గదర్శకాలను పాటిస్తారు. తమపై ఎలాంటి నిఘాలేకుండానే వారు సరైన విధంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. 


అటువంటి ఆచరణ స్థాయిని, స్వచ్ఛంద సహకారాన్ని సాధించాలంటే మీకు నమ్మకం అవసరం. ప్రజలు సైన్స్‌ను విశ్వసించాలి; ప్రభుత్వాధికారులను విశ్వసించాలి; మీడియాను విశ్వసించాలి. గత కొద్ది సంవత్సరాలుగా బాధ్యతారహిత రాజకీయవేత్తలు ఉద్దేశపూర్వకంగా సైన్స్‌లో నమ్మకాన్ని సడలింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతారహిత రాజకీయవేత్తలే, సరైన పనిచేస్తారని ప్రజలను విశ్వసించలేమనే వాదన చేస్తున్నారు. ఇటువంటి వాదనలతో వారు నిరంకుశాధికార పాలనను తీసుకువచ్చే ప్రమాదం ఎంతైనా వున్నది. 


సంక్షోభ సమయంలో మనుషుల ఆలోచనలు కూడా వేగంగా మారిపోతాయి. మీ తోబుట్టువులతో మీరు తీవ్రంగా విభేదిస్తుండవచ్చు. అయితే సంక్షోభ సమయంలో వారిలో మీకు ఆకస్మికంగా విశ్వాసం కలుగుతుంది. మైత్రీ భావం పెంపొందతుంది. పరస్పరం సహాయం చేసుకుంటారు. నిఘా వ్యవస్థలను అభివృద్ధిపరిచే బదులు, సైన్స్, పబ్లిక్ అథారిటీస్, మీడియాలో ప్రజలు విశ్వాసాన్ని పెంపొందించాలి. ఇందుకు సమయం మించిపోలేదు కొత్త సాంకేతికతలను కూడా ఉపయోగించుకోవాలి. అయితే వీటిని పౌరులకు సాధికారత కల్పించడానికే ఉపయోగించాలి. కరోనా మహమ్మారి నిర్మూలన మన పౌర ధర్మాలకు ఒక ప్రధాన పరీక్ష. మరి రాబోయే రోజుల్లో మనలో ప్రతి ఒక్కరూ కుట్ర సిద్ధాంతాలు, స్వార్థపరులైన రాజకీయవేత్తల వాదనలను త్రోసిపుచ్చి వైజ్ఞానిక సమాచారాన్ని ఆరోగ్య భద్రతా నిపుణులను విశ్వసించాలి. సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే విలువైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మనం కోల్పోతాము. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోవడానికి ఆమోదించడం అనుచితమవుతుంది. కరోనాను నిలువరించేందుకు పౌరులకు సాధికారత కల్పించే మార్గాన్నే మనం అనుసరించాలి.


మరి జాతీయవాద అహమికతో ఒంటరిపాటుగా ఉండిపోవడం, వసుధైక సంఘీభావం.. ఈ రెంటిలో దేన్ని ఎంచుకోవాలో చూద్దాం. కరోనా మహమ్మారి మాత్రమే కాదు, దాని పర్యవసానమైన ఆర్థిక సంక్షోభం కూడా ప్రపంచ సమస్యే. అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే ఆ సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోగలం. కరోనా వైరస్‌ను నిర్జించాలంటే తొట్ట తొలుత ఆ విషక్రిమి సంబంధిత సమాచారాన్ని అంతర్జాతీయంగా పంచుకోవాల్సిన అవరమున్నది. ఈ విషయంలో వైరస్‌లకు లేని ఒక మహా సానుకూలత మానవులకు ఉన్నది. చైనాలోని ఒక కరోనా వైరస్, అమెరికాలోని ఒక కరోనా వైరస్ మానవులకు ఏ విధంగా సంక్రమించాలనే విషయమై పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోలేవు. అయితే కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయమై అమెరికాకు చైనా విలువైన పాఠాలు చెప్పగలదు. మిలన్‌లో ఒక ఇటాలియన్ డాక్టర్ ఒక తెల్లవారుజామున కనిపెట్టిన ఔషధంతో అదే రోజు సాయంత్రానికి ఇరాన్‌లో వేలాది కరోనా వ్యాధిగ్రస్తులను కాపాడడం సాధ్యమవుతుంది. బ్రిటన్ ప్రభుత్వం పలు విధానాలలో దేన్ని అనుసరించాలనే విషయమై తటపటాయిస్తున్నప్పుడు, నెలరోజుల క్రితం అటువంటి సందిగ్ధతనే ఎదుర్కొన్న దక్షిణ కొరియా నుంచి ప్రయోజనకరమైన సలహాలను పొందగలదు ఇవి జరగాలంటే అంతర్జాతీయ సహకార స్ఫూర్తి, పరస్పర విశ్వాసం ఎంతైనా అవసరం.


కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలు ఇతర దేశాలతో స్వేచ్ఛగా పంచుకోవాలి. ఇతర దేశాల అనుభవాల నుంచి నేర్చుకునేందుకు వాటి సలహా సూచనల కోసం వినయపూర్వకంగా అభ్యర్థించాలి. వైద్య పరికరాలను మరీ ముఖ్యంగా టెస్టింగ్ కిట్లు, శ్వాసక్రియా సాధనాల ఉత్పత్తి, పంపిణీకి అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నాలు జరగాలి. ఏ దేశానికాదేశం స్థానికంగా తయారు చేసుకోవడం కాకుండా, అంతర్జాతీయ స్థాయి సమష్టి ప్రయత్నాలలో భాగమయితే ప్రాణాంతక కరోనా వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన వైద్య పరికరాలను, ఔషధాల ఉత్పత్తిని మరింత వేగవంతంగా చేసేందుకు దోహదం జరుగుతుంది. వాటిని అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా సుసాధ్యమవుతుంది, యుద్ధకాలంలో కీలక పరిశ్రమలను జాతీయీకరణ చేసిన విధంగానే కరోనా వైరస్‌పై మానవ సమరానికి, ముఖ్యమైన ఉత్పత్తి సాధనాలను మానవీయీకరణ చేయడం కూడా చాలా ముఖ్యం. కరోనా కేసులు స్వల్పంగా వున్న దేశం విలువైన వైద్య పరికరాలను అవి అవసరమైన మరో పేద దేశానికి పంపించాలి. అలాగే ఆ దేశానికి ఏమైనా అత్యవసరమయినప్పుడు మిగతా దేశాలు దానిని ఆదుకోవాలి. వైద్య సిబ్బందిని కూడా అంతర్జాతీయంగా ఉపయోగించుకోవాలి. కరోనా కేసులు తక్కువగా ఉన్న దేశాలు తమ వైద్య సిబ్బందిని ఆ మహమ్మారితో అతలాకుతలమవుతున్న దేశాలకు పంపించాలి బాధితులను ఆదుకోవడానికే కాదు, వ్యాధి నివారణలో విలువైన పాఠాలు నేర్చుకునేందుకు, అనుభవాలు సమకూర్చుకునేందుకు కూడా ఇలా చేయడం విశేషంగా తోడ్పడుతుంది.


ఆర్థిక రంగంలో కూడా అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యం. ఈ ప్రపంచీకరణ యుగంలో ప్రతి ప్రభుత్వమూ తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తే పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. సంక్షోభం మరింతగా విషమిస్తుంది. కరోనా కట్టడికి ప్రపంచ స్థాయి కార్యాచరణ పథకం అవసరం. దాన్ని సత్వరమే రూపొందించి అమలుపరచాలి. ప్రయాణాలపై కూడా అంతర్జాతీయ ఒప్పందానికి రావాలి. నెలల తరబడి అంతర్జాతీయ ప్రయాణాలను రద్దుచేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కరోనాపై యుద్ధానికి అది ఆటంకమవుతుంది. కనీసం కొంత మంది ఆవశ్యక వ్యక్తులు–-శాస్త్రవేత్తలు, డాక్టర్లు, జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు–ఇతర దేశాలకు ప్రయాణించడానికి అనుమతించాలి. ప్రయాణీకులకు స్వదేశంలోనే ప్రీ-స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ తరువాతే విమానం ఎక్కేందుకు అనుమతించేలా ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఏ దేశమూ పైన పేర్కొన్న విషయాలలో దేనినీ పాటించడం లేదు. అంతర్జాతీయ సమాజం ఒక ఉమ్మడి వైకల్యం బారినపడింది. కొన్ని వారాల క్రితమే ప్రపంచ నాయకులు అత్యవసరంగా సమావేశమై ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించి వుండవలసింది. కానీ అలా జరగలేదు ఇంతకుముందు సంభవించిన అంతర్జాతీయ సంక్షోభాలలో- (2008 ఆర్థిక మాంద్యం, 2014 ఎబోలా మహమ్మారి) అమెరికా నాయకత్వ పాత్ర వహించింది. అయితే ప్రస్తుత సంక్షోభంలో అమెరికా తన నాయకత్వ పాత్రను త్యజించింది. అమెరికా త్యజించిన నాయకత్వ స్థానాన్ని ఇతర దేశాలు భర్తీచేయాలి. లేనిపక్షంలో కరోనాపై యుద్ధం మరింత కఠినతరమూ, అసాధ్యమైపోతుంది. అంతేగాక అంతర్జాతీయ సంబంధాలపై అది రా బోయే చాలా సంవత్సరాల వరకు విషపూరిత ప్రభావాన్ని నెరపుతుంది. అయితే ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమే. ప్రపంచ అనైక్యత వల్ల ఏర్పడే తీవ్ర ప్రమాదాన్ని మానవాళి గుర్తించేందుకు కరోనా మహమ్మారి తోడ్పడగలదని ఆశిద్దాం.


మానవాళి సత్వరమే ఒక నిర్ణయాన్ని తీసుకోవల్సిన అవసరమున్నది. అనైక్యతా మార్గంలో ప్రయాణించడమా లేక వసుధైక సంఘీభావ పథాన్ని అనుసరించడమా? అనైక్యతా మార్గంలోనే కొనసాగితే కరోనా కల్లోలం మరెంతో కాలం కొనసాగడమేగాక భవ్యిష్యత్తులో మరింత భయంకరమైన సంక్షోభానికి కారణం కాగలదు. వసుధైక సంఘీభావ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకుంటే అది కరోనాపై యుద్ధానికే గాకుండా భవిష్యత్తులో మానవాళిపై విరుచుకుపడే మహమ్మారులు, ఉపద్రవాలపైన కూడా విజయదుందుభి మోగించడానికి తోడ్పడగలదు. 


యువల్ నోఅ హరారీ

(వ్యాసకర్త చరిత్రకారుడు, ఇజ్రాయిల్ పౌరుడు. ఆయన సుప్రసిద్ధ పుస్తకం ‘సేపియన్స్’ తెలుగుతో సహా పలు ప్రపంచ భాషలలోకి అనువదితమయింది. ఇది లండన్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’లో వెలువడిన వ్యాసానికి సంక్షిప్త, స్వేచ్ఛానువాదం.)

Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...