అగ్రరాజ్యంలో అల్లకల్లోలం

ABN , First Publish Date - 2020-03-28T07:05:44+05:30 IST

కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 16,877 కేసులు నమోదుతో బెంబేలెత్తిపోయింది. మరణాల సంఖ్య 1400 దాటిపోగా.. కేసులు...

అగ్రరాజ్యంలో అల్లకల్లోలం

ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో.. ఒక్కరోజులోనే 16,877 

వారం క్రితం 8 వేలే.. ఇప్పుడు పదింతలు.. చైనా, ఇటలీలను దాటేసింది

1400కు చేరువలో  మరణాలు.. విషమ స్థితిలో మరో 2వేల మంది

80వేల మంది చనిపోవచ్చంటున్న నిపుణులు.. అయినా ట్రంప్‌ బేఫికర్‌


వాషింగ్టన్‌, మార్చి 27: కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 16,877 కేసులు నమోదుతో బెంబేలెత్తిపోయింది. మరణాల సంఖ్య 1400 దాటిపోగా.. కేసులు 93 వేలు దాటిపోయాయి. వారం క్రితం ఇవి కేవలం 8 వేలే. ఇంత తక్కువ వ్యవధిలో 11రెట్లు పెరిగిపోతాయని ఊహించలేదని, వ్యాధి మూడో దశను కూడా దాటిపోతోందని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు చెప్పారు. కేసుల సంఖ్యలో అమెరికా.. చైనా (81,340), ఇటలీ (80,589)లను మించిపోయింది. అయితే, మరణాల్లో ఇటలీ కంటే తక్కువ. ‘‘ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించినా, పెద్ద సంఖ్యలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినా కూడా మరణాల సంఖ్య 80 వేలు దాటవచ్చు. వ్యాధి తీవ్రత, వ్యాప్తి అలా ఉంది మరి! ఏప్రిల్‌ 12కల్లా మళ్లీ దేశ ఆర్థికరంగ కార్యకలాపాలు మొదలెట్టేస్తామని ట్రంప్‌ చెబుతున్నా అది ఆచరణ సాధ్యం కాదు. ప్రజలకు కాస్త ఆశావహమైన పరిస్థితిని కల్పించడమే ఆయన ఉద్దేశం’’ అని ఆరోగ్య నిపుణుడు ఆంథోనీ ఫాసీ అన్నారు. 


న్యూయార్క్‌కు పెద్ద దెబ్బ

అనేక ప్రపంచస్థాయి కార్యాలయాలకు, కంపెనీల హెడ్‌క్వార్టర్లకు నెలవైన న్యూయార్క్‌ నగరం ఇపుడు కొవిడ్‌-19కు కేంద్ర స్థానంగా మారింది. గురువారమే అక్కడ 177 మంది చనిపోయారు. దీంతో నగరంలో మరణాల సంఖ్య 365కు పెరిగింది. కేసులు కూడా ఇక్కడే ఎక్కువ. ఇప్పటిదాకా 23,112 మందికి వైరస్‌ సోకింది. న్యూయార్క్‌ రాష్ట్రంలో  40వేల మందికి  ప్రబలింది. 457 మంది మరణించారు. వాషింగ్టన్‌ డీసీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఇల్లినాయి, మిచిగన్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సస్‌, లూసియానా, జార్జియాల్లోనూ కొవిడ్‌ ఉద్ధృతి ఉంది. లూసియానాలో వైరస్‌ వ్యాప్తి 30 శాతానికి పైగా పెరిగింది. చికాగో, డెట్రాయిట్‌ చుట్టుపక్కల కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు శ్వేతసౌధంలో కరోనా సమన్వయకర్త డెబ్రా బర్క్స్‌ చెప్పారు.  


ట్వీట్లు ఆపి.. కార్యాచరణకు దిగండి

అమెరికా అంతటా మాస్క్‌లు, ఐసీయూలు, వైద్య ఉపకరణాల కొరత విపరీతంగా ఉంది. వ్యాధి నియంత్రణకు సకాలంలో స్పందించడం లేదంటూ ట్రంప్‌- ప్రతిపక్షమైన డెమొక్రాట్ల అధీనంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లను మరోమారు తీవ్రంగా విమర్శించారు. ‘ఇది మీ వైఫల్యమంటూ’ తిట్టిపోశారు. దీనిపై ఇల్లినాయి, మిచిగన్‌ సహా పలు రాష్ట్రాల గవర్నర్లు మండిపడ్డారు. అఽధ్యక్ష ఎన్నికల కోసమే తన వైఫల్యాలను ట్రంప్‌ కప్పిపుచ్చుకోజూస్తున్నారని, నెపం తమపై నెడుతున్నారని  విమర్శించారు. ‘ట్విటర్‌ పోస్టులు పెట్టడం ఆపి మొదట కార్యాచరణ మొదలెట్టండి’ అని ఏకిపారేశారు. 


కొవిడ్‌-19 వైరస్‌ సోకితే ఊపిరితిత్తులు ఇలా మారిపోతాయి. ఇన్ఫెక్షన్‌ వ్యాపించిన భాగాన్ని పసుపుపచ్చ రంగులో చూడొచ్చు. కరోనా వైరస్‌ తీవ్రతను వివరించే త్రీడీ వీడియోను జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీ ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆ రోగి ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని ఆస్పత్రి ఽథొరాసిక్‌ సర్జరీ చీఫ్‌ డాక్టర్‌ కీత్‌ మోర్టమన్‌ వివరించారు.


మానవాళికే శత్రువు: ట్రంప్‌తో జీ జిన్‌పింగ్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ‘ఇది మానవాళికి, యావత్‌ ప్రపంచానికే శత్రువు. సరిహద్దులను దాటిపోయింది. తీవ్రతను గుర్తించిన వెంటనే మేం హ్యూబై రాష్ట్రాన్ని దిగ్బంధించాం. వుహాన్‌ నగరంలో లక్షలమందిని ఇళ్లకే పరిమితం చేశాం. దీనిని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలి. ఉమ్మడిగా శాస్త్ర పరిశోధనలు చేయాలి. మేం చేసిన వైరస్‌ జీన్‌ మ్యాపింగ్‌ను కూడా మీకు అందిస్తాం’ అని జిన్‌పింగ్‌ చెప్పారు. గతంలో వైరస్‌ జన్మస్ధానం చైనా అని గుర్తించాలని భద్రతామండలిలో అమెరికా  ఓ తీర్మానం ఆమోదింపచేయాలని ప్రయత్నించగా చైనా అడ్డుకుంది. ఇది తీర్మానాలు చేసే సమయం కాదని హితవు పలికింది. జిన్‌పింగ్‌తో మాట్లాడాక ట్రంప్‌ మాటతీరు మారింది. 

Updated Date - 2020-03-28T07:05:44+05:30 IST